Chiranjeevi About Allu Studios: అల్లు వారసులు తరతరాలు అల్లు రామలింగయ్యను తలచుకోవాలి.. చిరంజీవి వ్యాఖ్యలు
Allu Studios inauguration: అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై స్టూడియోస్‌ను ఆరంభించారు.
Allu Studios inaugurated by Chiranjeevi: ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కమెడియన్‌గా తెలుగులో ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన ఆయన నటుడిగా తనకంటూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా కుమారుడు అల్లు అరవింద్‌ను చిత్ర నిర్మాణంలోకి పంపి టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా తీర్చిదిద్దారు. నేడు అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఈ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా అల్లు స్టూడియోస్‌ను మెగాస్టార్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లు కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.
"మా మామయ్య అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నా. ఎంతో మంది నటీ నటులు ఉన్నప్పటికీ కొద్ది మందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అరవింద్, బన్నీస శిరీశ్, బాబీ.. సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచనే కారణం. నటనపై ఇష్టంతో మద్రాసు వెళ్లి.. నటుడిగా మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలనే ఆయనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యవస్థగా మారింది. ఇందుకు ప్రతిక్షణం అల్లు వారసులు ఆయనను తలచుకుంటూనే ఉండాలి. అల్లు అనే బ్రాండ్‌తో అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా దీన్ని నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా." అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమానికి విచ్చేసి అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకెంతో ప్రత్యేకం. అందరూ అనుకోవచ్చు.. అల్లు అరవింద్‌కు అగ్ర నిర్మాణ సంస్థ ఉంది. స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ డబ్బు డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియోను నిర్మించలేదు. ఎక్కడో ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. మా తాతయ్య చనిపోయి 18 సంవత్సరాలైన.. మా నాన్నకు ఆయన మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఆయన ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది." అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం