Netflix most viewed shows: రానా నాయుడు అరుదైన ఘనత.. నెట్‌ఫ్లిక్స్ టాప్ 400లో ఇండియా నుంచి ఒకే ఒక్క టైటిల్
Netflix most viewed shows: నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అందుబాటులో ఉన్న షోలలో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 400 లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఇండియా నుంచి కేవలం రానా నాయుడు మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం.
Netflix most viewed shows: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్(Netflix) 2023 జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆరు నెలల్లో తమ ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చిన షోల వివరాలను మంగళవారం (డిసెంబర్ 12) వెల్లడించింది. ఇందులో వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ చోటు దక్కించుకుంది. అయితే ఇండియా నుంచి ఇదొక్క సిరీస్ మాత్రమే ఉండటం అసలు విశేషం.
నెట్‌ఫ్లిక్స్ తమ ఓటీటీలో ఉన్న సుమారు 18 వేల టైటిల్స్ వ్యూయర్షిప్ డేటాను వెల్లడించింది. నిజానికి 2021 నుంచి ప్రతివారం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఏకంగా జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో అత్యధిక వ్యూయర్షిప్ వచ్చిన టాప్ 400 లిస్ట్ రిలీజ్ చేసింది.
రానా నాయుడు ఒక్కటే..
వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్ పేరుతో ఈ డేటాను వెల్లడించింది. ఈ లిస్ట్ లో అమెరికన్ షో ది నైట్ ఏజెంట్ టాప్ లో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఇప్పటి వరకూ ఏకంగా 81.21 కోట్ల గంటల వ్యూయింగ్ నమోదు కావడం గమనార్హం. తర్వాతి స్థానంలో గిన్నీ అండ్ జార్జియా సీజన్ 2 66.51 కోట్ల గంటలతో ఉంది. టాప్ 10లో ది గ్లోరీ సీజన్ 1, వెన్స్‌డే సీజన్ 1, క్వీన్ చార్లెట్: ఎ బ్రిడ్జెర్టన్ స్టోరీ, యు సీజన్ 4, ఔటర్ బ్యాంక్స్ సీజన్ 3, మ్యానిఫెస్ట్ సీజన్ 4లాంటివి ఉన్నాయి.
ఇండియా నుంచి రానా నాయుడు మాత్రమే టాప్ 400లో ఉంది. అది కూడా 336వ స్థానంలో కావడం విశేషం. రానా నాయుడు వెబ్ సిరీస్ కు 1.64 కోట్ల వ్యూయింగ్ హవర్స్ నమోదయ్యాయి. వెంకటేశ్, రానా కలిసి నటించిన ఈ సిరీస్ లో బూతు కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది.
తొలి సీజన్ పై వచ్చిన విమర్శలతో రెండో సీజన్ లో ఈ కంటెంట్ ను కాస్త తగ్గించినట్లు వెంకటేశ్ వెల్లడించాడు. ఈ ఏడాది మార్చి 10 నుంచి రానా నాయుడు సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కాకుండా ట్రయల్ బై ఫైర్, క్లాస్, స్కూప్, టూత్ పరీలాంటి సిరీస్ లు కూడా జనవరి నుంచి జూన్ మధ్య రిలీజ్ అయ్యాయి.