Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ లో నటించడానికి పరితపించిపోతోంది. ఆ సినిమాలో ఒక్క అవకాశం ఇవ్వాలని నేరుగా రిషబ్ శెట్టినే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు దేశాన్ని ఊపేసిన సినిమా ప్రీక్వెల్ పై కన్నేసింది.
ఆర్ఎక్స్ 100 తర్వాత కొన్ని సినిమాల ఎంపికలో తప్పు చేసిన పాయల్ రాజ్‌పుత్.. మంగళవారం సినిమాతో మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడింది. అలాంటి నటి ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 చేస్తున్న డైరెక్టర్ రిషబ్ శెట్టిని తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా అడుగుతోంది. మంగళవారం (డిసెంబర్ 12) ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
"రిషబ్ శెట్టి, హోంబలె ఫిల్మ్స్.. కాంతారా చాప్టర్ 1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో నటించాలని నేను ఉత్సాహంగా ఉన్నాను. నా లేటెస్ట్ మూవీ మంగళవారంలో నా పర్ఫార్మెన్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మీరు కూడా చూడండి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ప్రక్రియ గురించి దయచేసి చెప్పండి. దీనిని రీపోస్ట్ చేస్తూ నా పేరును బలపరుస్తున్న ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు" అని పాయల్ ట్వీట్ చేసింది.
పాయల్ చేసిన ట్వీట్ వైరల్ కావడంతో దీనికి రిషబ్ శెట్టి ఎలా రియాక్టవుతాడన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న పాయల్ లాంటి హీరోయిన్ నేరుగా ఓ డైరెక్టర్ ను అవకాశం ఇవ్వాలని అడగటం నిజంగా విశేషమే. దీనిని బట్టే ఈ సినిమాలో నటించడానికి ఆమె ఎంత ఉత్సాహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి మంగళవారం సినిమాతో తనలోని అసలు నటిని కూడా ఆమె ప్రపంచానికి చూపించింది. దీంతో కాంతారాలాంటి సినిమాకు ఆమె సూటవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. గతంలో కాంతారా మూవీలో సప్తమి గౌడకు రిషబ్ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్యంగా సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు కాంతారా ఛాప్టర్ 1పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే వచ్చిన ఈ మూవీ టీజర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.