Hollywood Horror Movie: భయంతో పరుగులు తీసేలా చేసిన హారర్ మూవీ.. అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లు.. మీరు చూశారా?
Hollywood Horror Movie: హాలీవుడ్ హారర్ మూవీ చూసిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. థియేటర్లలోనే మూర్చపోయారు. 44 ఏళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ సినిమాగా నిలిచిన ది ఎగ్జార్సిస్ట్ మీరు చూశారా?
Hollywood Horror Movie: హాలీవుడ్ లో వచ్చిన ఎన్నో హారర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఒక హారర్ సినిమా మాత్రం వణికించింది. ప్రేక్షకులను థియేటర్ల నుంచి పరుగులు పెట్టేలా చేసింది. కొందరైతే అక్కడే మూర్చపోయారు. హాలీవుడ్ చరిత్రలో వచ్చిన అత్యంత భయానక సినిమాల్లో ఒకటిగా నిలిచింది 1973లో వచ్చిన ది ఎగ్జార్సిస్ట్.
ది ఎగ్జార్సిస్ట్.. అత్యధిక వసూళ్లు..
హారర్ సినిమాలు చాలా సేఫ్ అనే వాదన సినిమా ఇండస్ట్రీలో ఉంది. తక్కువ బడ్జెట్ తో లాభాల పంట పండించే ఈ మూవీస్ హాలీవుడ్ లో ఎక్కువగా వచ్చాయి. ఎన్నో దశాబ్దాలుగా అక్కడి హారర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను వణికించాయి.. ఇప్పటికీ వణికిస్తూనే ఉన్నాయి. అయితే సరిగ్గా 50 ఏళ్ల కిందట వచ్చిన ది ఎగ్జార్సిస్ట్ మూవీ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది.
అత్యధిక వసూళ్లు సాధించిన ఆర్-రేటెడ్ హారర్ మూవీ ఇది. 44 ఏళ్ల పాటు ఈ రికార్డును నిలుపుకుంది. కేవలం 1.1 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 44.1 కోట్ల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ మూవీ హాలీవుడ్ లో అత్యంత భయానక సినిమాల్లో ఒకటి. 1973లో ఈ మూవీ రిలీజైంది.
ది ఎగ్జార్సిస్ట్.. వణికించింది..
50 ఏళ్ల కిందట వచ్చిన ఈ ది ఎగ్జార్సిస్ట్ మూవీని విలియం ఫ్రెడ్కిన్ డైరెక్ట్ చేశాడు. ఇదే పేరుతో విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఓ బాలికకు దెయ్యం పట్టిందని భావించిన ఆమె తల్లి భూతవైద్యం ద్వారా దానిని వదిలించాలని చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. డిసెంబర్ 24, 1973లో కేవలం 24 థియేటర్లలోనే ఈ మూవీ రిలీజైంది.
అయితే మూవీకి తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో క్రమంగా ది ఎగ్జార్సిస్ట్ కు క్రేజ్ పెరిగింది. కొందరు ప్రేక్షకులైతే వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ సినిమా చూడటానికి వచ్చారు. గంటల తరబడి టికెట్ల కోసం వేచి చూశారు. అంతేకాదు మూవీ చూడటానికి థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. కొందరు మూర్చపోగా.. మరికొందరు గట్టిగా ఏడ్చేశారు.
కొందరు థియేటర్లలో నుంచి పారిపోయారు. బయటకు వచ్చిన తర్వాత రాత్రి పూట ఇంటికి వెళ్లడానికి కూడా భయపడినట్లు అప్పట్లో కొందరు ప్రేక్షకులు చెప్పడం గమనార్హం. ఈ సినిమాపై డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. మూవీని ప్రదర్శించిన థియేటర్ల ఓనర్లు, ప్రేక్షకుల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీలు తీశారు.
44 ఏళ్లు టాప్ లోనే..
ది ఎగ్జార్సిస్ట్ వసూళ్లను బ్రేక్ చేసే మరో హారర్ మూవీ రావడానికి 44 ఏళ్లు పట్టింది. 2017లో వచ్చిన ఇట్ (IT) మూవీ ప్రపంచవ్యాప్తంగా 70.1 కోట్ల డాలర్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఆర్-రేటెట్ హారర్ మూవీగా నిలిచింది. ది ఎగ్జార్సిస్ట్ మూవీ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కార్స్ కు నామినేట్ అయిన తొలి హారర్ మూవీ కూడా కావడం విశేషం. ఈ ఎగ్జార్సిస్ట్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ధైర్యం చేయగలరు అనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి చూసేయండి.