Boycott Laal Singh Chaddha: నా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటున్న వాళ్లనూ గౌరవిస్తా: ఆమిర్‌ఖాన్
Boycott Laal Singh Chaddha: కొంతకాలంగా ఆమిర్‌ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా రిలీజ్ సందర్భంగానూ ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలన్న హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఆమిర్‌ఖాన్ బాలీవుడ్‌లో టాప్ హీరో. కెరీర్‌లో చాలా వరకూ సక్సెస్ అందుకున్న సినిమాలే ఎక్కువ. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడమూ అతనికి అలవాటే. అయితే కొంతకాలం కిందటి నుంచి ఆమిర్‌పై పడిన దేశ వ్యతిరేకి ముద్రతో అతని సినిమాలపైనా ఆ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా కూడా కొన్ని రోజులుగా ట్విటర్‌లో టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా ఉంది.
ఈ సినిమా గురువారం (ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. బుధవారం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనికి తన మాజీ భార్య కిరణ్ రావ్‌తో కలిసి వచ్చాడు ఆమిర్‌ఖాన్. ఈ బాయ్‌కాట్ పిలుపుపై గతంలోనూ స్పందించిన అతడు.. ఇప్పుడు కూడా మాట్లాడాడు. ఈ సినిమాను చూడొద్దనుకుంటున్న వారి సెంటిమెంట్‌ను కూడా తాను గౌరవిస్తానని అనడం విశేషం.
"ఒకవేళ నేను ఎవరివైనా మనోభావాలు దెబ్బ తీసి ఉంటే దానికి చింతిస్తున్నాను. ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎవరికైనా సినిమా చూడొద్దు అని ఉంటే నేను వాళ్ల సెంటిమెంట్‌ను గౌరవిస్తా" అని ఆమిర్ అన్నాడు. అయినా సరే ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని కూడా అతడు కోరాడు. "మేము ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది ఈ సినిమా కోసం శ్రమించారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా" అని ఆమిర్ అన్నాడు.
లాల్ సింగ్ చడ్డా మూవీ హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్ గంప్‌కు రీమేక్. ఆ సినిమాలో టామ్ హ్యాంక్స్ పోషించిన పాత్రను ఇప్పుడు ఆమిర్ పోషిస్తున్నాడు. టాలీవుడ్ నటుడు నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే స్పెషల్ స్క్రీనింగ్‌లు చూసిన సెలబ్రిటీలు దీనికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫారెస్ట్ గంప్ కంటే కూడా ఈ సినిమా ఎక్కువగా మనసులను తాకిందని వాళ్లు అంటున్నారు.