Bharatheeyudu 2: నెగెటివ్ టాక్‍తో కీలక నిర్ణయం తీసుకున్న భారతీయుడు 2 టీమ్.. ఈ వ్యూహం ఫలిస్తుందా?-bharatheeyudu 2 team decided to trim 20 minutes runtime amid negative response from audience indian 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bharatheeyudu 2: నెగెటివ్ టాక్‍తో కీలక నిర్ణయం తీసుకున్న భారతీయుడు 2 టీమ్.. ఈ వ్యూహం ఫలిస్తుందా?

Bharatheeyudu 2: నెగెటివ్ టాక్‍తో కీలక నిర్ణయం తీసుకున్న భారతీయుడు 2 టీమ్.. ఈ వ్యూహం ఫలిస్తుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 13, 2024 10:53 PM IST

Bharatheeyudu 2: భారతీయుడు 2 సినిమాకు ఊహించని విధంగా నెగెటివ్ టాక్ వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూవీ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Bharatheeyudu 2: నెగెటివ్ టాక్‍తో కీలక నిర్ణయం తీసుకున్న భారతీయుడు 2 టీమ్.. ఈ వ్యూహం ఫలిస్తుందా?
Bharatheeyudu 2: నెగెటివ్ టాక్‍తో కీలక నిర్ణయం తీసుకున్న భారతీయుడు 2 టీమ్.. ఈ వ్యూహం ఫలిస్తుందా?

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా భారీ అంచనాలతో వచ్చింది. మంచి హైప్ మధ్య ఈ శుక్రవారం (జూలై 12) ఈ చిత్రం రిలీజైంది. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయుడు 2 చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. అంచనాలు తలకిందులవుతూ ప్రేక్షకుల నుంచి చాలా మైనస్‍ పాయింట్లు వినిపించాయి. దీంట్లో రన్‍టైన్ అంశం కూడా ప్రధానంగా ఉంది. దీంతో దిద్దుబాటు చర్యలకు మూవీ టీమ్ ఉపక్రమించింది.

రన్‍టైన్‍లో కోత

భారతీయుడు 2 సినిమా రన్‍టైమ్‍ను తగ్గించాలని మూవీ టీమ్ నిర్ణయించింది. కొన్ని సీన్లను కట్ చేయనుంది. సుదీర్ఘంగా కొన్ని సీక్వెన్స్‌లను తగ్గించాలని డిసైడ్ అయింది. మొత్తంగా సుమారు 20 నిమిషాల రన్‍టైమ్‍కు కోత పెట్టనుంది. ముందుగా భారతీయుడు 2 చిత్రం సుమారు 3 గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. ఇప్పుడు.. ట్రిమ్ చేశాక 2 గంటల 40 నిమిషాలకు తగ్గనుంది. రేపటి (జూలై 13) నుంచే ట్రిమ్ చేసిన వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితం కానుంది. అన్ని భాషల వెర్షన్‍లకు రన్‍టైమ్ తగ్గనుంది.

భారతీయుడు 2 చిత్రం సాగదీతగా ఉందని, కొన్ని సీక్వెన్స్‌లు ఎక్కువసేపు ఉండి విసుగు తెప్పించాయనే అభిప్రాయాలు కొందరు ప్రేక్షకుల నుంచి వచ్చాయి. దీంతో రన్‍టైమ్ తగ్గించాలనే నిర్ణయానికి మూవీ టీమ్ వచ్చింది.

ప్లాన్ ఫలిస్తుందా!

భారతీయుడు 2 చిత్రానికి ఫస్ట్ డే అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అంచనా. అయితే, నెగెటివ్ టాక్ రావటంతో శనివారమైన రెండో రోజు బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించేలా ఉంది. దీంతో మూవీ టీమ్ తేరుకుంది. రన్‍టైమ్ తగ్గించి గ్రిప్పింగ్‍గా మార్చాలని డిసైడ్ అయింది.

అయితే, భారతీయుడు 2 చిత్రానికి ఇప్పటికే మిక్స్డ్ టాక్ విపరీతంగా పెరిగిపోయింది. మూవీ మొదటి అర గంట మినహా మిగిలినదంతా ఏ మాత్రం ఆకట్టుకోలేదనే కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా ఔట్‍డేటెట్ కథనంతో శంకర్ నిరాశపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కమల్ హాసన్ గెటప్స్ కూడా సరిగా లేవనే టాక్ వచ్చింది. దీంతో రన్‍టైమ్ తగ్గించినా ప్రేక్షకులు భారీగా ఈ మూవీకి వెళ్లే సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే, ట్రిమ్ చేయడం వల్ల మూవీలో బోర్ తగ్గితే ప్రభావం ఉండొచ్చు. మరి రన్‍టైమ్ తగ్గించిన భారతీయుడు 2 మూవీ టీమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

భారతీయుడు 2 చిత్రంలోనూ అవినీతిపరులను అంతం చేసే సేనాపతి పాత్రే చేశారు కమల్ హాసన్. అయితే, ఈ మూవీలో ఎమోషన్స్, డ్రామా పండలేదనే టాక్ వచ్చింది. భారతీయుడు చిత్రానికి ఈ సీక్వెల్ ఏ మాత్రం దగ్గరికి కూడా వెళ్లలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారతీయుడు 2లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియాంక భవానీ శంకర్ కీలకపాత్రలు చేశారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారతీయుడు 3 చిత్రం కూడా రానుంది. ఈ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Whats_app_banner