Darling Review: డార్లింగ్ రివ్యూ - ప్రభాస్ టైటిల్‌తో వచ్చిన ప్రియదర్శి, నభానటేష్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Darling Review: ప్రభాస్ బ్లాక్‌బస్టర్ టైటిల్‌తో ప్రియదర్శి, నభానటేష్ చేసిన డార్లింగ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Darling Review: ప్రియదర్శి, నభానటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డార్లింగ్ మూవీ టీజర్, ట్రైలర్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ప్రభాస్ టైటిల్ తెరకెక్కిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్‌ను నవ్వించిందా? లేదా? అంటే?
రాఘవ పెళ్లి కష్టాలు...
రాఘవ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తల్లి చెప్పిన మాటల కారణంగా చిన్నతనం నుంచే పెళ్లి గురించి రాఘవకు ఎన్నో కలలు ఉంటాయి. అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకొని భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలన్నది రాఘవ కల. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన రాఘవకు పెళ్లవ్వదు. చివరకు చైల్డ్‌వుడ్ ఫ్రెండ్ నందినితో (అనన్య నాగళ్ల) రాఘవ పెళ్లిని ఫిక్స్ చేస్తారు పెద్దలు. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి జరగాల్సిఉండగా రాఘవను కాదని తను ప్రేమించిన అబ్బాయితో నందిని వెళ్లిపోతుంది.
పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో అవమానం తట్టుకోలేక రాఘవ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. రాఘవ ఆత్మహత్య చేసుకోకుండా ఆనంది (నభానటేష్) ఆపుతుంది. ఆనంది అందం, మాటలకు ఫిదా అవుతాడు రాఘవ్. ఆనంది గతం గురించి ఏం తెలియకుండానే పరిచయమైన కొద్ది గంటల్లోనే పెద్దలు వారిస్తున్నా వినకుండా వారిని ఎదురించి మరి ఆమెను పెళ్లిచేసుకుంటాడు.
ఫస్ట్ నైట్ రోజే భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందనే నిజం రాఘవకు తెలుస్తుంది. ఆనంది ఒక్కరు కాదని, ఆమెలో ఐదుగురు దాగిఉన్నారని తెలుసుకుంటాడు రాఘవ. ఆనందికి ఉన్న సమస్య కారణంగా రాఘవ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాడు? ప్రియా (నభానటేష్)కు ఆనందికి ఉన్న సంబంధం ఏంటి? ఈ సమస్య నుంచి భార్యను రాఘవ ఎలా బయటపడేశాడు? అన్నదే డార్లింగ్(Darling Review) మూవీ కథ.
అపరిచితుడు...అ!
స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో గతంలో వచ్చిన శంకర్ అపరిచితుడు, ప్రశాంత్ శర్మ అ! వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సమస్యను అపరిచితుడు, అ! సినిమాల్లో సీరియస్‌గా చూపించారు ఆయా దర్శకులు. వారికి భిన్నంగా స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్ ను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా డార్లింగ్ మూవీలో(Darling Review) ఆవిష్కరించాడు దర్శకుడు అశ్విన్ రామ్.
భార్యభర్తల ఫన్ డ్రామాకు ఈ పాయింట్‌ను జోడించి డార్లింగ్ మూవీని తెరకెక్కించాడు. పెళ్లి తర్వాతే భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలిసి ఓ భర్త ఏం చేశాడు? ఒక్కోసారి ఒక్కో కొత్త వ్యక్తిలా ప్రవర్తించే భార్య కారణంగా అతడు ఎలాంటి బాధలు పడ్డాడనే పాయింట్ నుంచి కామెడీ రాబట్టుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు.
ఫస్ట్ హాఫ్ ఫన్...
ఫస్ట్ హాఫ్ రాఘవ పెళ్లి ప్రయత్నాలు, నందినితో మ్యారేజ్ ఫెయిలవ్వడం లాంటి సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా సాగుతుంది. ఈ ట్రాక్‌లను పంచ్‌లు, ఫన్నీ డైలాగ్స్‌లో డైరెక్టర్ బోర్ కొట్టకుండా నడిపించాడు. ఆనందికి డిజార్డర్ ఉందనే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్.
భార్యలో ఉన్న ఐదుగురు అపరిచితుల కారణంగా రాఘవ సతమతమయ్యే సీన్స్‌తో సెకండాఫ్‌ను రన్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. ఆనంది అసలు ఎవరు? ఆమె గతం ఏమిటన్నది చూపిస్తూనే భార్య కోసం ప్రేమ కోసం రాఘవ పడే తపనలోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి.
కన్ఫ్యూజన్ ఎక్కువే...
స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్‌ను స్క్రీప్‌పై ప్రజెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఏ మాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. డార్లింగ్ మూవీలో అదే జరిగింది. దర్శకుడు చాలా చోట్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా వచ్చే ఆ సీన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. ఆనందిలోకి ఐదుగురు (పాప, శ్రీశీ, ఝూన్సీ, మాయ, ఆది) ఎలా వచ్చారన్నది క్లారిటీగా చూపించలేకపోయాడు.
ఈ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లోని ఫన్, డ్రామా, ఎమోషన్స్ ఏది సరిగా పండలేదనిపిస్తుంది. ఒకానొక టైమ్‌లో స్క్రీన్‌పై ఏం జరుగుతుందో అర్థంకానీ ఫీలింగ్ కలుగుతుంది. అంతర్లీనంగా మహిళలకు స్వేచ్ఛ కు సంబంధించి ఓ సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు డైరెక్టర్. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్‌ను ఎఫెక్టివ్‌గా రాసుకుంటే బాగుండేది.
నభా వేరియేషన్స్...
డార్లింగ్ మూవీతోనే లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది నభా నటేష్(Nabha Natesh). స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధఫడే యువతిగా ఆమె నటన బాగుంది. క్యారెక్టర్‌లో వేరియేషన్స్ చూపిచేందుకు బాగానే కష్టపడింది.
ప్రియదర్శి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. మురళీధర్‌గౌడ్, రఘుబాబు కామెడీ పర్వలేదనిపిస్తుంది. బ్రహ్మనందం క్యారెక్టర్‌ను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. అనన్య నాగళ్లది కాసేపు కనిపించే క్యారెక్టర్ మాత్రమే.
కామెడీ ఓకే కానీ...
డార్లింగ్ కామెడీ పరంగా టైమ్‌పాస్ చేస్తుంది. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లోనే డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యి ఆడియెన్స్‌ను గందరగోళానికి గురిచేసిన ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్: 2/5