Om Raut on Adipurush Trolls: ఆదిపురుష్‌పై ట్రోలింగ్‌.. ఓంరౌత్ రియాక్షన్ ఇదీ-om raut on adipurush trolls came up with an interesting answer
Telugu News  /  Entertainment  /  Om Raut On Adipurush Trolls Came Up With An Interesting Answer
దసరా వేడుకల్లో ప్రభాస్ తో ఓం రౌత్
దసరా వేడుకల్లో ప్రభాస్ తో ఓం రౌత్ (PTI)

Om Raut on Adipurush Trolls: ఆదిపురుష్‌పై ట్రోలింగ్‌.. ఓంరౌత్ రియాక్షన్ ఇదీ

06 October 2022, 15:12 ISTHT Telugu Desk
06 October 2022, 15:12 IST

Om Raut on Adipurush Trolls: ఆదిపురుష్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆ మూవీ డైరెక్టర్‌ ఓంరౌత్‌ స్పందించాడు. ముఖ్యంగా రాముడు, రావణుడులాంటి క్యారెక్టర్లను అలా ఎందుకు చూపించారన్నదానిపై అతడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Om Raut on Adipurush Trolls: ప్రభాస్‌ ఆదిపురుష్‌ మూవీపై ఉన్న భారీ అంచనాలు కాస్తా ఇప్పుడు ట్రోల్స్‌గా మారిపోయాయి. ఆ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను చూసి ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌పై విపరీతమైన ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ఇక ఇందులో రాముడు, రావణుడి పాత్రల్లో కనిపించిన ప్రభాస్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ లుక్స్‌ చూసి చాలా మంది షాక్‌ తిన్నారు.

రామాయణాన్ని అవమానించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. రాముడేంటి ఇలా ఉన్నాడు? రావణుడికి అంత పెద్ద గడ్డమేంటి? అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు, ట్రోల్స్‌పై తాజాగా ఈ మూవీ డైరెక్టర్‌ ఓంరౌత్‌ స్పందించాడు. ఈ సినిమా 3డీ ప్రీవ్యూ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఆ సమయంలో ఆదిపురుష్‌లోని పాత్రల రూపాలు అలా ఉన్నాయేంటని మీడియా ప్రశ్నించింది.

దీనిపై ఓంరౌత్‌ స్పందిస్తూ.. ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్‌ కావాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. "రామయణం గురించి మన తరానికి చాలా తెలుసు. కానీ ఈ కొత్త జనరేషన్స్‌, యువతరాలకు దీని గురించి పెద్దగా తెలియదు. అందువల్ల ఇలాంటి రూపాలు, కంటెంట్‌తో వాళ్లు సులువుగా అర్థం చేసుకుంటారు. ఓ రామ భక్తుడిగా దీనిపై నేను గర్వంగా ఫీలవుతున్నాను. తర్వాతి తరాలు కూడా దీనిని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి" అని ఓంరౌత్‌ అన్నాడు.

2డీలో వచ్చిన టీజర్‌పై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో 3డీ టీజర్‌పై మేకర్స్‌ మరింత జాగ్రత్త వహిస్తున్నారు. 2డీ టీజర్‌పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు. దీంతో 3డీ టీజర్‌ గతంలో వచ్చిన టీజర్‌ కంటే చాలా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీఎఫ్‌ఎక్స్‌పై ట్రోల్స్‌ వచ్చినా.. వాటిని మార్చే ఉద్దేశంలో మాత్రం మేకర్స్‌ కనిపించడం లేదు.

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తుండగా.. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా, కృతి సనన్‌ సీతగా నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తోంది.