కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో రూపొందిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నది. ఆస్కార్ కోసం ఇండియా నుంచి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఎంట్రీలో నిలిచినా తుదిజాబితాలో చోటుదక్కించుకోలేకపోయింది. తమిళంతో పాటు తెలుగులో పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ను 2019లో లాంఛనంగా ప్రారంభించారు కమల్ హాసన్, శంకర్.
సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో కమల్‌హాసన్ లుక్‌ను రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, ప్రియాభవానీశంకర్‌తో పాటు పలు భాషలకు చెందిన నటీనటులు కీలక పాత్రలను పోషించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చెన్నైలోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదం చోటుచేసుకోవడంతో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించారు. ఈ ప్రమాదం కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది.ఆ తర్వాత శంకర్‌కు, చిత్ర నిర్మాణ సంస్థ లైకాకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి.
దర్శకుడికి వ్యతిరేకంగా నిర్మాత కోర్టును ఆశ్రయించడంతో సినిమాను పూర్తిగా నిలిచిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఆ ఊహలను మరింత బలం చేకూర్చుతూ ఈ సినిమాను పక్కనపెట్టిన శంకర్..రామ్‌చరణ్ తో పాన్ ఇండియా చిత్రం మొదలుపెట్టడంతో ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అనుకున్నారు.
బుధవారం చెన్నైలో జరిగిన విక్రమ్ సినిమా ప్రెస్‌మీట్ లో ఇండియన్ 2 పై కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఆగిపోలేదని వెల్లడించారు. ఈ సీక్వెల్ షూటింగ్ ను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కమల్‌హాసన్ అన్నారు. దర్శకుడికి, చిత్ర నిర్మాణ సంస్థకు మధ్య చర్చలు జరుగుతున్నట్లు కమల్‌హాసన్ ఈ ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న విక్రమ్ సినిమా జూన్ 3న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం