Duranga Web Series Review: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటే ఇష్టమా.. అయితే ఈ దురంగా సిరీస్‌ మిస్‌ కావద్దు-duranga web series review suspense thriller series with twists and turns ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Duranga Web Series Review: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటే ఇష్టమా.. అయితే ఈ దురంగా సిరీస్‌ మిస్‌ కావద్దు

Duranga Web Series Review: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటే ఇష్టమా.. అయితే ఈ దురంగా సిరీస్‌ మిస్‌ కావద్దు

Hari Prasad S HT Telugu
Aug 24, 2022 02:44 PM IST

Duranga Web Series Review: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటే ఓటీటీలకు ఎప్పుడూ మంచి ముడి సరుకే. అలాంటిదే జీ5 ఓటీటీలో వచ్చిన ఈ దురంగా వెబ్‌సిరీస్‌.

జీ5లో వచ్చిన వెబ్ సిరీస్ దురంగా
జీ5లో వచ్చిన వెబ్ సిరీస్ దురంగా (Twitter)

Duranga Web Series Review: సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీలు ఎప్పుడూ ఆడియెన్స్‌ను ఉత్కంఠకు గురి చేస్తాయి. కథలో వచ్చే మలుపులు మనల్ని మునివేళ్లపై నిలబెడతాయి. ఓ సాదాసీదా స్టోరీ అయినా సరే స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. అందులోనూ ఓ సైకో పాత్ర, సీరియల్‌ కిల్లింగ్‌ సబ్జెక్ట్‌ మంచి అమ్ముడుపోయే సరుకు.

ఈ జానర్‌లో ఇప్పటికే బాలీవుడ్‌లో డర్‌, కౌన్‌, దీవాంగీ, రామన్‌ రాఘవ్‌లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే సినిమా కంటే ఇది వెబ్‌సిరీస్‌కు మరింత మంచి సబ్జెక్ట్‌. ఈ స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్‌గా, రక్తి కట్టేలా చెప్పేందుకు తగిన సమయం ఉంటుంది. ఇప్పుడ జీ5లో వచ్చిన దురంగా వెబ్‌సిరీస్‌ కూడా ఈ జానర్‌కు సంబంధించినదే. మంచి సస్పెన్స్‌, థ్రిల్లర్‌ను ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చుతుందనడంలో సందేహం లేదు.

దురంగా వెబ్‌ సిరీస్‌ స్టోరీ (Duranga Web Series)

కొరియన్‌ డ్రామా ఫ్లవర్‌ ఆఫ్ ఈవిల్‌ ఆధారంగా హిందీలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్ ఇది. ఓ సైకో కిల్లర్‌ కొడుకు తన గతాన్ని దాచిపెట్టి, తన పేరు మార్చుకొని ఓ పోలీస్‌ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకోవడం.. ఆ ఆఫీసర్‌ ఆ సైకో కిల్లర్‌, అతని కొడుకుకు సంబంధించిన కేసునే డీల్‌ చేస్తుండటం.. ఈ క్రమంలో ఆ ఇద్దరికీ ఎదురైన అనుభవాలే ఈ దురంగా వెబ్‌ సిరీస్‌ స్టోరీ.

సమిత్‌ పటేల్‌ (గుల్షన్‌ దేవయ్య), ఇరా పటేల్‌ (ద్రష్టి ధామి)ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తండ్రి ఓ సైకో కిల్లర్‌ అనే విషయాన్ని దాచి పెట్టి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన ఇరాను పెళ్లి చేసుకున్న సమిత్.. ఓ మంచి భర్తగా, తండ్రిగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ హత్య విషయంలో అప్పటికే చనిపోయిన ఆ సైకో కిల్లర్‌, అచ్చూ అతనిలాగే హత్యలు చేస్తున్న కేసును ఇరా తన టీమ్‌తో కలిసి డీల్‌ చేస్తుంటుంది.

ఈ క్రమంలో ఆమె ఊహించని నిజాలు ఎదురవుతూ ఉంటాయి. బాలా బానీ అనే ఆ సైకో కిల్లర్‌ కొడుకు అయిన అభిషేక్‌ బానీ అసలు సమిత్‌ పటేల్‌లా ఎలా మారాడు? బాలా బానీ చనిపోయిన తర్వాత కూడా అతనిలాగే హత్యలు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అతడు బాలా క్రైమ్‌ పార్ట్‌నరేనా? ఈ క్రమంలో సమితే అభిషేక్‌ అన్న విషయం ఇరాకు తెలుస్తుందా అన్నదే ఈ దురంగా వెబ్‌ సిరీస్‌ స్టోరీ.

దురంగా వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

దురంగా ఓ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇందులో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. రొమాన్స్‌, క్రైమ్‌, డ్రామా, ట్విస్టులు ఇలా ప్రతి ఎపిసోడ్‌లోనూ బోర్‌ కొట్టకుండా మిమ్మల్ని అలా తీసుకెళ్లడంలో క్రియేటర్స్‌ సక్సెసయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా సమిత్‌ పాత్రలో గుల్షన్‌ దేవయ్య, ఇరా పాత్రలో ద్రష్టి ధామి అదరగొట్టారు. ఈ సిరీస్‌కు వీళ్ల నటనే హైలైట్‌ అని చెప్పొచ్చు.

కొరియన్‌ డ్రామా అయిన ఈ సిరీస్‌ను మన నేటివిటీకి తగినట్లుగా అడాప్ట్‌ చేసిన తీరు కూడా బాగుంది. హిందీలో గోల్డీ బెహల్‌ ఈ సిరీస్‌ క్రియేటర్‌. ప్రదీప్‌ సర్కార్‌, ఐజాజ్‌ ఖాన్‌ కోడైరెక్ట్‌ చేశారు. ఈ సిరీస్‌ మొదట్లో ప్రధాన క్యారెక్టర్లను అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా.. రానురాను సమిత్‌ ఎవరు? ఈ స్టోరీ ఎలా ముందుకు సాగుతోంది అన్నది అర్థమవుతుంది.

బింజ్ వాచ్ చేసేలా దురంగా వెబ్ సిరీస్ (Duranga webseries)

ఈ సిరీస్‌ తొలి సీజన్‌ మొత్తం 9 ఎపిసోడ్లు. ఒక్కో ఎపిసోడ్‌ను ముగించిన తీరు కూడా మిమ్మల్ని ఆటోమేటిగ్గా మరో ఎపిసోడ్‌ వైపు వెళ్లేలా చేస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ సమిత్‌ గతాన్ని చెబుతూనే, ప్రస్తుత స్టోరీని ముందుకు తీసుకెళ్తుంటారు. ఉత్కంఠ రేపే సీన్స్‌ దాదాపు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఉంటాయి. చివరి ఎపిసోడ్‌ వరకూ సస్పెన్స్‌ను కొనసాగించిన మేకర్స్‌.. రెండో సీజన్‌ కోసం వేచి చూసేలా ఫస్ట్‌ సీజన్‌ను ముగించారు.

ప్రధానంగా స్టోరీ మొత్తం సమిత్‌, ఇరా చుట్టే తిరిగినా.. సమిత్ సోదరి పాత్రలో కనిపించే ప్రాచీ(బార్ఖా బిష్త్‌), అతని చిన్ననాటి ఫ్రెండ్‌, క్రైమ్‌ రిపోర్టర్‌ వికాస్‌ (అభిజీత్‌ ఖండ్‌కేకర్‌), అభిషేక్‌ బానీ.. సమిత్‌గా మారిన తర్వాత వాళ్ల తల్లిదండ్రుల పాత్రలో కనిపించిన దివ్యా సేఠ్‌, రాజేష్‌ ఖట్టర్‌లు కూడా తన క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

కొరియన్‌ డ్రామా అయిన ఫ్లవర్‌ ఆఫ్‌ ఈవిల్‌ సిరీస్‌ను చూడని వాళ్లకు ఈ దురంగా వెబ్ సిరీస్‌ నచ్చుతుంది. కొన్ని సీన్లను ఒరిజినల్‌ నుంచి అలాగే కాపీ చేశారు. అయితే దురంగా తొలి సీజన్‌ సస్పెన్స్‌ మాత్రం రెండో సీజన్‌లోనే వీడుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం