Gangs of Godavari Trailer: మాస్ యాక్షన్, బూతులతో రస్టిక్‍గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. అదరగొట్టిన విశ్వక్‍సేన్
Gangs of Godavari Trailer: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ వచ్చేసింది. పక్కా మాస్ యాక్షన్‍తో రస్టిక్‍గా ఉంది. డైలాగ్ డెలివరీ, యాక్షన్‍తో విశ్వక్‍సేన్ అదరగొట్టాడు.
Gangs of Godavari Trailer: మాస్ కా దాస్, యంగ్ స్టార్ విశ్వక్‍సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మే 31న థియేటర్లలోకి రానుంది. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పక్కా మాస్ క్యారెక్టర్‌ను విశ్వక్ చేస్తున్నారు. దీంతో హైప్ విపరీతంగా ఉంది . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ట్రైలర్ నేడు (మే 25) రిలీజ్ అయింది.
ట్రైలర్ ఇలా..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్‍తో సీరియస్‍గా సాగింది. యువ రాజకీయ నాయకుడు రత్నాకర్ పాత్రలో యాక్షన్, డైలాగ్‍లతో విశ్వక్ అదరగొట్టాడు. మాస్ ఇంటెన్స్ లుక్‍తో మెప్పించాడు. మనుషుల్లో మూడు రకాలు.. “ఒకటోది నాసిరకం.. రెండోది బోసిరకం.. మూడోది నాణ్యమైన రకం” అని గోపరాజు రమణ్ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ షురూ అయింది.
ఆ తర్వాత రత్నాకర్‌గా విశ్వక్ ఎంట్రీ ఉంది. ఎన్నికల ప్రచారంలో మద్యం బాటిళ్లపై, బిర్యానీ పొట్లాలపై ఫొటోలతో లేబుళ్లు.. డబ్బులు పెంచడం ఇలా పక్కా లోకల్ పాలిటిక్స్ కనిపించాయి. ఈ ట్రైలర్లో టైగర్ రత్న (విశ్వక్) నోటి నుంచి బూతుల డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. “నాకు తెలిసిందల్లా ఒకటే.. మన మీదకు ఎవడైనా వస్తే.. వాడి మీద పడిపోవడమే” అంటూ విశ్వక్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. “మనుషులు మూడు రకాలు ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయ నాయకులు” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఎండ్ అయింది. ట్రైలర్లో నేహా శెట్టి స్క్రీన్ టైమ్ కొంచెమే ఉంది.
మొత్తంగా 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ పక్కా రస్టిక్ పొలిటికల్ డ్రామాగా ఇంటెన్స్‌గా ఉంది. విశ్వక్‍సేన్ యాక్షన్, గెటప్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అతడి టేకింగ్ ఈ ట్రైలర్లో ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు తగ్గట్టు సాగింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్, నేహా శెట్టితో పాటు అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది, సాయికుమార్, మధునందన్ కీలకపాత్రలు పోషించారు. విశ్వక్ హీరోగా ఆదికి ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్ దక్కింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మే 31వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది.
బూతులు ఎక్కువయ్యాయా?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విడుదలకు లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‍లో నిర్మాత నాగవంశీ మాట్లాడారు. “ట్రైలర్లో బూతులు ఎక్కువయ్యయాయా.. పర్లేదు కదా ఆ మాత్రం ఉంటే” అని ప్రేక్షకులను నిర్మాత నాగవంశీ అడిగారు. విశ్వక్‍సేన్ హీరోగా చేసిన ఫలక్‍నుమా దాస్ రిలీజై ఈ మే 31వ తేదీకి ఐదేళ్లు కానుందని ఆయన గుర్తు చేశారు. అప్పటికీ ఇప్పటికీ మాస్ ఎంత పెరిగిందో చూశారు కదా అని అడిగారు. ట్రైలర్ ఉన్న మాస్ సినిమాలు రెండో గంటలు కొనసాగుతుందని నాగ వంశీ చెప్పారు.