Malayalam Movies Prime Video: అమెజాన్ ప్రైమ్‍ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 మలయాళం సినిమాలు-ott news 5 best malayalam movies you must watch on amazon prime video kumbalangi nights to joji ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott News 5 Best Malayalam Movies You Must Watch On Amazon Prime Video Kumbalangi Nights To Joji

Malayalam Movies Prime Video: అమెజాన్ ప్రైమ్‍ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 మలయాళం సినిమాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 25, 2024 06:15 PM IST

Top 5 Malayalam Movie on Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో చాలా మలయాళం సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వారిలో తప్పక మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని చిత్రాలు ఇవే.

Malayalam Movies Prime Video: అమెజాన్ ప్రైమ్‍ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 మలయాళం సినిమాలు
Malayalam Movies Prime Video: అమెజాన్ ప్రైమ్‍ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 మలయాళం సినిమాలు

Malayalam Movies: మలయాళ సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అద్భుతమైన కథ, కథనాలు, యాక్టింగ్ పర్ఫార్మెన్సులతో కొన్ని మలయాళం సినిమాలు మెప్పిస్తుంటాయి. ఇలా చాలా చిత్రాలు పాపులర్ అయ్యాయి. ఓటీటీలు ఫేమస్ అయ్యాక మలయాళం చిత్రాలు చాలా మందికి చేరువవుతున్నాయి. ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ చాలా మలయాళం సినిమాలు స్ట్రీమింగ్‍కు ఉన్నాయి. అందులో, ప్రైమ్‍ వీడియోలో మిస్ కాకుండా తప్పక చూడాల్సిన 5 మలయాళ చిత్రాలు ఇవే.

కుంబలంగి నైట్స్

నలుగురు అన్నదమ్ముల మధ్య ప్రేమ, గొడవల చుట్టూ సాగే స్టోరీతో కుంబలంగి నైట్స్ (2019) తెరకెక్కింది. మధు సి నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణ ఉత్కంఠగా సాగుతుంది. కుంబలంగి నైట్స్ మూవీలో షేన్ నిగమ్, సౌబిన్ షాహిర్, ఫాహద్ ఫాజిల్, శ్రీనాథ్ భాసీ కీలకపాత్రలు పోషించారు. 2019లో థియేటర్లలో వచ్చిన ఈ మూవీ బ్లాక్‍బాస్టర్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటి వరకు చూడకపోతే ఈ చిత్రం ఓసారి చూసేయండి.

జల్లికట్టు

కేరళలోని ఓ మూరుమాల గ్రామంలో సంప్రదాయ కార్యక్రమంలో భాగం కావాల్సిన ఎద్దు పారిపోతుంది. దాన్ని పట్టుకునే క్రమంలో చాలా పరిణామాలు, ఘటనలు జరుగుతాయి. ఈ క్రమంలో మనుషుల క్రూరత్వం బయటికి వస్తుంది. ఈ స్టోరీ లైన్‍తో దర్శకుడు లిజో జోస్ పెలిసెరీ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ జల్లికట్టు (2019) ఆద్యంతం ఆసక్తిగా ఉండటంతో పాటు ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సాబుమోన్ అబ్దుసమద్ కీలకపాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు, చాలా అవార్డులను పొందిన జల్లికట్టు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

జోజీ

క్రైమ్ డ్రామా మూవీ జోజీ (2021) చాలా ప్రశంసలు పొందడంతో పాటు పలు అవార్డులను కూడా గెలుచుకుంది. తన కుటుంబ సభ్యులనే ఓ యువకుడు హత్యలు చేయడం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఫాహద్ ఫాజిల్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. విలియమ్ షేక్ స్పియర్ ‘మ్యాక్‍బెత్’ రచన స్ఫూర్తిగా ఈ చిత్రం తెరకెక్కింది. జోజీ చిత్రానికి దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించారు. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

హెలెన్

సర్వైవల్ థ్రిల్లర్‌గా హెలెన్ (2019) చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు మథుకుట్టి క్జేవియర్. ఆఫీస్‍లోని ఫ్రీజర్‌లో ఓ అమ్మాయి చిక్కుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఆమె అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్రంలో ప్రధాన అంశం. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా హెలెన్ సాగుతుంది. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు చూడకపోతే హెలెన్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓసారి చూసేయండి.

ట్రాన్స్

ట్రాన్స్ (2019) చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో పోషించారు. మతపరమైన మోటివేషనల్ స్పీకర్ విజు ప్రసాద్‍గా ఫాహద్ నట విశ్వరూపం చూపారు. ఆయన క్యారెక్టర్ చాలా సంఘర్షణతో ఉంటుంది. ట్రాన్స్ చిత్రంలో మతం, భక్తిని వ్యాపారం చేయడం, డ్రగ్స్ సహా మరిన్ని అంశాలు మిళితమై ఉంటాయి. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

సూపర్ హిట్ అయిన దృశ్యం 1, దృశ్యం 2, అయ్యప్పనుం కోషియమ్ మలయాళ సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే, దృశ్యం చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అయ్యప్పనుం కోషియం మూవీ భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో వచ్చింది. ఒకవేళ వీటి ఒరిజినల్ మలయాళ సినిమాలు చూడాలంటే.. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

IPL_Entry_Point