Most Remakes Movie: ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన సినిమా ఇదే.. 8 ఏళ్లలోనే 26సార్లు.. ఇప్పుడు మన దగ్గర కూడా..-most remade movie in the world akshay kumar khel khel mein remake of this italian movie 26 remakes in 8 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Remakes Movie: ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన సినిమా ఇదే.. 8 ఏళ్లలోనే 26సార్లు.. ఇప్పుడు మన దగ్గర కూడా..

Most Remakes Movie: ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన సినిమా ఇదే.. 8 ఏళ్లలోనే 26సార్లు.. ఇప్పుడు మన దగ్గర కూడా..

Hari Prasad S HT Telugu
Aug 06, 2024 03:23 PM IST

Most Remakes Movie: ప్రపంచంలో ఎక్కువసార్లు రీమేక్ అయిన సినిమా ఏదో తెలుసా? ఇదేదో ఇంగ్లిష్, కొరియన్ మూవీ కాదు.. ఓ ఇటాలియన్ సినిమా కావడం విశేషం. ఇప్పుడు హిందీలోనూ మూవీ రిలీజ్ కాబోతోంది.

ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన సినిమా ఇదే.. 8 ఏళ్లలోనే 26సార్లు.. ఇప్పుడు మన దగ్గర కూడా..
ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన సినిమా ఇదే.. 8 ఏళ్లలోనే 26సార్లు.. ఇప్పుడు మన దగ్గర కూడా..

Most Remakes Movie: ఇండియాలో ఎక్కువసార్లు రీమేక్ అయిన మూవీగా మన తెలుగు సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా పేరిట రికార్డు ఉంది. ఈ సినిమాను 9సార్లు రీమేక్ చేశారు. కానీ ప్రపంచంలో అత్యధికసార్లు రీమేక్ అయిన మూవీ ఏదో తెలుసా? ఈ మూవీని కేవలం 8 ఏళ్లలోనే ఏకంగా 26సార్లు రీమేక్ చేశారు. ఇప్పుడు హిందీలోనూ వచ్చే వారం సినిమా రిలీజ్ కాబోతోంది.

అత్యధిక రీమేక్స్ మూవీ ఇదే

సాధారణంగా చాలా వరకు సినిమాలు ఏ హాలీవుడ్ నుంచో లేదంటే కొరియన్ భాషల నుంచో అవుతుంటాయి. కానీ ఏకంగా 26 సార్లు రీమేక్ అయిన ఈ సినిమా ఇటాలియన్ భాషకు చెందిన మూవీ కావడం విశేషం. 2016లో ఈ డ్రామెడీ జానర్ మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు పర్ఫెట్టి స్కోనోసియుటి. అంటే ఇంగ్లిష్ లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. ఈ సినిమాను 26 సార్లు రీమేక్ చేసినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాను ఇప్పటికే ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, అరబిక్, రొమానియన్, హీబ్రూ, జర్మన్ లాంటి భాషల్లో అధికారికంగా రీమేక్ చేశారు. అంతెందుకు తెలుగులో గతేడాది వచ్చిన రిచీ గాడి పెళ్లి అనే సినిమా కూడా ఇదే లైన్స్ లో సాగుతుంది. కానీ ఆ మూవీ మేకర్స్ దీనిని ఈ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ రీమేక్ అని ఎక్కడా చెప్పలేదు.

తెలుగులోనే కాదు కన్నడలో లౌడ్ స్పీకర్ ను అధికారిక రీమేక్ గా చెప్పగా, మలయాళంలో 12th మ్యాన్ సినిమా కూడా ఆ ఇటాలియన్ మూవీ రీమేకే. చాలా వరకు భాషల్లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతోనే ఈ సినిమాను రీమేక్ చేశారు.

హిందీలోనూ వచ్చేస్తోంది

ఇప్పుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తోపాటు ఫర్దీన్ ఖాన్, ఏమీ విర్క్, తాప్సీ పన్ను, వాణి కపూర్, ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న ఖేల్ ఖేల్ మే మూవీ కూడా ఆ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ రీమేకే. గత శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ అచ్చూ ఫ్రెంచ్ మూవీ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ లాగే ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు.

కానీ నిజానికి ఇది ఆ ఇటాలియన్ మూవీకి రీమేక్. ఇప్పుడు హిందీలో వస్తున్న ఖేల్ ఖేల్ మే మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. సరదాగా సాగిపోయే ఓ డిన్నర్ నైట్ లో కపుల్స్, ఫ్రెండ్సే తర్వాత శత్రువులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఒకరి మొబైల్స్ ను మరొకరు చూసే ఆట ఆడటమే. సరదాగా మొదలయ్యే ఈ ఆట చివరికి వాళ్ల జీవితాలనే మార్చేస్తుంది.

ఇంగ్లిష్‌లో నో రీమేక్

ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషల్లో, ఇన్నిసార్లు రీమేక్ అయిన ఇటాలియన్ మూవీ ఇంగ్లిష్ లో మాత్రం ఇంత వరకూ రాలేదు. దీనికీ ఓ కారణం ఉంది. నిజానికి ఈ సినిమా ఇటలీలో రిలీజ్ కాకముందే ఆ మూవీ రీమేక్ హక్కులను ఇంగ్లిష్ భాషకోసం వైన్‌స్టీన్ కంపెనీ తీసుకుంది. 2017లోనే హక్కులను పొందినా.. అదే సమయంలో వైన్‌స్టీన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు, క్రిమినల్ అభియోగాలతో కంపెనీ ఆర్థికంగా నష్టపోయింది.

దీంతో ఈ సినిమాను రీమేక్ చేయలేకపోయినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించింది. ఇన్ని భాషల్లో 26సార్లు రీమేక్ అయిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో ఖేల్ ఖేల్ మే పేరుతో రాబోతోంది. ట్రైలర్ చూస్తేనే మూవీ ఎలా ఉండనుందో అర్థం అవుతోంది. మరి ఇది ఇక్కడి ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.