OTT Telugu Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. ఒకటి థ్రిల్లర్, మరొకటి కామెడీ
OTT Telugu Movies: ఇవాళ ఒక్క రోజే ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో ఒకటి థ్రిల్లర్ మూవీ కాగా.. మరొకటి కామెడీ డ్రామా. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT Telugu Movies: ఓటీటీలోకి దసరా సందర్భంగా సినిమాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. గురువారం (అక్టోబర్ 10) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో రెండు కొత్త తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టగా.. మరొకటి థియేటర్లలో ఓ మోస్తరు నడిచిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఇవే
ఈటీవీ విన్ ఓటీటీ ఈ మధ్య జోరు పెంచింది. వరుసగా కొత్త సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తూ పోటీలోకి వచ్చేసింది. తాజాగా గురువారం (అక్టోబర్ 10) పైలం పిలగా, తత్వ అనే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అసలు ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం.
పైలం పిలగా మూవీ స్టోరీ ఇదీ..
ఈటీవీ విన్ ఓటీటీలోకి గురువారం స్ట్రీమింగ్ కు వచ్చిన కామెడీ డ్రామా పైలం పిలగా. సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో 9 రేటింగ్ ఉన్నా.. 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పైలం పిలగా మూవీని ఆనంద్ గుర్రం డైరెక్ట్ చేశాడు.
సాయితేజ కల్వకోట, పావని కరణం, మిర్చి కిరణ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ సినిమా కోతుల గుట్ట అనే ఊళ్లో ఉండే శివ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. దుబాయ్ వెళ్లాలని కలలు కనే అతడు.. ఊరి చివరన ఉన్న తన నాన్నమ్మ రెండకెరాల భూమి అమ్మేసి వచ్చిన డబ్బులతో అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు.
అయితే ఆ స్థలం లిటిగేషన్ లో ఉండటం, దానిని అమ్మడానికి అతడు నానా తంటాలు పడటం మూవీలో చూడొచ్చు. ఓవైపు ఇది జరుగుతుండగానే దేవి (పావని) అనే అమ్మాయిని అతడు ప్రేమిస్తాడు. గాల్లో మేడలు కట్టే శివకి, ఉన్నదాంట్లో సర్దుకుపోవాలనుకునే దేవికి మధ్య ప్రేమ పొసగదు. చివరికి శివ ఆ స్థలంతోపాటు దేవి విషయంలో ఏం చేశాడు? అతని దుబాయ్ కల నెరవేరిందా అన్నది పైలం పిలగా మూవీలో చూడొచ్చు.
తత్వ మూవీ స్టోరీ ఇదీ..
తత్వ నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టిన క్రైమ్ థిల్లర్ మూవీ. ఈ మధ్యే సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రుత్విక్ ఎలగారి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మొత్తం ఆరిఫ్ అనే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
దొంగతనం చేయడానికి ప్రయత్నించి అంతకంటే దారుణమైన క్రైమ్ లో చిక్కుకునే ఆ వ్యక్తి.. తర్వాత ఎలా తప్పించుకుంటాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ఇప్పుడు మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.