HanuMan Movie - Prasanth Varma: 2024 సంక్రాంతికి టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంది. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగా’, వెంకటేశ్ ‘సైంధవ్’ చిత్రాలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు జనవరి 12నే రిలీజ్ కానున్నాయి. అయితే, పోటీ తీవ్రంగా ఉండటంతో హనుమాన్ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని కొందరి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. అయితే, తమ చిత్రంపై ఉన్న నమ్మకంతో హనుమాన్ మేకర్స్ వెనక్కి తగ్గలేదు. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా హనుమాన్ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరక్కించారు. అయితే, ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నంలో తమకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సెన్సార్ విషయంలోనూ హనుమాన్ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ అలా ఎవరు చేశారో తనకు తెలియదు అని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే, తనకు ఉన్న పరిచయాలతో సెన్సార్ పూర్తయ్యేలా చేసుకున్నానని తెలిపారు.
“చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు. నేను అసలు ఊహించలేదు. కొన్ని ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. ఏదో అవుతోందని గుర్తించి.. నాకు ఉన్న పరిచయాలు, ఇన్ఫ్లుయెన్స్తో పనులు చేయించుకున్నా” అని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే, ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్న ఎదురవగా.. ఆ విషయం తనకు తెలియదు అని ప్రశాంత్ అన్నారు.
“పెద్ద కార్ల లాంటి సినిమాల మధ్య సైకిల్ లాంటి మీ మూవీని ఎందుకు తీసుకొస్తున్నారు” అనే లాంటి ప్రశ్న కూడా ప్రశాంత్ వర్మకు ఎదురైంది. సైకిల్ పవర్.. కారు కన్నా ఎక్కువగా ఉంటే.. ఆ కారే సొట్టపడొచ్చని, అది ఎవరికీ తెలియదని ప్రశాంత్ వర్మ ఆన్సర్ ఇచ్చారు. రిస్క్ తీసుకోక పోతే ముందుకు సాగలేమని అన్నారు.
గుంటూరు కారం, హనుమాన్ జనవరి 12న వస్తుండగా.. ఈగల్ సినిమా ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13న రిలీజ్ కానుంది. సైంధవ్ చిత్రం జనవరి 14న రానుంది. నా సామిరంగా చిత్రానికి డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా.. సంక్రాంతికి తీసుకొస్తామని మేకర్స్ చెబుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వార్ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. హనుమాన్ మూవీని వాయిదా వేసుకోవాలని కొందరు ఇండస్ట్రీ పెద్దల నుంచి సూచనలు వచ్చినా.. తామే ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామని ఇప్పుడు మార్చడం కుదరదని హనుమాన్ మేకర్స్ స్పష్టంగా చెప్పేశారని టాక్.
బడ్జెట్ తక్కువే అయినా హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందే యువకుడు వారి ప్రాంతాన్ని కాపాడుకునేందుకు విలన్లతో చేసే పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథగా ఉండనుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ వరల్డ్ రేంజ్లో 11 భాషల్లో హనుమాన్ రిలీజ్ కానుంది. హనుమాన్ సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి కాగా.. యూ/ఏ రేటింగ్ వచ్చింది.
సంబంధిత కథనం