Indian 2 OTT Release: అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి భారతీయుడు 2.. ఆరోజునే రానుందా!
Indian 2 OTT Release: భారతీయుడు 2 సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై అంచనాలు కూడా వెలువడ్డాయి.
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) సినిమా బోలెడు అంచనాలతో వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. క్లాసిక్ మూవీ భారతీయుడు చిత్రానికి 28ఏళ్ల తర్వాత సీక్వెల్‍గా ఈ చిత్రం అడుగుపెట్టింది. అయితే, భారతీయుడు 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆశించిన కలెక్షన్లు రావడం లేదు. దీంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
భారతీయుడు 2 సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ సరిగా లేకపోవటంతో త్వరగానే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని మేకర్స్ కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 2వ తేదీనే భారతీయుడు 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అవినీతిపరులను అంతం చేసే సేనాపతి పాత్రనే భారతీయుడు 2 చిత్రంలో చేశారు కమల్ హాసన్. విభిన్నమైన గెటప్‍ల్లో కనిపించారు. అయితే, భారతీయుడు మ్యాజిక్ ఈ సీక్వెల్‍లో రిపీట్ కాలేదు. దర్శకుడు శంకర్ ఈ మూవీని ఔట్‍డేటెడ్ తీరులో తెరకెక్కించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రానికి ఆరంభం నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది.
భారతీయుడు 2 చిత్రంలో కమల్‍తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక భవానీ శంకర్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా, వివేక్ కీరోల్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీని ప్రొడ్యూడ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
రన్‍టైమ్ తగ్గించినా..
నెగెటివ్ టాక్ రావడంతో భారతీయుడు 2 టీమ్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ మూవీ లెంగ్త్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రన్ టైమ్ కాస్త కట్ చేసింది. 12 నిమిషాల పాటు నిడివి తగ్గించింది. ముందుగా 3 గంటల రన్‍టైమ్‍తో ఈ చిత్రం వచ్చింది. ట్రిమ్ చేసిన తర్వాత 2 గంటల 52 నిమిషాల రన్‍టైమ్‍తో ఉంది. అయితే, ఈ వ్యూహం కూడా పెద్దగా ఫలించలేదు. భారతీయుడు 2 మూవీ కలెక్షన్లు మాత్రం పుంజుకోలేదు.
భారతీయుడు 2 మూవీని సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందించినట్టు అంచనా. చాలా ఏళ్లుగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ గతేడాది నుంచే జోరు అందుకుంది. ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఈ మూవీకి సుమారు రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లే వచ్చినట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ పెద్దగా వసూళ్లు రావడం లేదు. ఈ మూవీకి కొనసాగింపుగా భారతీయుడు 3 కూడా రానుంది. ఆ ట్రైలర్‌ను భారతీయుడు 2కు అటాచ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. భారతీయుడు 3 వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.