Odela Railway Station Movie Review: ఓదెల రైల్వే స్టేషన్ మూవీ రివ్యూ - డీ గ్లామర్ రోల్ లో హెబ్బాపటేల్ మెప్పించిందా
Odela Railway Station Movie Review: కుమారి 21ఏఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హెబ్బాపటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ ఓదెల రైల్వేస్టేషన్. ఆహా ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే...
Odela Railway Station Movie Review: క్రైమ్ థ్రిల్లర్ కథల్ని వెండితెరపై చెప్పడంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఓటీటీలలో అయితే సెన్సార్ పరమైన ఇబ్బందులు ఉండవు. పరిమిత బడ్జెట్‌లోనే పెద్ద స్టార్ కాస్టింగ్ అవసరం లేకుండా సినిమాను పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఓటీటీలో ప్రతి వారం వివిధ భాషల్లో పదుల సంఖ్యలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి.
సైకో థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన తెలుగు చిత్రం ఓదెల రైల్వేస్టేషన్. దర్శకుడు సంపత్‌నంది (Sampath nandi) కథను అందించిన ఈ చిత్రానికి అశోక్‌తేజ దర్శకత్వం వహించారు. హెబ్బాపటేల్, , సాయిరోనక్, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీ (Aha ott)ద్వారా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఐపీఎస్ ఇన్వేస్టిగేషన్...
అనుదీప్ (సాయిరోనక్) యూపీఎస్‌సి టాపర్. సినిమాల స్ఫూర్తితో ఐఏఎస్ కాదనుకొని ఐపీఎస్ ఎంచుకుంటాడు. ట్రైనింగ్ కోసం ఓదెల ప్రాంతానికి వస్తాడు. అతడు బాధ్యతలు తీసుకున్న తర్వాతే ఓదెలలో వరుసగా కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు హత్యకు గురవుతారు. ఆ సీరియల్‌కిల్లర్‌కు సంబంధించి ఎలాంటి క్లూ పోలీసులకు దొరకదు. రాధ (హెబ్బాపటేల్), తిరుపతి(వశిష్ట సింహా) భార్యాభర్తలు. ఇస్త్రీ పనిచేస్తూ బతుకుతుంటారు. అమ్మాయిల హత్యలకు తిరుపతి తమ్ముడు చందు కారణమని అపోహపడిన అనుదీప్ అతడిని అరెస్ట్ చేస్తాడు. అతడు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే ఊరిలో మరో హత్య జరుగుతుంది. అసలు హంతకుడు ఎవరు? ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి తన ప్రియురాలు స్ఫూర్తితో (పూజితా పొన్నాడ) కలిసి అనుదీప్ వేసిన ప్లాన్ విజయవంతమైందా? ఆ హంతకుడిని రాధ ఏ విధంగా శిక్షించింది అన్నదే ఓదెల రైల్వే స్టేషన్ కథ.
Odela railway station review: రియలిస్టిక్ సైకో థ్రిల్లర్
సాధారణంగా సైకో కిల్లర్ కథలు ఎక్కువగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తోనే ముడిపడి సాగుతుంటాయి. రూరల్ నేపథ్యాలతో ఈ జానర్ లో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఓదెల రైల్వేస్టేషన్ ఆ బాపతు కథే. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు సంపత్‌నంది ఈ కథను రాసుకున్నారు. కుటుంబసభ్యులు, సమాజం చేతిలో అవమానాల పాలై ప్రతి ఏట ఇండియాలో వేలాది మంది ఇంపోటెంట్స్‌గా మారిపోతున్నారు. మానసికపరమైన సమస్యలతో సైకోకిల్లర్స్‌గా అవతారమెత్తుతూ ఎంతో మంది అమాయకులు ప్రాణాలను తీస్తున్నారనే సందేశంతో సినిమాను రూపొందించారు.
మలుపులు రివీల్ కాకుండా odela railway station
తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై చెప్పడానికి సొంత గ్రామమైన ఓదెలను నేపథ్యంగా ఎంచుకున్నారు సంపత్ నంది. ఒగ్గు కథ ద్వారా ఆ ప్రాంత విశిష్టతను, అక్కడి స్వచ్ఛమైన వాతావరణం, మనుషులు, మనస్తత్వాల చూపిస్తూనే కథలోకి వెళ్లడం కొత్తగా ఉంది.అనుదీప్ అనే ఐపీఎస్ ఆఫీసర్ కోణం నుండి ఈ సినిమా కథ సాగుతుంది. ట్రైనింగ్ లో తనకు ఎదురైన కేసును గురించి వివరిస్తూ కథనాన్ని మొదలుపెట్టారు.
వరుసగా ఊరిలో హత్యలు జరుగుతుండటం, హంతకుడిని పట్టుకోవడానికి అనుదీప్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. పోలీసుల, గ్రామస్తుల నుండి తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా అనుదీప్ మాత్రం ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్లాన్ వేశాడన్నది సస్పెన్స్ థ్రిల్ జోడించి దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించారు. ఒక్కో క్యారెక్టర్‌పై అనుమానాల్ని రేకెత్తిస్తూ చివరి వరకు సస్సెన్స్ రివీల్ కాకుండా నడిపించారు. అసలైన హంతకుడు ఎవరన్నది క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ఎపిసోడ్ ఉత్కంఠను పంచుతుంది.
డబుల్ మీనింగ్ డైలాగ్స్...
ఇన్వేస్టిగేషన్ డ్రామాలన్నీ హీరో, విలన్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో ఎంగేజింగ్‌గా నడిపించాలి. అప్పుడే డ్రామా రక్తికడుతుంది. ఇందులో అలా ఎంగేజ్ చేసే సీన్స్ కనిపించవు. అనుదీప్ చేసే అన్వేషణలో సీరియస్‌నెస్ మిస్సయింది. కిల్లర్ ను పట్టుకోవడానికి అనుదీప్ వేసే ప్లాన్‌ను సాదాసీదాగా రాసుకున్నారు. డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఎక్కువైపోయాయి.
డీ గ్లామర్ క్యారెక్టర్ లో...
ఇదివరకు తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది హెబ్బాపటేల్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇందులో డీ గ్లామర్ క్యారెక్టర్‌లో కనిపించింది. యాక్టింగ్ పరంగా కొంత ఇంప్రూవ్ మెంట్ కనబరిస్తే ఆమె కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ లో ఒకటిగా మిగిలేది. యువ ఐపీఎస్‌గా అనుదీప్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌లో కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహా నటన బాగుంది. స్ఫూర్తిగా పూజిత పొన్నాడ కనిపించింది. అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఈ చిన్న సినిమాకు ప్రాణంపోశాయి. సంపత్‌నంది రాసిన కథను ఎలాంటి తడబాటు లేకుండా చెప్పడంలో దర్శకుడు అశోక్‌తేజ కొన్ని చోట్ల తడబడ్డాడు.
గంటన్నర మాత్రమే...
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఓదెల రైల్వేస్టేషన్ మెప్పిస్తుంది. పాటలు, ఫైట్స్, హీరోయిజం లాంటి హంగులు లేకుండా కేవలం గంటన్నర నిడివిలోనే తెరకెక్కిన రియలిస్టిక్ సినిమా ఇది.