Bharateeyudu 2 Review: భారతీయుడు 2 రివ్యూ - సేనాపతిగా కమల్ మెప్పించాడా? సీక్వెల్‌తో శంకర్ మ్యాజిక్ చేశాడా?
Bharateeyudu 2 Review: కమల్‌హాసన్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అంటే?
Bharateeyudu 2 Review: కమల్‌హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కలయికలో 1996లో వచ్చిన ఇండియన్ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడు 2 పేరుతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు శంకర్. సేనాపతి పాత్రలో మరోసారి కమల్‌హాసన్ కనిపించిన ఈ మూవీ శుక్రవారం పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్ భారతీయుడు 2లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సీక్వెల్ తో శంకర్ ప్రేక్షకులను మెప్పించాడా? సేనాపతిగా కమల్ యాక్టింగ్ ఎలా ఉందంటే?
సేనాపతి రీఎంట్రీ...
చిత్ర అరవింద్ (సిద్ధార్థ్) ఓ యూట్యూబర్. అవినీతి, లంచగొండి ఆఫీసర్ల అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా బయటపెడుతుంటాడు. సామాన్యులకు జరిగిన అన్యాయాలను తమ ఛానెల్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తుంటాడు. యూట్యూబ్ ఛానెల్ కారణంగా అరవింద్, అర్తి (ప్రియా భవానీ శంకర్) టీమ్‌కు శత్రువులు పెరిగిపోతారు.వారి జీవితాలు చిక్కుల్లో పడతాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే భారతీయుడు మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటారు. చైనీస్ తైపే నుంచి ఇండియాకు వస్తాడు సేనాపతి.
అవినీతిపరులను అంతమొందిస్తుంటాడు. మరోవైపు సేనాపతిని పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) ప్రయత్నిస్తుంటాడు. సేనాపతిమళ్లీ ఇండియాలోకి అడుగుపెట్టడానికి అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా? సేనాపతి ఇండియాకు రావాలని పిలుపు నిచ్చిన అరవింద్ తో పాటు చాలా మంది యువత అతడిని ద్వేషించడానికి కారణం ఏమిటి? గో బ్యాక్ ఇండియన్ అని ఎందుకు పిలుపునిచ్చారు? అరవింద్ తల్లి ఆత్మహత్యకు కారణమేమిటి?
అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్న తండ్రి (సముద్రఖని) గురించి అరవింద్‌కు ఎలాంటి నిజం తెలిసింది? అరవింద్ అండ్ టీమ్‌కు సహాయం చేసిన దిశ (రకుల్ ప్రీత్ సింగ్) ఎవరు? సేనాపతిని సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ పట్టుకున్నాడా? లేదా? అన్నదే భారతీయుడు 2 (Bharateeyudu 2 Review) మూవీ కథ.
సామాజిక సమస్యలతో...
కమర్షియల్ సినిమాలు తీయడంలో దర్శకుడు శంకర్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. తొలి సినిమా జెంటిల్‌మెన్ నుంచి 2.ఓ వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సమస్యను టచ్ చేస్తూ వచ్చారు శంకర్. ఈ సోషల్ ఇష్యూకు కమర్షియల్ హంగులను, టెక్నాలజీని జోడించి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటాడు శంకర్.
భారతీయుడు 2లో అదే ఫార్ములా...
భారతీయుడు 2 (Bharateeyudu 2 Review)ఆ కోవకు చెందిన సినిమానే. భారతీయుడు సినిమాలోని సేనాపతి క్యారెక్టర్‌ను ప్రధానంగా తీసుకొని నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఈ సీక్వెల్‌ను చేయాలని శంకర్ అనుకున్నారు. ఇండియన్ కల్ట్ క్లాసిక్‌గా నిలవడం, అందులో సేనాపతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం కారణంగా ఇండియన్ 2 కోసం తెలుగు, తమిళ ఆడియెన్స్ చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం మాత్రం దక్కలేదు. ఇండియన్ మ్యాజిక్‌ను సీక్వెల్ తో అందించలేకపోయాడు శంకర్.
పాయింట్ బాగుంది కానీ....
తమకున్న అధికారాలను అడ్డంపెట్టుకొని కొందరు నాయకులు ప్రజలను ఎలా దోచుకుంటున్నారు, బ్యాంకులకు కోట్ల రూపాయలను ఎగవేస్తూ ఎలా స్వేచ్ఛగా తిరుగుతున్నారనే అంశాలతో భారతీయుడు కథను రాసుకున్నాడు శంకర్. విజయ్ మాల్యా లాంటి అవినీతి పరుల జీవితాలను కొన్ని పాత్రల ద్వారా చర్చించడం బాగుంది.
ముఖ్యంగా తల్లిదండ్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా యువత అడ్డుకుంటే సమాజం బాగుపడుతుందనే పాయింట్‌ను సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాలని శంకర్ అనుకున్నారు. పేపర్‌పై పెట్టిన ఆలోచనలను స్క్రీన్‌పై తీసుకురావడంలో శంకర్ తడబడినట్లుగా అనిపిస్తోంది. సినిమా కథలో ఎమోషనల్ కనెక్టివీటి లేకపోవడంలో భారతీయుడు 2 (Bharateeyudu 2 Review)మొత్తం మిస్ ఫైర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
కమల్ ఎంట్రీ అదుర్స్...
దేశంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను చర్చిస్తూ ఇండియన్ 2 సినిమాను ఆసక్తికరంగా ఆరంభించారు శంకర్. కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయినట్లుగా చూపించి కమల్ క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై చూపించారు. బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాల్లోజల్సాలు చేస్తోన్న ఓ వ్యాపారిని అంతం చేసే యాక్షన్ సీన్ తో కమల్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచే కథాగమనం మొత్తం రొటీన్‌గా మారిపోయింది.
ఒక్కో అవినీతి పరుడిని కమల్ అంతం చేసుకుంటూ వెళ్లిపోవడం, వాటిని పార్ట్ పార్ట్‌లుగా చూపించుకుంటూ వెళ్లిపోయారు శంకర్. సిద్ధార్థ్ అతడి తండ్రి ఎపిసోడ్.... తెలుగులో చిరంజీవి ఠాగూర్ మూవీలోని ఓ సీన్ ను గుర్తుకు తెస్తుంది. మదర్ సెంటిమెంట్ సీన్స్‌ను మరింత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేశారు శంకర్. కానీ లెంగ్త్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 3కి సంబంధించి కమల్, కాజల్‌పై వచ్చే అప్‌డేట్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగించింది.
సేనాపతిగా నట విశ్వరూపం...
సేనాపతిగా కమల్ హాసన్ యాక్టింగ్‌కు ఎలాంటి వంకా పెట్టలేం. యాక్షన్ తో పాటు తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. అయితే కమల్ హాసన్ లుక్ విషయంలో శంకర్ అండ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్ కంటే సిద్ధార్థ్ ఎక్కువ సేపు స్క్రీన్‌పై కనిపిస్తాడు.
ఎమోషనల్ సీన్స్‌లో సిద్ధార్థ్ మెప్పించాడు. సిద్ధార్థ్ తండ్రిగా సముద్రఖని నటన బాగుంది. ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్స్ రొటీన్‌గా ఉన్నాయి. భారతీయుడులోని నడిముడి వేణు క్యారెక్టర్‌తో సీక్వెల్‌లో బాబీ సింహా పాత్రకు లింగ్ చేయడం ఆకట్టుకుంటుంది. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ బీజీఎమ్, పాటలు ప్లసయ్యాయి. సీక్వెల్‌కు మ్యూజిక్ మైనస్‌గా మారింది. అనిరుధ్ బీజీఎమ్ పవర్ కనిపించలేదు. పాటలు సినిమా లెంగ్త్‌ను పెంచడానికే ఉపయోగపడ్డాయి.
శంకర్ మార్కు మిస్...
భారతీయుడు తో కంపేర్ చేస్తూ సీక్వెల్ చూస్తే పూర్తిగా ఆడియెన్స్ డిసపాయింట్ కావడం ఖాయం. కథ, కథనాల పరంగా శంకర్ మార్కు ఎమోషన్స్, మ్యాజిక్ ఈ సినిమాలో ఎక్కడ కనిపించదు. కమల్ హాసన్ యాక్టింగ్ ఒక్కటే సినిమాకు రిలీఫ్‌కు చెప్పవచ్చు.
రేటింగ్: 2/5