Om Bheem Bush Trailer Review: క్రేజీగా.. ఎంటర్‌టైనింగ్‍గా ‘ఓం భీమ్ బుష్' ట్రైలర్-om bheem bush trailer review sree vishnu rahul ramakrishna priyadarshi trio back with entertainment bang ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Om Bheem Bush Trailer Review: క్రేజీగా.. ఎంటర్‌టైనింగ్‍గా ‘ఓం భీమ్ బుష్' ట్రైలర్

Om Bheem Bush Trailer Review: క్రేజీగా.. ఎంటర్‌టైనింగ్‍గా ‘ఓం భీమ్ బుష్' ట్రైలర్

Om Bheem Bush Trailer Review: ‘ఓం భీమ్ బుష్’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. క్రేజీ కామెడీ, ఎంటర్‌టైన్‍మెంట్‍తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

Om Bheem Bush Trailer Review: క్రేజీగా.. ఎంటర్‌టైనింగ్‍గా ‘ఓం భీమ్ బుష్' ట్రైలర్

Om Bheem Bush Trailer: ఓం భీమ్ బుష్ సినిమాపై ఆరంభం నుంచి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో అదరగొట్టిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో రిపీట్ అవటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. అందులోనూ కొత్త పాయింట్‍లో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నామని దర్శకుడు హర్ష కొనుగంటి ఇటీవలే చెప్పారు. టీజర్ కూడా ఇంట్రెస్టింగ్‍గా సాగడంతో ఈ సినిమాపై బజ్ నెలకొంది. ఈ క్రమంలో ఓం భీమ్ బుష్ చిత్రం నుంచి నేడు (మార్చి 15) ట్రైలర్ రిలీజ్ అయింది.

నిధి కోసం..

సైంటిస్టులమని చెప్పి భైరవపురం అనే గ్రామంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అడుగుపెడతారు. ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. బ్యాంక్ బ్రోస్ క్లబ్‍ను పెడతారు. వ్యాన్‍లోనే ఉంటుంటారు. రకాలరకాల ప్రయోగాలు చేస్తారు. మగాళ్లయితే సంపంగి మహల్‍లో నిధి తీసుకురావాలని ఆ ముగ్గురికి ఓ సన్యాసి సవాల్ చేస్తారు. దీంతో వారు ఆ మహల్‍లో అడుగుపెడతారు. అక్కడ వారు నిధి కోసం వెతుకుతారు. అసలు ఆ ముగ్గురు ఆ ఊరిలోకి ఎందుకు వెళ్లారు.. వారి లక్ష్యమేంటి.. నిధి సాధించే క్రమంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి.. నిధి సాధించారా అనేదే ఓం భీమ్ బుష్ చిత్రంలో ముఖ్యమైన పాయింట్లుగా ఉంటాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే..

ఓం భీమ్ బుష్ సినిమా ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. క్రేజీగా సాగింది. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్’ అనే ట్యాగ్‍లైన్‍కు తగ్గట్టుగానే స్టోరీ విచిత్రమైన మలుపులు తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టారు. శ్రీవిష్ణు తన విచిత్రమైన డైలాగ్ డెలివరీని మరోసారి చూపించారు. ఈ చిత్రంలో గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డైలాగ్‍ల్లో కొన్ని బూతులను కలిపేశారు. సంపంగి మహల్‍లోకి వెళ్లాక కూడా ఫన్ బాగుంది. ఊరి పేరు ఏంటి అని ప్రియదర్శి అడిగితే ‘సుస్వాగతం’ అని రాహుల్ రామకృష్ణ చెబుతాడు. భైరవపురం అనేది చెప్పడు. అది భైరవపురం అని ప్రియదర్శి ఫ్రస్టేట్ అవడంతో ట్రైలర్ ఎండ్ అయింది. సన్నీ ఎం.ఆర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్రేజీగానే సాగింది.

ఓం భీమ్ బుష్ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్‌తో స్పష్టమైపోయింది. కొత్త పాయింట్‍తో వస్తున్నామని మేకర్స్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే, అదేంటో ట్రైలర్లో రివీల్ చేయలేదు. మొత్తంగా ఒక నిమిషం 53 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమా మార్చి 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రీతీ ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలకపాత్రలు పోషించారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీసెల్యులాయిడ్, సునీల్ బొలుసు నిర్మించారు.