Darshan Murder Case: మర్డర్ కేసులో దర్శన్ అరెస్టుపై ఈగ మూవీ విలన్ కామెంట్స్ వైరల్.. క్లీన్ చిట్ కావాలంటూ..
Darshan Murder Case: మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టుపై మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించాడు. ఈ విషయంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలంటే సంచలన కామెంట్స్ చేశాడు.
Darshan Murder Case: కన్నడ స్టార్ హీరో, కాటేరా మూవీ నటుడు దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ కావడంపై తొలిసారి ఆ ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ హీరో స్పందించాడు. ఈగ మూవీలో విలన్ లాగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు కిచ్చా సుదీప్ దీనిపై స్పందిస్తూ.. కన్నడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దీనివల్ల చెడ్డ పేరు వచ్చిందని, ఇప్పుడు తమకు క్లీన్ చిట్ కావాలని అడగడం గమనార్హం.
దర్శన్ కేసుపై కిచ్చా సుదీప్ ఏమన్నాడంటే?
దర్శన్ తన ప్రేయసి పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడన్న కారణంగా రేణుకా స్వామి అనే వ్యక్తిని మరో పది మందితో కలిసి హత్య చేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో పవిత్ర కూడా సహ నిందితురాలిగా ఉంది. ఈ ఇద్దరూ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఈ హత్య కేసులో విచారణ జరుగుతోంది. దీనిపై స్పందించిన కిచ్చా సుదీప్.. బాధితుడి భార్య, పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు.
ఇండియా టుడేతో ఈ సంచలన కేసుపై అతడు మాట్లాడాడు. "మీడియా ఏం చూపిస్తోందో అది మాత్రమే మాకు తెలుసు. ఎందుకంటే మేము నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తెలుసుకోలేం కదా. నిజాన్ని వెలికి తీసేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో సందేహం లేదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే.
ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. రోడ్డుపై హత్యకు గురైన రేణుకాస్వామికి న్యాయం జరగాలి. ఆ పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. అన్నింటికీ మించి ప్రతి ఒక్కరికీ న్యాయంపై నమ్మకం ఉండాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి" అని సుదీప్ అన్నాడు.
ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలి
ఇక రేణుకాస్వామి హత్య, దర్శన్, పవిత్ర అరెస్టుతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చిందని, ఇప్పుడు ఇండస్ట్రీకి క్లీన్ చిట్ రావాల్సిన అవసరం ఉందని సుదీప్ అభిప్రాయపడ్డాడు. "ప్రతి ఒక్కరికీ ఆ కుటుంబంపై సానుభూతి ఉంది. ప్రస్తుత వాతావరణం సరిగా లేదు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి. మొత్తం నిందనంతా ఫిల్మ్ ఇండస్ట్రీపైనే వేస్తున్నారు. ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలి. ఎంతో మంది నటులు ఇందులో ఉన్నారు. సినిమా ఒకరో ఇద్దరికో సంబంధించింది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది" అని సుదీప్ అన్నాడు.
ఈ నెల 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారన్న అభియోగాలపై దర్శన్, పవిత్రలతోపాటు మరికొందరిని పోలీసులు జూన్ 11న అరెస్ట్ చేశారు. పవిత్ర లక్ష్యంగా సోషల్ మీడియాలో అతడు అసభ్యకరమైన సందేశాలు పోస్ట్ చేయడంతో మరో పది మందితో కలిసి దర్శన్ అతన్ని కిడ్నాప్ చేయించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు కన్నడనాట సంచలనం రేపింది. దర్శన్ లాంటి స్టార్ హీరో ఓ హత్య కేసులో అరెస్ట్ కావడం షాక్ కు గురి చేసింది. అయితే ఈ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోబోనని సీఎం సిద్దరామయ్య కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.