Ban Adipurush Movie: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాలి - అయోధ్య రామ్ మందిర్ ప్రధాన పూజారి డిమాండ్
Ban Adipurush Movie: ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటూ అయోధ్యలోని రామ్‌మందిర్ ప్రధాన పూజారి డిమాండ్ చేస్తున్నారు. వివాదాల్ని సృష్టించడం కోసమే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Ban Adipurush Movie: ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఆదిపురుష్ టీజర్‌ను(Adipurush teaser) ఇటీవల అయోధ్యలో రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో రాముడితో పాటు హనుమాన్, రావణుడి పాత్రలను చూపించిన విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీఖాన్‌ను స్టైలిష్‌గా ఆవిష్కరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర యూనిట్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. పొడవైన గడ్డం, లెదర్ జాకెట్‌లో అన్య మతస్తుడిలా రావణుడిని ఈ టీజర్‌లో చిత్రీకరించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌తో పాటు హనుమాన్ పాత్రధారి దేవ్‌దత్తా లుక్‌పై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆదిపురుష్ టీజర్ ఉందంటూ యూపీ డిప్యూటీ సీఏంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మధ్య ప్రదేశ్ హోమ్ మినిస్టర్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు.
తాజాగా ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటూ అయోధ్యలోని రామ్ మందిర్ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ పేర్కొన్నారు. పురాణాలపై సినిమాలు తీయడం తప్పుకాదని, కానీ వివాదాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే పౌరాణిక గాథలను వక్రీకరించడం మాత్రం క్షమించరాని నేరమని ఆయన అన్నాడు.
ఆదిపురుష్ టీజర్‌లో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై సత్యేంద్రదాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రామాయణానికి భిన్నంగా సినిమాలోని పాత్రలు కనిపిస్తున్నాయని, కోట్లాది మంది ఆరాధించే రాముడిని, హనుమాన్‌లను అగౌరవ పరిచేలా ఆదిపురుష్ సినిమాలోని పాత్రలు ఉన్నాయని సత్యేంద్రనాథ్ అన్నాడు. ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు. అతడి కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
రామాయణ గాథ ఆధారంగా ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓంరౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ (Krithi sanon) నటిస్తుండగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీలో దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 జనవరి 12న ఆదిపురుష్ రిలీజ్ కానుంది.