Karthi Apology: పవన్ కల్యాణ్ సీరియస్ అవటంతో క్షమాపణ చెప్పిన తమిళ హీరో కార్తి
Kathi Apology: తిరుమల లడ్డూ కల్తీ విషయంపై చర్చలు సాగుతున్న తరుణంలో.. ఈ అంశంపై తమిళ హీరో కార్తి పరోక్షంగా ఓ కామెంట్ చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో కార్తి వివరణ ఇచ్చుకున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో తమిళ స్టార్ హీరో కార్తి చేసిన ఓ కామెంట్‍పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జోకులు వేయడం సరికాదంటూ, మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించుకోవాలని నేడు (సెప్టెంబర్ 24) పవన్ అన్నారు. దీనిపై కార్తి వెంటనే స్పందించారు. వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు.
క్షమాపణ చెబుతూ..
తన మాట అపార్థానికి కారణమైనందుకు క్షమాపణ అంటూ కార్తి నేడు ట్వీట్ చేశారు. తాను వేంకటేశ్వర స్వామికి భక్తుడినని పేర్కొన్నారు. “పవన్ కల్యాణ్ మీపై పూర్తి గౌరవంతో.. ఏదైనా అనుకోని అపార్థానికి కారణమై ఉంటే క్షమాపణలు చెబుతున్నా. వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా నేను మన సంప్రదాయాలను ఎప్పుడూ పాటిస్తాను” అని కార్తి ట్వీట్ చేశారు.
యాంకర్ అడిగితేనే..
సత్యం సుందరం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో కొన్ని మీమ్స్ చూపిస్తూ.. స్పందించాలని కార్తిని యాంకర్ అడిగారు. ఈ క్రమంలో లడ్డూ కావాలా నయా అంటూ ఓ మూవీలోని డైలాగ్ వచ్చింది. దీని గురించి మాట్లాడాలంటూ కార్తితో యాంకర్ అన్నారు. దీంతో కార్తి స్పందించారు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు వద్దు మనకు అది” అని కార్తి చెప్పారు. మోతీచూర్ లడ్డూ తెప్పిస్తామని యాంకర్ అంటుంటే ఆ విషయం మాట్లాడవద్దని కార్తి చెప్పారు.
అయితే, తిరుమల లడ్డూ అంశాన్ని సెన్సిటివ్ అనడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా ఫంక్షన్‍లో లడ్డూ విషయంలో జోకులు వేశారని, సెన్సిటివ్ అంశం అన్నారని కామెంట్స్ చేశారు. నటులుగా తాను గౌరవిస్తానని, అయితే సనాతన ధర్మం విషయానికి వస్తే ఒక్క మాట మాట్లాడేందుకు వందసార్లు ఆలోచించాలని అన్నారు. ఈ విషయం పెద్దది కాకముందే కార్తి క్షమాపణలు చెప్పారు.
కార్తి క్షమాపణలు చెప్పటంపై కొందరు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. వివాదం కాకముందే స్పందించి మంచి పని చేశారని అంటున్నారు. యాంకర్ అడిగితేనే ఈ విషయంపై కార్తి మాట్లాడారని చెబుతున్నారు. కార్తి వివరణకు పవన్ కూడా స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
సత్యం సుందరం గురించి..
తమిళంలో మేయళగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరం పేరుతో వస్తోంది. తమిళంలో సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. అయితే, అదే రోజున ఎన్టీఆర్ దేవర ఉండటంతో తెలుగులో మాత్రం ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో కార్తితో పాటు అరవింద స్వామి లీడ్ రోల్ చేశారు. బావబామ్మర్దులుగా నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఫీల్ గుడ్ ఎమోషన్, కామెడీతో ఆకట్టుకుంది. సత్యం సుందరం మూవీకి 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతం అందించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు.
సత్యం సుందరం తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. తనకు సోదరుడు లాంటి ఎన్టీఆర్ మూవీ దేవర పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని కార్తి చెప్పారు. దేవర యుద్ధం లాంటి పెద్ద చిత్రమైతే.. తమది చిన్న మూవీ అని అన్నారు. సత్యం సుందరం చిత్రాన్ని చాలా మనసు పెట్టి చేశామని, అందరికీ కచ్చితంగా నచ్చుతుందని కార్తి అన్నారు. ట్రైలర్ ఆకట్టుకోవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.