HanuMan Review: హను-మాన్ రివ్యూ: మన సూపర్ హీరో అంచనాలను అందుకున్నాడా?-hanuman review prasanth varma makes best indian superhero movie and teja sajja also shines ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Review: హను-మాన్ రివ్యూ: మన సూపర్ హీరో అంచనాలను అందుకున్నాడా?

HanuMan Review: హను-మాన్ రివ్యూ: మన సూపర్ హీరో అంచనాలను అందుకున్నాడా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2024 02:53 AM IST

HanuMan Review: ఎంతో హైప్, భారీ అంచనాల మధ్య హను-మాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరక్కించిన హనుమాన్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

HanuMan Review: హను-మాన్ రివ్యూ: మన సూపర్ హీరో అంచనాలను అందుకున్నాడా?
HanuMan Review: హను-మాన్ రివ్యూ: మన సూపర్ హీరో అంచనాలను అందుకున్నాడా?

HanuMan Review: సినిమా: హను-మాన్; విడుదల: జనవరి 12; ముఖ్య నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్‍దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తదితరులు; సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటర్: సాయి బాబు తలారీ; సంగీతం: అనుదీప్ దేవ్, గౌరహరి; కృష్ణ సౌరభ్; కథ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. హను-మాన్ (హనుమాన్) మూవీకి హైప్ మాత్రం అత్యంత భారీ స్థాయిలో వచ్చింది. ‘భారతీయ ఇతిహాసాల ఆధారంగా సూపర్ హీరో’ అనే కాన్సెప్ట్, 'హనుమంతుడు' ఇందుకు ప్రధాన కారణాలైతే.. ఆ!, జాంబిరెడ్డి లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద ఉన్న అపారమైన నమ్మకం మరో రీజన్. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ అంశం ఆకట్టుకుంటూ హను-మాన్‍పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఇంత భారీ హైప్, అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన హను-మాన్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

కథ ఇదీ

సూపర్ హీరో అవ్వాలనే పిచ్చి కోరికతో చిన్నతనంలోనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు మైకేల్ (వినయ్ రాయ్). అందుకు అడ్డు చెప్పటంతో తల్లిదండ్రులనే అతడు చంపేస్తాడు. సూపర్ హీరో అయ్యే ప్రయత్నాలను చేస్తూనే ఉంటాడు. ఇక, ప్రకృతి అందాల మధ్య ఉండే ‘అంజనాద్రి’ అనే ప్రాంతంలో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు హనుమంతు (తేజ సజ్జా). తమ్ముడు హనుమంతు బాధ్యతను చూసుకుంటూ ఉంటుంది అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్). బందిపోట్ల నుంచి రక్షణ కల్పిస్తామనే పేరుతో అరాచకాలు చేస్తూ అంజనాద్రిలో అజమాయిషి చేస్తుంటాడు పాలెగాడు గజపతి (రాజ్‍దీపక్ శెట్టి). హనుమంతు చిన్నప్పటి నుంచి ప్రేమించే మీనాక్షి (అమృత అయ్యర్).. మెడిసిన్ పూర్తి చేసుకొని ఊరికి వచ్చేస్తుంది. అయితే, హనుమంతుని ఆమె పట్టించుకోదు. మరోవైపు పాలెగాళ్ల అరాచకాలను మీనాక్షి ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో మీనాక్షిని చంపేందుకు గజపతి మనుషులు ప్రశ్నిస్తారు. మీనాక్షిని కాపాడే క్రమంలో తీవ్ర గాయాల పాలై నదిలో పడతాడు హనుమంతు. ఆ తర్వాత అతడికి ఓ మణి వల్ల అతీత శక్తులు వస్తాయి. దీని కోసం మైకేల్ కూడా అంజనాద్రిలో దిగుతాడు. హనుమంతుకి అతీత శక్తులు వచ్చాక పరిస్థితులు ఎలా మారాయి? పాలెగాళ్ల పని పట్టాడా? మీనాక్షి అతడిని ప్రేమిస్తుందా? మణిని తీసుకెళ్లకుండా మైకేల్‍ను హనుమంతు ఎలా అడ్డుకున్నాడు? అంజనాద్రిని ఎలా రక్షించుకున్నాడు? అనేవే హను-మాన్‍ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

కథనం ఇలా..

HanuMan Movie Review in Telugu:భారతీయ ఇతిహాసాలు.. అందులోనూ హనుమంతుడి పేరుతో సూపర్ హీరో చిత్రమనగానే హను-మాన్‍పై భారతీయులందరిలో ఓ ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ సూపర్ హీరోల చిత్రవిచిత్ర విన్యాసాలు ఇప్పటికే చాలా మందికి ముఖం మొత్తేశాయి. ఇంత మహత్తరమైన ఇతిహాసాలు ఉన్న మన మూలాల నుంచి సూపర్ హీరోల సినిమాలు ఎప్పుడు అని భారతీయులు వేచిచూస్తున్న వేళ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ దాన్ని ఆచరణ రూపంలోకి తెచ్చారు. అందరికీ ఇష్టమైన హనుమంతుడే ఆధారంగా హను-మాన్ తెరకెక్కించారు. సూపర్ హీరో సినిమా అంటే ముందుగా విజన్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అందులోనూ దేవుడు అనే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆశ్చర్యపరిచే విన్యాసాలతో పాటు మంచి విజువల్స్, వినోదం ఉండాలి. వీటన్నింటినీ పేపర్‌పై చక్కగా రాసుకున్న ప్రశాంత్.. తెరపై కూడా పర్‌ఫెక్ట్‌గా చూపించారు.

సూపర్ హీరో కావాలని కసిగా ఉండే ఓ పిల్లాడితో ఆసక్తికరంగా హను-మాన్ సినిమా ఓపెన్ అవుతుంది. అంజనాద్రి ప్రాంతాన్ని పరిచయం చేశాక కథనం కాసేపు సాధారణంగా ఉంటుంది. అయితే, ఆ తర్వాత ఆసక్తి మొదలవుతుంది. మీనాక్షి (అమృత అయ్యర్‌)ను హనుమంతు(తేజ సజ్జా) కాపాడే సీక్వెన్స్ నుంచి కథనం పరుగులు పెడుతుంది. హనుమంతుకు అతీత శక్తులు వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ అబ్బుపరుస్తుంది. సూపర్ పవర్స్ వచ్చాక హనుమంతు చేసే పనులు కూడా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు, సూపర్ హీరోల అభిమానులకు ఇవి తెగ నచ్చేస్తాయి. గెటప్ శీను పాత్ర కూడా బాగా వినోదాన్ని పంచుతుంది. కోతి (రవితేజ వాయిస్ ఓవర్) పాత్ర కూడా నవ్విస్తుంది. మన తెలుగు హీరోల ఇమిటేషన్ కూడా సర్‌ప్రైజింగ్‍గా ఉంటూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‍లో ఎంటర్‌టైన్‍మెంట్ పోర్షన్ కూడా మెరుగ్గా తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్ సీక్వెన్స్ కళ్లప్పగించుకొని చూసేలా చేస్తుంది. ఆ తర్వాతే మైకేల్ రాకతో అసలు అంజనాద్రికి అసలు సమస్య మొదలవుతుంది.

ద్వితీయార్ధంలోనూ ఆరంభంలో కథనం కాస్త నెమ్మదించినట్టు అనిపించేలోపే.. మళ్లీ రసవత్తరంగా మారుతుంది. హనుమంతు వద్ద ఉన్న మణి కోసం అంజనాద్రి ప్రజల వద్ద మంచివాడిగా మైకేల్ (వినయ్ రాయ్) నటించడం.. అతడి నిజస్వరూపారాన్ని హనుమంతు గుర్తించడం లాంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ఇక పెద్ద బండరాయిని హనుమంతు మోసే సీక్వెన్స్ గూజ్‍బంప్స్ తెప్పిస్తుంది. హనుమంతు అక్క అంజమ్మ విషయంలో ఎమోషన్ కూడా ఎంగేజ్ చేస్తుంది. విలన్లు కాల్చే బుల్లెట్లతో రాముడి రూపం.. దానికి కొనసాగింపుగా వచ్చే విజువల్.. హనుమంతుడి గురించి సముద్రఖని వివరించే డైలాగ్స్.. ఇలా సెకండ్ హాఫ్‍లో ప్రశాంత్ వర్మ చాలా ఎలివేషన్లు ఇచ్చి ప్రేక్షకులను ఆసాంతం ఎంగేజ్ చేయడంతో పాటు ఆశ్చరపరిచారు. గూజ్‍బంప్స్ మూవ్‍మెంట్స్ చాలానే ఉంటాయి. మైకేల్ కుతంత్రాలు కూడా రక్తికట్టిస్తాయి. ఇక.. హను-మాన్‍కు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ హైలైట్‍గా నిలిచాయి. హిమాలయాల నుంచి హనుమంతుడు వచ్చే తీరును చూపించిన విధానం మెప్పిస్తుంది. సముద్రఖని పాత్ర కూడా ఔరా అనిపిస్తుంది. చివర్లో వచ్చే విజువల్స్ మాత్రం చాలా మంది మనసుల్లో అలా ముద్రించుకుపోతాయన్న విషయంలో సందేహం లేదు. మొత్తంగా ఆనందంతో మనసు నిండిన ఫీలింగ్‍తో ప్రేక్షకులను బయటికి పంపిస్తారు ప్రశాంత్ వర్మ. ఇక, చివర్లో హను-మాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ను కూడా ప్రకటించేశారు.

వీఎఫ్ఎక్స్ భళా

హను-మాన్ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం పీఎఫ్‍ఎక్స్. పరిమిత బడ్జెట్‍లో అత్యుత్తమ క్వాలిటీ గ్రాఫిక్స్ ఔట్‍పుట్ సాధించడంలో ప్రశాంత్ వర్మకు ఫుల్ మార్క్స్ పడతాయి. అండర్ వాటర్ సీక్వెన్స్ నుంచి చివర్లో హనుమంతుడి షాట్ వరకు వీఎఫ్‍ఎక్స్ అంతా ఆకట్టుకుంటుంది. ఈ బడ్జెట్‍లో ఈస్థాయి వీఎఫ్‍ఎక్స్ చూపించడం దర్శకుడి పనితనాన్ని చూపిస్తుంది. సినిమాకు ఏం కావాలో దర్శకుడికి సరైన విజన్ ఉంటేనే ఇలాంటిది సాధ్యమవుతుంది. వందల కోట్లు పెట్టి ఓంరౌత్ తీసిన ఆదిపురుష్ కంటే.. ఎన్నో రెట్ల తక్కువ బడ్జెట్‍తో హను-మాన్‍లో మంచి ఔట్‍పుట్ సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్.

ఇదొక్కటే కాస్త మైనస్

హను-మాన్ చిత్రంలో ఫస్టాఫ్‍, సెకండాఫ్ తొలి అరగంటలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. అక్కడ కొన్ని సీన్లు ఎడిట్ చేసి ఉండొచ్చు. సెకండాఫ్‍లో ఎమోషనల్ సాంగ్ కూడా కాస్త తక్కువే ఉంటే మరింత మెరుగ్గా ఉండేది.

సాంకేతిక అంశాలు

హను-మాన్‍ను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యారు. కథను చాలా జాగ్రత్తగా రాసుకొని.. తన ఇమాజినేషన్‍కు మెరుగ్గా ఆచరణలోకి తీసుకొచ్చారు. సూపర్ హీరో ఎలిమెంట్లతో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍ను ఆకట్టుకునేలా చూపించారు. దాదాపు సినిమా మొత్తం ప్రేక్షకులు లీనమయ్యేలా చేశారు. ఆధ్యాత్మికపరంగానూ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అసలు సిసలైన భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రశాంత్‍కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తదుపరి చిత్రాలపై అంచనాలను మరింత పెంచేశారు. సూపర్ హీరోల సినిమాల్లో పెద్దగా లాజిక్‍లు ఉండాల్సిన అవసరం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశం. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా అత్యున్నతంగా సాగింది. ఎలివేషన్ సీన్లలో, క్లైమాక్స్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. చాలా ప్లస్ అయింది. 

బడ్జెట్‍కు తగ్గట్టు చూస్తే.. నిర్మాణ విలువల్లోనూ హను-మాన్ అత్యుత్తమంగా ఉంటుంది. ప్రశాంత్ వర్మను, ఈ కథను నమ్మి మార్కెట్‍కు మించి బడ్జెట్ పెట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డిని ప్రశంసించాల్సిందే. సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా ఆయన ధైర్యంగా ముందడుగు వేశారు. ఆయన నమ్మకాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తిస్థాయిలో నిలబెట్టారు.

నటీనటులు.. ఎవరెలా..

హనుమంతు పాత్రకు తేజ సజ్జా సరిగ్గా సరిపోయారు. చిల్లర దొంగ నుంచి సూపర్ హీరో పాత్రకు ఆయన ట్రాన్సిషన్ బాగుంది. రెండు విధాలుగానూ మెప్పించారు. యాక్షన్‍లోనూ అదరగొట్టారు. హీరోలను ఇమిటేట్ చేసే సీన్ సహా చాలా చోట్ల తేజ వినోదాన్ని కూడా బాగా పండించారు. ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేశారు. ముఖ్యంగా సూపర్ హీరోగా తేజ సజ్జా ఆహార్యం, నటన పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన అంత సహజంగా నటించారు. ఈ పాత్రకు తేజనే కరెక్ట్. వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఇలాంటి పాత్రలు చాలా సులువు. అంజమ్మ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ అమృత అయ్యర్ అందంతో పాటు నటనలోనూ మెప్పించారు. జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను.. తన వేషం, డైలాగ్ డెలివరీతో హస్యం పంచారు. తేజ - గెటప్ శ్రీను మధ్య సీన్లు ఎంటర్‌టైనింగ్‍గా సాగుతాయి. సముద్రఖనికి మంచి పాత్ర దక్కగా.. ఆయన హుందాగా పూర్తి న్యాయం చేశారు. విలన్ మేకైల్‍గా వినయ్ రాయ్ చాలా సటిల్‍గా.. సీరియస్‍గా చేశారు. వెన్నెల కిశోర్‌ది కాస్త సీరియస్ పాత్రే కాబట్టి.. హస్యం ఎక్కువగా పండించే ఛాన్స్ దక్కలేదు. రాజ్‍దీపక్ శెట్టి సహా మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. తన చివరి సినిమాలో రాకేశ్ మాస్టర్ కూడా మెప్పించారు.

మొత్తంగా.. హను-మాన్ ఎంగేజింగ్‍గా సాగే సూపర్ హీరో స్టోరీ. సూపర్ హీరో విన్యాసాలు, వినోదం, ఆధ్యాత్మికత, మెరుగైన వీఎఫ్‍ఎక్స్, ఎలివేషన్లు, గూజ్‍బంప్స్ మూవ్‍మెంట్లతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా.. కాసేపటికే మళ్లీ సినిమాటిక్ హై ఇస్తుంది. మూవీలో లీనమయ్యేలా చేస్తుంది. హను-మాన్.. థియేటర్లలోనే చూడాల్సి సినిమా.

రేటింగ్: 3.75/5

Whats_app_banner