Russia Ukraine war : రష్యా- ఉక్రెయిన్​ శాంతికి మోదీ ప్రయత్నాలు- మాస్కోకు అజిత్​ దోవల్​!-ajit doval headed to moscow as pm modi tries for russia ukraine war peace ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine War : రష్యా- ఉక్రెయిన్​ శాంతికి మోదీ ప్రయత్నాలు- మాస్కోకు అజిత్​ దోవల్​!

Russia Ukraine war : రష్యా- ఉక్రెయిన్​ శాంతికి మోదీ ప్రయత్నాలు- మాస్కోకు అజిత్​ దోవల్​!

Sharath Chitturi HT Telugu
Sep 08, 2024 11:15 AM IST

Russia Ukraine war PM Modi : రష్యా- ఉక్రెయిన్​ మధ్య శాంతి చర్చల కోసం ఎన్​ఎస్​ఏ అజిత్​ దోవల్​ మాస్కోకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ గత రెండు నెలల్లో రష్యా, ఉక్రెయిన్​లో పర్యటించిన విషయం తెలిసిందే.

గత నెల ఉక్రెయిన్​ పర్యటలో జెలెన్​స్కీతో మోదీ..
గత నెల ఉక్రెయిన్​ పర్యటలో జెలెన్​స్కీతో మోదీ.. (via REUTERS)

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధానికి ముగింపు పలికి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్​ (ఎన్​ఎస్​ఏ) అజిత్​ దోవల్​ మాస్కోకు వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ రెండు నెలల వ్యవధిలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్​లో పర్యటించి, ఆయా దేశాధినేతలను కలిసిన అనంతరం ఈ వార్త వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

రష్యా- ఉక్రెయిన్​ శాంతికి ప్రయత్నాలు..

ప్రధాని మోదీ జులైలో రష్యా వెళ్లారు. ఆగస్టు నెలలో ఉక్రెయిన్​కి వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీని కలిశారు. అనంతరం ఆగస్ట్​ 27న రష్యా అధ్యక్షుడు పుతిన్​కి ఫోన్​ కాల్​ చేశారు. ఈ కాల్​లో భాగంగా తన ఉక్రెయిన్​ పర్యటన గురించి పుతిన్​కి మోదీ వివరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని పుతిన్​కి మోదీ చెప్పారట.

"తన ఉక్రెయిన్​ పర్యటన గురించి పుతిన్​తో మోదీ మాట్లాడారు. చర్చలు, దౌత్య చర్యల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు. తద్వారా శాంతిని స్థాపించాలని పిలుపునిచ్చారు," అని పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

సోర్స్​ ప్రకారం.. శాంతి చర్చల కోసం అజిత్​ దోవల్​ని మాస్కో పంపాలను ఈ ఫోన్​ కాల్​లోనే ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అజిత్​ దోవల్​ మాస్కోకు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి:- BJP J-K poll manifesto: మహిళలకు రూ.18,000, 5 లక్షల ఉద్యోగాలు సహా 25 హామీలు; జమ్ముకశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

అయితే అజిత్​ దోవల్​ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రష్యా ఉక్రెయిన్​ మధ్య శాంతి స్థాపనపై ప్రధాని మోదీ ఇప్పటికే అనేకమార్లు వ్యాఖ్యానించారు. శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆగస్ట్​లో ఉక్రెయిన్​ పర్యటనలో సైతం ఈ విషయాన్ని పునరుద్ఘటించారు. "భారత్​ ఎప్పుడు తటస్థంగా లేదు. భారత్​ ఎప్పుడూ శాంతి పక్షానే ఉంటుంది," అని మోదీ అన్నారు.

అటు ఉక్రెయిన్​తో విభేదాల మధ్య పుతిన్​ సైతం భారత్​ని కీలకంగా చూస్తున్నారు. ఉక్రెయిన్​ విషయంపై తాము చర్చలు జరుపుతున్న 3 దేశాల్లో భారత్​ కూడా ఉందని రష్యా చెప్పడం ఇందుకు కారణం.

రష్యాతో యుద్ధానికి చెక్​ పెట్టడంలో భారత్​ కీలక పాత్ర పోషించగలదు అని ఉక్రెయిన్​, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ భావిస్తున్నారు. జెలెన్​స్కీ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విషయంపై ఏకీభవిస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పడంలో ఇండియా కీలకంగా ఉంటుందని భావిస్తున్నాయి.

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్​ యుద్ధం.. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. సప్లై-చెయిన్​ వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. వీటన్నింటి మధ్య ఇప్పుడు అజిత్​ దోవల్​ మాస్కోకు వెళుతున్నారన్న వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చేపట్టే చర్చల్లో సానుకుల ఫలితాలు వెలువడాలని అందరు ఆశిస్తున్నారు.

సంబంధిత కథనం