HanuMan Movie: హనుమాన్ కోసం రంగంలోకి దిగిన రానా.. అప్పుడే తేజకు ఫ్యాన్ అయ్యానన్న స్టార్
HanuMan Movie: హనుమాన్ మూవీ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్లను వేగవంతం చేసింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడుపెంచింది. తాజాగా ముంబైలో మీడియాతో హనుమాన్ టీమ్ సభ్యులు మాట్లాడారు.
HanuMan Movie: సూపర్ హీరో మూవీ హనుమాన్ (హను-మాన్) రిలీజ్ సమీపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి.. ఈ సమావేశానికి అతిథిగా వచ్చారు.
బాలీవుడ్‍లోనూ రానా చాలా పాపులర్. బహుబలి సినిమాలు సహా కొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆయన నటించారు. బాలీవుడ్ వర్గాల్లో రానాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ తరుణంలో హిందీలో హనుమాన్‍ను ప్రమోట్ చేసేందుకు రానాను హనుమాన్ టీమ్ ఆహ్వానించింది. దీంతో ముంబైలో జరిగిన మీడియా సమావేశానికి రానా వచ్చారు. హనుమాన్ హీరో, దర్శకుడిని హిందీ మీడియాకు పరిచయం చేశారు.
ఇంద్ర సినిమాలో బాలనటుడిగా చేసినప్పుడే తనతో పాటు తెలుగు వారందరూ తేజ సజ్జాకు అభిమానులమయ్యామని రానా అన్నారు. “మెగాస్టార్ (చిరంజీవి)తో చేసిన ఇంద్ర సినిమాలో పిల్లాడి క్యారెక్టర్ ఇతడు (తేజ సజ్జా) చేశాడు. ఆ రోజు నుంచి నేను మాత్రమే కాదు తెలుగు మాట్లాడే ప్రతీ ఒక్కరూ ఇతడి అభిమానులయ్యారు. రెండున్నరేళ్ల వయసు నుంచి ఇతడు నటిస్తున్నాడు. ఈ విషయంలో నా కన్నా సీనియరే” అని రానా అన్నారు. తాను పదేళ్ల క్రితం ముంబైకు వచ్చానని, కానీ ఇక్కడి వారు తనను ప్రేమించారని రానా అన్నారు.
మన మనసులకు ఎంతో దగ్గరగా ఉండే అంశంతో హనుమాన్ సినిమాను తెరకెక్కించారని రానా అన్నారు. “మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండే హనుమాన్‍ను ఈ టీమ్ రూపొందించారు. ఈ చిత్రం గురించి ఆన్‍లైన్‍తో పాటు అన్ని చోట్ల ఉత్సాహం ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం” అని రానా బాలీవుడ్ మీడియాకు చెప్పారు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మను పరిచయం చేశారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తొలి చిత్రానికే రెండు జాతీయ అవార్డులు వచ్చాయని రానా తెలిపారు. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఆ! చిత్రానికి మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై మీడియాకు గుర్తు చేశారు రానా.
హనుమాన్ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఉత్తరాదిన భారీ స్థాయిలో హనుమాన్ విడుదల కానుంది. ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్‍లో హనుమాన్‍ను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది సూపర్ హీరోగా మారే యువకుడి పాత్రను హనుమాన్ చిత్రంలో పోషించారు తేజ సజ్జా. ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
సంబంధిత కథనం