Murder Mubarak trailer: నెట్‌ఫ్లిక్స్‌లో మరో మర్డర్ మిస్టరీ మూవీ.. మర్డర్ ముబారక్ ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Murder Mubarak trailer: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి మరో మర్డర్ మిస్టరీ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు మర్డర్ ముబారక్. బాలీవుడ్ లోని ప్రముఖ నటులంతా నటించిన ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (మార్చి 5) రిలీజైంది.
Murder Mubarak trailer: మర్డర్ ముబారక్.. ఈ మూవీ టైటిల్ తోనే ప్రేక్షకులను ఆకర్షించిన మేకర్స్ తాజాగా మంగళవారం (మార్చి 5) రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత ఆసక్తి రేపారు. నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, పంకజ్ త్రిపాఠీ నటిస్తున్నారు.
మర్డర్ ముబారక్ ట్రైలర్
నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మర్డర్ ముబారక్ మూవీకి హోమి అడజానియా దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ లో పేరున్న నటీనటులంతా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తిగా సాగింది. ఢిల్లీలో సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్ లో జరిగిన ఓ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
"ది రాయల్ ఢిల్లీ క్లబ్.. బ్రిటీషర్ల కోసం బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్న క్లబ్. ఆ ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు కానీ.. ఇక్కడున్న వాళ్లు మాత్రం ఆ ఆంగ్లేయుల కంటే ఎక్కువ ఆంగ్లేయులు" అనే పంకజ్ త్రిపాఠీ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ సమయంలో సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్ లాంటి ఈ మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.
ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే ఆ క్లబ్ పేరు అలాగే ఉండిపోయేదేమో అని పంకజ్ అంటాడు. ఆ వెంటనే క్లబ్ లో ఓ హత్య జరిగినట్లు చూపిస్తారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఏసీపీ హోదాలో ఎంటర్ అవుతాడు పంకజ్ త్రిపాఠీ. ఆ హత్య క్లబ్ లోని వాళ్లే ఎవరో చేశారన్న అనుమానంతో అందరినీ ప్రశ్నిస్తుంటాడతడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్య ఎవరు చేశారన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
మర్డర్ ముబారక్ స్ట్రీమింగ్
మర్డర్ ముబారక్ మూవీని నెట్‌ఫ్లిక్స్ సమర్పిస్తుండగా.. మ్యాడక్ ఫిల్మ్స్ తెరకెక్కించింది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులు ఉండటం ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాదు ట్రైలర్ లో విజయ్ వర్మ, సారా అలీ ఖాన్ మధ్య కొన్ని ఘాటు సీన్లను కూడా చూపించారు.
ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ ఉన్నాడంటే సినిమా ఎలా సాగనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎప్పటిలాగే నెట్‌ఫ్లిక్స్ మూవీ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశారు. మార్చి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
సారా అలీ ఖాన్ నటించిన ఏ వతన్ మేరే వతన్ మూవీ కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోమవారం (మార్చి 4) ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది. దీంతో సారా వారం గ్యాప్ లో రెండు సినిమాలతో ఓటీటీలో సందడి చేయనుంది.