OTT Telugu Romantic Comedy: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కడుపుబ్బా నవ్వించే తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. ప్రియదర్శి, నభా నటేష్ నటించిన ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
OTT Telugu Romantic Comedy: రాబోయే లాంగ్ వీకెండ్ కోసం ఈ వారం చాలా సినిమాలే ఓటీటీల్లోకి వస్తున్నాయి. అందులో భాగంగా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రానుంది. ప్రియదర్శి, నభా నటేష్ నటించిన డార్లింగ్ మూవీ అది. థియేటర్లలో రిలీజైన తర్వాత నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
డార్లింగ్ ఓటీటీ రిలీజ్
ఈ వారం పంద్రాగస్టు, వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీలాంటి వాటితో వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లాంగ్ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి ఓటీటీల్లోకి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఈ డార్లింగ్ మూవీ. ఏ సినిమా అయినా తన నటనతో మెప్పించే ప్రియదర్శి, అందాల భామ నభా నటేష్ నటించిన ఈ మూవీ బుధవారం (ఆగస్ట్ 13) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చెబుతూ.. "రెస్క్యూ మిషన్ యాక్టివేటెడ్", "ఓ వింత పెళ్లికి ఇది ఆరంభం. డార్లింగ్ మీ హాట్‌స్టార్ లో ఆగస్ట్ 13 నుంచి" అనే క్యాప్షన్లతో సదరు ఓటీటీ ట్వీట్లు చేసింది.
డార్లింగ్ కథేంటంటే?
మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. తాను అనుకున్న కథను కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో డార్లింగ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. డార్లింగ్ మూవీలో అనన్య నాగళ్ల గెస్ట్ రోల్‌లో కనిపించింది. బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు.
రాఘవ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకొని భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలన్నది రాఘవ కల. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన రాఘవకు పెళ్లవ్వదు. చివరకు చైల్డ్‌వుడ్ ఫ్రెండ్ నందినితో (అనన్య నాగళ్ల) రాఘవ పెళ్లిని పెద్దలు ఫిక్స్ చేస్తారు మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగాల్సిఉండగా రాఘవను కాదని తను ప్రేమించిన అబ్బాయితో నందిని వెళ్లిపోతుంది.
పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో అవమానం తట్టుకోలేక రాఘవ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. రాఘవ ఆత్మహత్య చేసుకోకుండా ఆనంది (నభానటేష్)అతడిని కాపాడుతుంది. ఆనంది గతం గురించి ఏం తెలియకుండానే పరిచయమైన కొద్ది గంటల్లోనే ఆమెను పెళ్లిచేసుకుంటాడు రాఘవ.
ఫస్ట్ నైట్ రోజే భార్యకు మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందనే నిజం రాఘవకు తెలుస్తుంది. ఆనంది ఒక్కరు కాదని, ఆమెలో ఐదుగురు దాగిఉన్నారని అర్థమవుతుంది. ఆనందికి ఉన్న ఆ ఐదుగురు ఎవరు? భార్యకు ఉన్న మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కారణంగా రాఘవ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ప్రియా (నభానటేష్)కు ఆనందికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే డార్లింగ్ మూవీ కథ.