Guntur Kaaram: ఆ విషయం మాకు వదిలేయండి.. మీరు తగ్గొద్దు: ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా
Guntur Kaaram: గుంటూరు కారం విషయంలో అభిమానులు టెన్షన్ పడొద్దని నిర్మాత నాగవంశీ చెప్పారు. మీకు మళ్లీ స్ట్రాంగ్‍గా చెబుతున్నానని ట్వీట్ చేశారు. ఆ వివరాలివే..
Guntur Kaaram: గుంటూరు కారం సినిమా కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింత అధికంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ అవతార్‌లో వెండి తెరపై మహేశ్ చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉండటంతో గుంటూరు కారం చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కుతాయా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో కాస్త ఉంది. ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ స్పందించారు.
థియేటర్ల సంఖ్య, రిలీజ్ తమకు వదిలేయాలని, సెలెబ్రేషన్లలో ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గొద్దని నాగవంశీ నేడు ట్వీట్ చేశారు. థియేటర్ల విషయంలో కంగారు అవసరం లేదనేలా ఆయన భరోసా ఇచ్చారు. సందడి తగ్గకుండా చూసుకునే బాధ్యత అభిమానులదే అని నాగ వంశీ పేర్కొన్నారు.
“డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ స్ట్రాంగ్‍గా చెబుతున్నా. మేం అదే మాట మీద ఉన్నాం. గుంటూరు కారంకి రికార్డు థియేటర్లలో రికార్డ్ రిలీజ్ ఉంటుంది. రిలీజ్ మాకు వదిలేయండి. సెలెబ్రేషన్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది” అని నాగవంశీ ట్వీట్ చేశారు.
అలాగే, రాజమౌళి సినిమాల కలెక్షన్లకు దగ్గరగా గుంటూరు కారం వెళుతుందని తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను కూడా నాగవంశీ పోస్ట్ చేశారు. అల వైకుంఠపురం విషయంలో అలానే వెళ్లామని, ఇప్పుడు మరోసారి అలా జరుగుతుందని నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. తాను కంటెంట్ (గుంటూరు కారం) చూశానని, అందుకే ధీమాగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
అతడు (2005), ఖలేజా (2010) తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో మూడో చిత్రంగా గుంటూరు కారం వస్తోంది. దీంతో ఈ సినిమాకు చాలా హైప్ ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ తాజాగా వచ్చిన ఫుల్ మాస్ బీట్ సాంగ్ ట్రెండింగ్‍లో దూసుకెళుతోంది. మహేశ్, శ్రీలీల ఊరనాటు స్టెప్‍లకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
గుంటూరు కారం రిలీజ్ కానున్న జనవరి 12నే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా రిలీజ్ కానుంది. ఆ తర్వాతి రోజు ఈగల్, సైంధవ్, జనవరి 14న నా సామిరంగా థియేటర్లలోకి వస్తున్నాయి. మంచి హైప్ ఉన్న ఇన్ని చిత్రాలు ఒకేసారి వస్తుండటంతో దేనికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో గుంటూరు కారం విషయంలో అభిమానులు టెన్షన్ పడొద్దని నాగవంశీ చెప్పారు. హాసినీ, హారిక క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
సంబంధిత కథనం