Intinti Ramayanam Movie Review : తెలంగాణ యాసలో వచ్చిన 'ఇంటింటి రామాయణం' సినిమా ఎలా ఉంది?
Intinti Ramayanam OTT Review : ఇటీవల కాలంలో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో జరిగే నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు చిత్రాలు. తాజాగా వచ్చిన ఇంటింటి రామాయణం సినిమా కూడా అలాగే వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?
సినిమా : ఇంటింటి రామాయణం, నటీనటులు : నరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజిమామ, చేవెళ్ల రవి(బిత్తిరి సత్తి), జీవన్స రాధిక, స్టీవెన్ తదితరలు, దర్శకుడు: సురేష్ నరెడ్ల, నిర్మాతలు: గోపీచంద్ ఇన్నమూరి, వెంకట్ ఉప్పుటూరి, సంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్, సినిమాటోగ్రఫీ: పీసీ మౌళి, ఎడిటర్: ఎస్బీ ఉద్ధవ్.
కథ
రాములు(నరేశ్) ఓ మంచి మనిషి. కమలాపూర్ గ్రామంలో అందరితోనూ బాగుంటాడు. అతడి చుట్టూ కొంతమంది ముఖ్యమైనవారు ఉంటారు. స్నేహితుడు చనిపోతే అతడి కుమారుడు శ్రీను( రాహుల్ రామకృష్ణ)ను సొంత కుమారుడిలా చూసుకుంటాడు. తన చుట్టూ ఉన్నవారికి సాయం చేసే గుణం రాములుకు ఉంటుంది. అయితే అతడికి తెలియకుండా శ్రీను, సంధ్య(నవ్య స్వామి) ప్రేమించుకుంటారు.
ఓ రోజు రాములు ఇంట్లో అందరూ పదిరోజులపాటు వేరే ఊరికి వెళ్తారు. దీంతో రాములు బామ్మర్ది(అంజి మామ) పార్టీ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. గట్టిగా పదిరోజులు పార్టీ చేసుకుంటారు. రాములు భార్య తిరిగి వచ్చి చూసేసరికి బంగారం కనిపించదు. పోలీసుల వరకూ విషయం వెళ్తుంది. ఇంట్లోని వాళ్లనే పోలీసులు అనుమానిస్తారు. ఇంతకీ ఆ బంగారం తీసింది ఎవరు? శ్రీను, సంధ్యల ప్రేమ గురించి రాములకు తెలిసిందా? సొంత వాళ్లు రాములుకు దూరమయ్యారా? కలిసే ఉన్నారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ
ఇంటింటి రామాయణం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంట్లో బంగారం కనిపించకపోతే.. అందరి మీద అనుమానపడతాం కదా.. అలానే ఈ సినిమాలో చూపించారు. పాత్రలు డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. తెలంగాణ యాసలో అందరూ చక్కగా మాట్లాడుతారు. స్క్రీన్ ప్లే కూడా నీట్ గా ఉంది. సీనియర్ నటు నరేష్ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే అతడు తెలంగాణ యాస పలికే విధానం మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇక రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, అంజిమామతోపాటు ఇతర నటులు కూడా తమ పాత్రకు తగ్గట్టుగా నటించారు.
కథ బాగుంటుంది, వాస్తవికంగా ఉంటుంది. కానీ కాస్త స్లోగా వెళ్తుంది. కొన్ని సీన్లలో లాగ్ ఎక్కువైంది. తర్వాత ఏం జరుగుతుందోనని ఈజీగా ఊహించేయోచ్చు. మన చుట్టు పక్కల జరిగే కథే ఈ సినిమా. అయితే ఇంకాస్త కామెడీ పెంచితే ఇంగా బాగుండేది. రెండు, మూడు సీన్లలో బూతులు కూడా ఉంటాయి. కథలో ఇంకా డ్రామా క్రియేట్ చేసి, ఎమోషనల్ సీన్స్ పెడితే సినిమా ఇంకాస్త కనెక్ట్ అయ్యేది. కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం చేసినా.. నవ్వు మాత్రం రాలేదు. చివరగా రచయిత, దర్శకుడు సురేశ్ నరెడ్ల ప్రజలను ఆకట్టుకునే కథను ఎంచుకున్నాడు. కల్యాణ్ మాలిగ్ సంగీతం బాగుంది, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. తెలంగాణ పల్లెటూరి ముచ్చట్లు చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.