Gorre Puranam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ లేటెస్ట్ కామెడీ మూవీ.. మళ్లీ అదే ఓటీటీలో..
Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ నటించిన లేటెస్ట్ కామెడీ గొర్రె పురాణం రాబోతోంది. ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ను ఖరారు చేసుకుంది.
Gorre Puranam OTT: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కామెడీ మూవీ గొర్రె పురాణం. గత నెల 20వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సుహాస్.. ఈ సరికొత్త మూవీ ద్వారా హిట్ అందుకోకపోయినా.. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి నిరూపించాడు.
గొర్రె పురాణం ఓటీటీ రిలీజ్
సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని శుక్రవారం (అక్టోబర్ 4) ఎక్స్ అకౌంట్ ద్వారా సదరు ఓటీటీ వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని వెల్లడించకపోయినా.. త్వరలోనే రానుందని మాత్రం చెప్పింది.
"స్వర్గం కోసం సాగిన వేట చివరికి స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంగా మారింది. గొర్రె పురాణం త్వరలోనే ఆహాలో" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
గొర్రె పురాణం ఎలా ఉందంటే?
సుహాస్ తోపాటు పోసాని కృష్ణ మురళి, రఘులాంటి వాళ్లు నటించిన గొర్రె పురాణం మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. ప్రవీణ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ పేరుకు తగినట్లే ఓ గొర్రె చుట్టే తిరుగుతుంది. ఆ గొర్రె రెండు మతాల మధ్య ఎలా చిచ్చుపెట్టిందన్నది సినిమా ట్రైలర్ లోనే మేకర్స్ చూపించారు. ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో బక్రీద్ విందుగా మారాల్సిన ఓ గొర్రె అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి ఓ గుడిలోకి వెళ్తుంది.
దీంతో ఆ గొర్రె తమదని, దానిని తామే బలిస్తామని హిందువులు కొట్లాటకు దిగుతారు. ఈ గొర్రె కోసం రెండు వర్గాల మధ్య గొడవలు ఎక్కడికి దారి తీశాయి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది సినిమాలో చూడాలి. నిజానికి ఈ సినిమాలో హీరో సుహాస్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా.. తనదైన స్టైల్లో నటనతో మెప్పించాడు.
అయితే థియేటర్లలో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అంతకుముందు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సుహాస్ కు ఈ గొర్రె పురాణం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పుడతడు జనక అయితే గనక అనే మరో మూవీతో రాబోతున్నాడు.