Manjummel Boys: అదో చెత్త సినిమా.. ఈ మలయాళీ మూర్ఖులు, తాగుబోతులు అంటూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాపై విరుచుకుపడిన తమిళ రచయిత
Manjummel Boys: ఈ ఏడాది మలయాళంలో రిలీజై సంచలన విజయం సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాపై తమిళ రచయిత జయమోహన్ విరుచుకుపడ్డాడు. మలయాళీ మూర్ఖులు, తాగుబోతులు అంటూ అతడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Manjummel Boys: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో మంజుమ్మెల్ బాయ్స్ ఒకటి. ఈ సినిమా చూసిన వాళ్లంతా ప్రశంసించారు. అయితే ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పించాడు. ఇదో చెత్త సినిమా అని, మలయాళీ మూర్ఖులు, తాగుబోతులు అంటూ అతడు విమర్శించడం సంచలనం రేపుతోంది.
మంజుమ్మెల్ బాయ్స్ ఓ చెత్త సినిమా
మలయాళంలో వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ 2006లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు రావడం, అందులో ఓ యువకుడు ఓ లోతైన గుహలో పడిపోవడం, తర్వాత మిగిలిన వాళ్లు అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నం ఈ మూవీలో చూడొచ్చు.
అయితే కేరళకు చెందిన యువకులంతా ఇలాగే ఉంటారని, వాళ్లు మూర్ఖులు, తాగుబోతులు అని తమిళ రచయిత జయమోహన్ విమర్శించాడు. సాధారణంగా తాను సినిమాల రివ్యూలకు దూరంగా ఉంటానని, అయితే ది ఎలిఫెంట్ డాక్టర్ అనే పుస్తక రచయితగా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని అన్నాడు.
కేరళలోని అడవుల్లో అక్కడి యువకులు తాగి పారేసిన మందు సీసాలు పగిలి అక్కడి ఏనుగులు ఎలా గాయాలకు గురవుతున్నాయో చెప్పే పుస్తకం అది. మలయాళీ టూరిస్టులు ఎక్కడికెళ్లినా తాగుతూ ఇలాంటి పనులే చేస్తారని, అలాంటి ఘటనను గొప్పగా చూపిస్తున్నట్లుగా తీసిన మంజుమ్మెల్ బాయ్స్ తన దృష్టిలో ఓ చెత్త సినిమా అని జయమోహన్ స్పష్టం చేశాడు.
మలయాళీ మూర్ఖులు, తాగుబోతులు
మంజుమ్మెల్ బాయ్స్ మూవీపై జయమోహన్ స్పందిస్తూ.. "మంజుమ్మెల్ బాయ్స్ నా దృష్టిలో ఓ అసహ్యకరమైన సినిమా. ఈ స్టోరీ నిజం. కల్పితం కాదు. కేరళ టూరిస్టులంతా ఇలాగే ఉంటారు. వాళ్లు సౌత్ లో టూరిజం అంటూ వచ్చి తాగుతూ, ఊగుతూ, పడిపోతూ ఉంటారు తప్ప ఇంకేం పట్టించుకోరు. ఈ మలయాళం మూర్ఖులకు వాళ్ల భాష తప్ప ఇంకేమీ తెలియదు. కానీ ఇతరులకు మాత్రం వాళ్ల భాష తెలియాలంటారు. వాళ్లు తాగుబోతులు" అని జయమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఇలాంటి టూరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా జయమోహన్ డిమాండ్ చేశాడు. ఇలాంటి వాళ్లు చేసే పనులు ప్రమాదాలకు కారణమై, మరణాలు కూడా సంభవిస్తాయని హెచ్చరించాడు. తన బ్లాగులో ఈ సినిమాపై జయమోహన్ రాసిన ఈ రివ్యూ సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ఎక్కడో జరిగిన ఓ ఘటనను పట్టుకొని మలయాళీలను ఇంతలా విమర్శించడం తగదని కొందరు ఈ తమిల రచయితకు చెబుతున్నారు.
మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఫిబ్రవరి 22న రిలీజైంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ150 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇదిలాగే కొనసాగితే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన 2018 మూవీ రికార్డును కూడా మంజుమ్మెల్ బాయ్స్ బ్రేక్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.