Saptami Gowda: కన్నడ ఇండస్ట్రీలో మరో లవ్ ఎఫైర్ దుమారం.. యువ హీరో మాజీ భార్యపై కాంతారా హీరోయిన్ పరువు నష్టం కేసు
Saptami Gowda: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో లవ్ ఎఫైర్ కేసు దుమారం రేపుతోంది. తాజాగా ఓ యువ హీరో మాజీ భార్యపై కాంతారా హీరోయిన్ పరువు నష్టం కేసు వేయడం విశేషం.
Saptami Gowda: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రస్తుతం వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్టార్ హీరో దర్శన్, నటి పవిత్రా గౌడ ఓ హత్య కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలాంటిదే మరో లవ్ ఎఫైర్ కేసు దుమారం రేపుతోంది. ఈసారి కాంతారా మూవీ ఫేమ్ సప్తమి గౌడ సహచర నటుడు యువ రాజ్‌కుమార్ మాజీ భార్య శ్రీదేవిపై పరువు నష్టం కేసు వేసింది.
సప్తమి గౌడ పరువు నష్టం కేసు
కాంతారా మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి సప్తమి గౌడ. ఆమె ఈ మధ్యే యువ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కన్నడ్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సోదరుడి కొడుకు యువ రాజ్‌కుమార్ హీరో నటించాడు. అయితే ఈ యువ హీరో ఇప్పటికే తన భార్య శ్రీదేవికి విడాకులు ఇచ్చాడు. దానికి కారణం సప్తమి గౌడే అని ఆ మాజీ భార్య ఆరోపిస్తోంది.
సప్తమితో యువ రాజ్‌కుమార్ కు ఎఫైర్ నడుస్తోందని, అందుకే అతడు తనకు విడాకులు ఇచ్చాడని శ్రీదేవి అనే ఆ మాజీ భార్య పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇది చూసి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలు చేసి తన పరువు తీసిందంటూ శ్రీదేవి ఏకంగా రూ.10 కోట్లకు పరువు నష్టం కేసు వేసింది. పబ్లిగ్గా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
యువ రాజ్‌కుమార్, శ్రీదేవి విడాకులు
తన భార్య శ్రీదేవితో ఇక తాను బంధాన్ని కొనసాగించలేనని, విడాకులు ఇవ్వాలని ఇప్పటికే యువ రాజ్ కుమార్ కోర్టుకెక్కాడు. అయితే అతనికి సప్తమి గౌడతో ఎఫైర్ ఉందని, అందుకే తనకు విడాకులు ఇస్తున్నాడని శ్రీదేవి వాదిస్తోంది. ఆ ఇద్దరినీ తాను ఓ హోటల్ రూమ్ లో చూశానని కూడా ఆమె చెప్పడం గమనార్హం. అయితే శ్రీదేవికే మరొకరితో ఎఫైర్ ఉన్న కారణంగా యువ రాజ్ కుమార్ విడాకులు కోరుతున్నాడని అతని తరఫు లాయర్ వాదించాడు.
అయితే వీళ్ల వ్యక్తిగత విషయాల్లో తనను అనవసరంగా లాగుతున్నారంటూ సప్తమి గౌడ కోర్టుకెక్కింది. బెంగలూరు సిటీ సివిల్ కోర్టులో ఆమె కేసు వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిందని ఆరోపించింది. దీంతో కోర్టు శ్రీదేవికి నోటీసులు కూడా జారీ చేసింది. సప్తమి గౌడ, యువ రాజ్ కుమార్ కలిసి నటించిన యువ మూవీ ఈ ఏడాది మార్చిలో రిలీజై మిక్స్డ్ రియాక్షన్స్ సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించింది.
కన్నడ ఇండస్ట్రీ ఇప్పటికే దర్శన్, పవిత్ర కలిసి రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారన్న ఆరోపణలతోనే సతమతమవుతోంది. ఈ విషయంలో బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని, ఇండస్ట్రీకి క్లీన్ చిట్ దక్కాలని కిచ్చా సుదీప్, ఉపేంద్రలాంటి హీరోలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు సప్తమి గౌడ, యువ రాజ్ కుమార్ ఎఫైర్ అంశం కూడా తెరపైకి రావడం మరింత దుమారం రేపుతోంది.