Kalinga Movie Review: కళింగ రివ్యూ - లేటెస్ట్ తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-kalinga movie review and rating latest telugu horror thriller movie plus and minus points dhruva vaayu pragya nayan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalinga Movie Review: కళింగ రివ్యూ - లేటెస్ట్ తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Kalinga Movie Review: కళింగ రివ్యూ - లేటెస్ట్ తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 13, 2024 11:55 AM IST

Kalinga Movie Review: తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ క‌ళింగ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ హిట్టా? ఫ‌ట్టా? అంటే?

కళింగ మూవీ రివ్యూ
కళింగ మూవీ రివ్యూ

Kalinga Movie Review: ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ళింగ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప్ర‌గ్యాన‌య‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

క‌ళింగ మిస్ట‌రీ...

క‌ళింగ ఊరి పొలిమేర‌ను దాటి అడ‌విలోకి వెళ్లిన వాళ్లు ఎవ‌రూ ప్రాణాల‌తో తిరిగొచ్చిన దాఖ‌లాలు ఉండ‌వు. ఆ ఊరికి చెందిన లింగ (ధృవ‌వాయు) ఓ అనాథ‌. సారాకాస్తూ త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. ఆ ఊరికే చెందిన ప‌ద్దును (ప్ర‌గ్యాన‌య‌న్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు లింగ‌. కానీ ప‌ద్దు తండ్రి (ముర‌ళీధ‌ర్‌గౌడ్‌) మాత్రం వారి ప్రేమ‌కు అడ్డు చెబుతాడు. ఊరిపెద్ద (ఆడుకాలం న‌రేన్‌) వ‌ద్ద త‌న‌ఖాలో ఉన్న లింగ పొలం విడిపించుకుంటేనే పెళ్లి జ‌రిపిస్తాన‌ని కండీష‌న్ పెడ‌తాడు.

త‌న త‌మ్ముడు బ‌లితో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా లింగ‌కు అత‌డి పొలం బ‌దులు అడ‌వి ద‌గ్గ‌ర‌లోని భూమిని రాసిస్తాడు ఊరిపెద్ద‌. త‌మ పొలం కోసం పొలిమేర దాటి అడ‌విలోకి వెళ్లిన లింగ‌కు, అత‌డి స్నేహితుడికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? ప‌ద్దుకు లింగ‌ను దూరం చేయాల‌ని ఊరి పెద్ద ఎందుకు అనుకున్నాడు.

లింగ‌తో బ‌లికి ఉన్న గొడ‌వ‌ల‌కు కార‌ణం ఏమిటి? క‌ళింగ రాజు సంప‌ద అడ‌విలో ఎక్క‌డ ఉంది? ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏమిటి? అసుర భ‌క్షి వెన‌కున్న మిస్ట‌రీని లింగ ఎలా ఛేదించాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌...

క‌ళింగ హార‌ర్ అంశాల‌తో ముడిప‌డిన ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ మూవీ. అంత‌ర్లీనంగా ఓ ల‌వ్‌స్టోరీతో పాటు డివోష‌న‌ల్ ట‌చ్ ఇస్తూ హీరో క‌మ్ ద‌ర్శ‌కుడు ధృవ‌వాయు క‌ళింగ క‌థ‌ను రాసుకున్నాడు. మ‌ల్టీజాన‌ర్ మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

సెకండాఫ్‌లో చిక్కుముడులు

క‌ళింగ సంస్థానంలోని ప్ర‌జ‌లు వింత‌వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తూ త‌మ‌ను తామే చంపుకోవ‌డం, పొలిమేర దాటిన వారు ఎవ‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేద‌నే అంశాల‌తో క‌ళింగ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత లింగ‌, ప‌ద్దు ల‌వ్‌స్టోరీ, ఊరిపెద్ద త‌మ్ముడితో లింగ గొడ‌వ‌ల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్‌ను న‌డిపించాడు.

త‌న పెళ్లి కోసం అడ‌విలోకి వెళ్లాల‌ని హీరో నిర్ణ‌యించుకునే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అస‌లు అడ‌విలో ఏముంది? అక్క‌డికి వెళ్లిన వారు ఎమ‌వుతున్నార‌నే చిక్కుముడుల‌కు సెకండాఫ్‌లోనే ఆన్స‌ర్ ఇచ్చాడు డైరెక్ట‌ర్‌. ఆసుర భ‌క్షి పాయింట్‌ను కొత్త‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జ‌ర‌గ‌బోతుందో అనే క్యూరియాసిటీని సెకండాఫ్‌లో క‌లిగించాడు.

లాజిక్స్ మిస్‌...

క‌ళింగ క‌థ‌లోని ప్ర‌ధాన‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌ను వాయిస్ ఓవ‌ర్‌తోనే చెప్పించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. ల‌వ్‌స్టోరీని రొటీన్‌గా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కొన్ని చోట్ల లాజిక్స్‌తో సంబంధం లేకుండా క‌థ సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. హార‌ర్ డోస్ త‌గ్గిన‌ట్లుగా అనిపిస్తుంది.

హీరో క‌మ్ డైరెక్ట‌ర్‌...

హీరో, డైరెక్ట‌ర్ రెండు పాత్ర‌ల‌కు ధృవ‌వాయు న్యాయం చేశాడు. లింగ‌గా మాస్ రోల్‌లో అత‌డి న‌ట‌న ఒకే అనిపిస్తుంది. డైరెక్ట‌ర్‌గా మాత్రం అత‌డి టేకింగ్, స్క్రీన్‌ప్లేను రాసుకున్న తీరు బాగుంది. ప్ర‌గ్యాన‌య‌న్ గ్లామ‌ర్‌తో మెప్పించింది. ల‌క్ష్మ‌న్ మీసాల‌, ఆడుకాలం న‌రేన్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు. బీజీఎమ్ సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఉంది.

హార‌ర్ మూవీ ల‌వ‌ర్స్ ...

క‌ళింగ హార‌ర్ మూవీస్ ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను కొంత వ‌ర‌కు మెప్పిస్తుంది. చిన్న సినిమానే క‌థ‌, విజువ‌ల్స్‌తో పాటు టెక్నిక‌ల్‌గా మెప్పిస్తుంది.

రేటింగ్‌: 2.75/5