Lal Salaam Day 1 Collections: రజినీకాంత్ ‘లాల్ సలామ్’కు తెలుగులో షాకింగ్ ఓపెనింగ్.. తొలి రోజు ఎంతంటే!-lal salaam movie gets bad opening day 1 at box office in telugu states ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Day 1 Collections: రజినీకాంత్ ‘లాల్ సలామ్’కు తెలుగులో షాకింగ్ ఓపెనింగ్.. తొలి రోజు ఎంతంటే!

Lal Salaam Day 1 Collections: రజినీకాంత్ ‘లాల్ సలామ్’కు తెలుగులో షాకింగ్ ఓపెనింగ్.. తొలి రోజు ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 10, 2024 08:17 PM IST

Lal Salaam Day 1 Box office Collections: లాల్ సలామ్ సినిమా అంచనాలకు తగ్గట్టు మంచి ఓపెనింగ్ సాధించలేకపోయింది. రజినీకాంత్ నటించిన ఈ చిత్రానికి తెలుగులోనూ తొలి రోజు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఆ వివరాలు ఇవే..

Lal Salaam Day 1 Collections: రజినీకాంత్ ‘లాల్ సలాం’కు తెలుగులో షాకింగ్ ఓపెనింగ్.. తొలి రోజు ఎంతంటే..
Lal Salaam Day 1 Collections: రజినీకాంత్ ‘లాల్ సలాం’కు తెలుగులో షాకింగ్ ఓపెనింగ్.. తొలి రోజు ఎంతంటే..

Laal Salaam Day 1 Collections: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం గతేడాది బ్లాక్‍బాస్టర్ అయింది. తమిళంలో రికార్డులను సృష్టించిన ఆ మూవీకి.. తెలుగులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో రజినీ కీలకపాత్ర పోషించిన ‘లాల్ సలామ్’ మూవీపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 9) థియేటర్లలో రిలీజ్ అయింది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు రజినీ కూతురు ఐశ్వర్య. అయితే, లాల్ సలామ్ మూవీకి తొలి రోజు నిరాశాజనకమైన కలెక్షన్లు వచ్చాయి.

లాల్ సలామ్ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా.. మొయిద్దీన్ భాయ్‍గా రజినీ కీలకపాత్ర చేశారు. అయితే, రజినీ ఉన్నా ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ దక్కలేదు.

తెలుగులో షాక్..

లాల్ సలామ్ చిత్రానికి తెలుగులో షాకింగ్ ఓపెనింగ్ దక్కింది. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కేవలం సుమారు రూ.40లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ట్రేడ్ ట్రాకర్ సానిక్ ఈ విషయాన్ని వెల్లడించింది. సరైన బుకింగ్స్ లేకపోవటంతో కొన్ని చోట్ల ‘లాల్ సలామ్’ చిత్రం షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. రజినీకాంత్ ఉన్న సినిమాకు ఇలాంటి ఓపెనింగ్ రావడం ఆశ్చర్యకరంగానే ఉంది. తెలుగులో ప్రమోషన్లను ఎక్కువగా చేయకపోవడంతో లాల్ సలామ్ గురించి ఇక్కడ అసలు బజ్ లేదు. అందులోనూ మిక్స్డ్ టాక్ రావటం మరింత ప్రతికూలంగా మారింది.

రజినీకాంత్ గత చిత్రం జైలర్ మూవీ గతేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650కోట్ల వసూళ్లతో బ్లాక్‍బాస్టర్ అయింది. తెలుగులోనూ ఈ చిత్రం దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.65కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, లాల్ సలామ్ మూవీకి మాత్రం భారీ నిరాశే ఎదురైంది. ఊహించని విధంగా దారుణమైన ఓపెనింగ్ వచ్చింది.

క్రికెట్, మత కలహాలు అంశాలతో ‘లాల్ సలామ్’ చిత్రం వచ్చింది. మతసామరస్యాన్ని బోధించే ముస్లిం పెద్ద మొయిద్దీన్ భాయ్‍గా రజినీ ఈ చిత్రంలో నటించారు. చాలా ఏళ్ల విరామం తర్వాత ఐశ్వర్య మళ్లీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే, చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. బుకింగ్‍ల ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద జోరు చూపించడం కష్టంగానే కనిపిస్తోంది.

లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు చేయగా.. విఘ్నేష్, లివింస్టన్ సెంథిల్, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనిల్‍కుమార్, వివేక్ ప్రసన్న కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

లాల్ సలామ్ మూవీకి అధికంగా మిశ్రమ స్పందన వస్తోంది. మతసామరస్యం గురించి చెప్పాలనుకున్న ఈ కథ పాతగా ఉన్నా.. కథనం కూడా ఆసక్తిగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ ఆకట్టుకున్నా.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు నిరాశ పరుస్తోందని టాక్ వచ్చింది.