Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు
Jayanthi Kannappan: నటుడు ప్రకాశ్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇవ్వడంపై జయంతి కన్నప్పన్ కీలక విషయాలు వెల్లడించారు. వారి జీవితాల్లో జరిగిన విషయాలపై మాట్లాడారు.
Jayanthi Kannappan: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని మలుపులు ఉన్నాయి. తన మొదటి భార్య లలిత కుమారికి ఆయన 2009లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత పొనీ వర్మను వివాహం చేసుకున్నారు. అయితే, లలితతో ప్రకాశ్ రాజ్ విడాకుల వ్యవహారంపై తమిళ సెలెబ్రిటీ జయంతి కన్నప్పన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్, లలిత మధ్య పరిచయం, పెళ్లి, విడాకుల గురించి జయంతి వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలివే..
ప్రకాశ్ రాజ్, లలిత ప్రేమ ఇలా..
“డిస్కో శాంతి సోదరే లలిత. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే నటులకు డిస్కో శాంతి వసతి ఇచ్చేవారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రకాశ్ రాజ్ వచ్చేవారు. అప్పుడు డిస్కో శాంతి సోదరి లలితను ప్రకాశ్ రాజ్ కలిశారు. ఆ తర్వాత ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ప్రకాశ్, లలిత పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లతో వారి వివాహ జీవితం చాలా సంతోషంగా గడుస్తుండేది” అని జయంతి కన్నప్పన్ తెలిపారు.
కొత్త పరిచయాలతో పరిస్థితుల్లో మార్పు
సినీ ప్రపంచంలో కొత్తకొత్త పరిచయాలు అయినప్పుడు ఒక్కోసారి వ్యక్తిగత జీవితాల్లో పరిస్థితులు మారిపోతాయని జయంతి కన్నప్పన్ చెప్పారు. “సినిమా ప్రపంచం గురించి చాలా మందికి తెలుసు. ఎవరైనా కొత్త వారు జీవితంలోకి వస్తే.. ఇప్పటికే ఉన్న పరిస్థితులు మారిపోతాయి. మగాళ్లు బయటికి వెళతారు. చాలా మందిని చూస్తారు. ఎవరికో ఒకరికి మనసు ఇస్తారు” అని జయంతి అన్నారు. అయితే, వారి జీవితాల్లోకి వచ్చిన మహిళ ఏం చేస్తారనేదే ప్రశ్నగా మారుతుందని చెప్పారు. ఎందుకంటే పరిస్థితుల గురించి వారికేమీ తెలియదని అన్నారు.
కుమారుడి మరణం
ప్రకాశ్ రాజ్, లలిత పెద్ద కుమారుడు సిద్ధు (4) 2004లో మృతి చెందాడు. ఓ గాలిపటాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తూ పై నుంచి పడి కన్నుమూశాడు. ఆ తర్వాతి నుంచి ప్రకాశ్, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. వారిద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి 2009లో లలితకు ప్రకాశ్ విడాకులు ఇచ్చారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే, కుమారుడి మరణం ప్రకాశ్, లలితను తీవ్రంగా బాధపెట్టిందని జయంతి కన్నప్పన్ తెలిపారు. అలాగే, పోనీ వర్మతో పరిచయం వల్లే లలితకు ప్రకాశ్ రాజ్ దూరమయ్యారనేలా పరోక్షంగా చెప్పారు.
విడాకుల విషయంలో ప్రకాశ్ రాజ్ మాటను లలిత కాదనలేదని, ఆయన చెప్పినట్టే చేశారని జయంతి కన్నప్పన్ తెలిపారు. “విడాకులు తీసుకోవాలని ప్రకాశ్ రాజ్ నిర్ణయించుకున్నప్పుడు లలిత కూడా ప్రతిఘటించలేదు. ప్రకాశ్ రాజ్ తన భర్త అని, ముగ్గురు పిల్లల తండ్రి అని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని చెప్పారు. లలిత నుంచి విడిపోయినా లలితకు చేయాల్సిందంతా ప్రకాశ్ రాజ్ చేశారు. ఇద్దరు పిల్లలను విదేశాలకు పంపారు” అని జయంతి తెలిపారు.
ప్రకాశ్ రాజ్, పొనీ వర్మ వివాహం 2010లో జరిగింది. వారిద్దరికీ వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు. అయితే, విడాకులు తీసుకునే ముందు కూతుళ్లకు ఎందుకు విడిపోతున్నామో తాను పూర్తిగా వివరించానని గతంలో ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాతే లలితతో విడిపోయినట్టు వెల్లడించారు.
టాపిక్