Anajali: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి.. విశ్వక్ సేన్ మంచి స్నేహితుడంటూ కామెంట్స్
Anjali Vishwak Sen Gangs Of Godavari: హీరోయిన్ అంజలి తన పెళ్లిపై వచ్చిన వార్తలన్నీ పుకార్లని, తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్‌లో విశ్వక్ సేన్ తనకు మంచి స్నేహితుడంటూ కామెంట్స్ చేసింది.
Anjali Clarity On Her Marriage: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్‌గా అంజలి చేస్తోంది. మే 31న సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
ట్రైలర్ చాలా బాగుంది. మీ పాత్ర మాస్‌గా, కొత్తగా ఉంది?
థాంక్యూ అండీ. ఈ పాత్ర చేయడం నాక్కూడా కొత్తగా ఉంది. ఇలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.
విశ్వక్ సేన్ గురించి?
విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్‌లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్రతో మీ బంధం ఎలా ఉండబోతుంది?
మా పాత్రల బంధం స్వీట్‌గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.
పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?
కచ్చితంగా చేసుకుంటాను. కానీ, ఇప్పుడు కాదు. నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.
మీరు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫైనల్ కాపీ చూశారా? ఎలా అనిపించింది?
ఇది అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
దర్శకుడు కృష్ణ చైతన్య గురించి?
మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.
నిర్మాతల గురించి చెప్పండి?
వరుస విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సితార లాంటి సంస్థలో పని చేయడం సంతోషంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అలాంటి నిర్మాణ సంస్థ తోడు కావడం వల్లే.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది.
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?
యువన్ గారి సంగీతంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాలో సంగీతం కొత్తగా ఉంటుంది. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది.
తదుపరి చిత్రాల గురించి?
తెలుగులో 'గేమ్ చేంజర్' తో పాటు మరో సినిమా అంగీకరించాను. తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.