Indian 2 day 3 box office collection: దారుణంగా పడిపోయిన భారతీయుడు 2 కలెక్షన్లు.. సండే అయినా థియేటర్లకు రాని జనం
Indian 2 day 3 box office collection: భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు మూడో రోజు దారుణంగా పడిపోయాయి. నిజానికి ఎలాంటి సినిమా అయినా శని, ఆదివారాల్లో కలెక్షన్లు కాస్త పెరుగుతాయి కానీ ఈ సినిమా విషయంలో అది రివర్స్ అయింది.
Indian 2 day 3 box office collection: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నాయి. తొలి షో నుంచే వచ్చిన నెగటివ్ టాక్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఆదివారం కూడా ఈ సినిమా చూడటానికి జనం థియేటర్లకు రాలేదంటే ఇది ఎంత డిజాస్టర్ గా మిగిలిపోనుందో అర్థం చేసుకోవచ్చు.
భారతీయుడు 2 బాక్సాఫీస్
భారతీయుడు 2 (ఇండియన్ 2) మూవీ తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.25.6 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. అయితే సినిమా దారుణంగా ఉందన్న రివ్యూలతో రెండు, మూడు రోజుల్లో కలెక్షన్లు తగ్గాయి. రెండో రోజు ఈ కలెక్షన్లు రూ.18.2 కోట్లకు పడిపోగా.. మూడో రోజు కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. అందులోనూ తమిళ మార్కెట్ నుంచే దాదాపు 80 శాతం వసూళ్లు రావడం విశేషం.
1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ భారతీయుడు 2 జనాన్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. మూడో రోజైన ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా.. అందులో తమిళ వెర్షన్ కే రూ.11 కోట్లు వచ్చాయి. ఇక తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్ కు రూ.1.3 కోట్లు మాత్రమే రావడం గమనార్హం.
పడిపోతున్న కలెక్షన్లు
భారతీయుడు 2 మూవీ అన్ని వెర్షన్లు కలిపి ఫస్ట్ వీకెండ్ దేశవ్యాప్తంగా కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది. రిలీజ్ రోజు అయిన శుక్రవారం (జులై 12) రూ.25.6 కోట్లు వచ్చాయి. అందులో తమిళంలో రూ.16.5 కోట్లు, తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో రూ.1.2 కోట్లు ఉన్నాయి. ఇక రెండో రోజు ఈ కలెక్షన్లు రూ.18.2 కోట్లకు పడిపోయాయి. అందులో తమిళ వెర్షన్ కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చాయి.
ఫస్ట్ వీకెండే ఇంత దారుణమైన కలెక్షన్లు సంపాదించిన భారతీయుడు 2 మూవీ సోమవారం (జులై 15) నుంచి మరింత పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో చాలా వరకు థియేటర్లలో కనిపించకుండా పోయింది. కేవలం తమిళ మార్కెట్లో అంతోఇంతో నడుస్తోంది.
భారతీయుడు 2 ఎలా ఉందంటే?
దేశంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను చర్చిస్తూ ఇండియన్ 2 సినిమాను ఆసక్తికరంగా ఆరంభించారు శంకర్. కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయినట్లుగా చూపించి కమల్ హాసన్ క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై చూపించారు. బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాల్లోజల్సాలు చేస్తోన్న ఓ వ్యాపారిని అంతం చేసే యాక్షన్ సీన్ తో కమల్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచే కథాగమనం మొత్తం రొటీన్‌గా మారిపోయింది.
భారతీయుడు తో కంపేర్ చేస్తూ సీక్వెల్ చూస్తే పూర్తిగా ఆడియెన్స్ డిసపాయింట్ కావడం ఖాయం. కథ, కథనాల పరంగా శంకర్ మార్కు ఎమోషన్స్, మ్యాజిక్ ఈ సినిమాలో ఎక్కడ కనిపించదు. కమల్ హాసన్ యాక్టింగ్ ఒక్కటే సినిమాకు రిలీఫ్‌కు చెప్పవచ్చు.
టాపిక్