tamilrockerz web series review: తమిళ్ రాకర్స్ వెబ్‌సిరీస్ రివ్యూ - పైరసీ భూతంపై వచ్చిన సిరీస్ ఎలా ఉందంటే
తమిళ హీరో అరుణ్ విజయ్(Arun vijay) ప్రధాన పాత్రలో సినిమా పైరసీ (cinema piracy) బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన వెబ్‌సిరీస్ తమిళ్ రాకర్స్. సోని లివ్ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే....
Tamilrockerz web series review: పైరసీ కారణంగా ప్రతి ఏడాది సినీ పరిశ్రమకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. పైరసీని అడ్డుకోవడానికి సినీ వర్గాలతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన కొత్త దారుల్లో ఈ భూతం విస్తరిస్తూనే ఉంది. పైరసీ సైట్స్‌లో తమిళ్‌రాకర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. స్టార్ హీరోల సినిమాల్ని కూడా తొలి ఆట పూర్తికాకముందే తమిళ్ రాకర్స్ పైరసీ చేసిన సంఘటనలు చాలా సార్లు జరిగాయి. ఆ నేపథ్యాల్ని ఎంచుకొని రూపొందించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్. అరుణ్ విజయ్, ఐశ్వర్యమీనన్, వాణిభోజన్ కీలక పాత్రల్లో నటించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను అగ్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్ ప్రొడక్షన్స్ (Avm Productions)నిర్మించింది. సోని లివ్ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ విడుదలైంది.
సినిమా పైరసీ ...
యాక్షన్ స్టార్ ఆదిత్యతో మూడు వందల కోట్ల బడ్జెట్ తో మది అనే నిర్మాత గరుడ అనే సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందురోజే పైరసీ చేస్తామని తమిళ్ రాకర్స్ బెదిరిస్తుంది. తమిళ్ రాకర్స్ గ్యాంగ్ ను పట్టుకునే బాధ్యతను ఏసీసీ రుద్ర (అరుణ్ విజయ్) చేపడతాడు. సినిమాలపై ఇష్టం లేని రుద్ర ఈ కేసును తొలుత తేలికగా తీసుకుంటాడు. పైరసీ కారణంగా సినిమానే నమ్ముకున్న వారి జీవితాలు ఎలా కష్టాల పాలు అవుతున్నాయో తెలుసుకున్న అతడు తమిళ్ రాకర్స్ గ్యాంగ్ కోసం అన్వేషించడం మొదలుపెడతాడు.
ఈ గ్యాంగ్ కు దయా అధిపతి అనే నిజం తెలుస్తుంది. అతడిని రుద్ర పట్టుకున్నాడా? గరుడ సినిమాను పైరసీ కాకుండా ఆపగలిగాడా? నటుడిగా రాణించాలని కలలు కన్న దయా చివరకు సినిమాలపై ద్వేషం పెంచుకొని పైరసీ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కారణమేమిటి? రుద్ర భార్య కీర్తన(ఐశ్వర్య మీనన్) చావుకు కారణం ఎవరు? సంధ్య (వాణి భోజన్) సహాయంతో రుద్ర తమిళ్ రాకర్స్ గ్యాంగ్ ను ఎలా పట్టుకున్నాడన్నదే ఈ సిరీస్ కథాంశం.
సరికొత్త నేపథ్యం
పైరసీ బ్యాక్ డ్రాప్ లో గతంలో సినిమాలు, సిరీస్ లు పెద్దగా రాలేదు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని తమిళ్ రాకర్స్ సిరీస్ ను తెరకెక్కించాడు దర్శకుడు అరివళగన్. ఈ వెబ్ సిరీస్ కు పాపులర్ పైరసీ సైట్ పేరును పెట్టడంతో అందరిలో ఆసక్తిని మొదలైంది. సీడీలతో మొదలైన ఈ పైరసీ దందా ఇంటర్ నెట్ వరకు ఎలా విస్తరించిందనే అంశాన్నిడీటెయిలింగ్ గా ఇందులో చూపించారు. వీడియో, ఆడియోలను వేర్వేరుగా రికార్డ్ చేస్తూ సినిమాలను ఏ విధంగా పైరసీ సైట్స్ లో పెడుతున్నారనేది చెప్పారు.
సందేశంతో...
ప్రలోభాలతో పాటు హీరోల కుటుంబాలపై ఉన్న ద్వేషంతో తమకు జీవితాన్ని ప్రసాదించిన సినిమా ఇండస్ట్రీకి సినిమా వాళ్లే ఏ విధంగా నష్టాలను కలిగిస్తున్నారన్నది ఆదిత్య అసిస్టెంట్ సత్య క్యారెక్టర్ ద్వారా సందేశాత్మకంగా ఆవిష్కరించారు దర్శకుడు. పైరసీ సమస్యను మాత్రమే కాకుండా హీరోలపై అభిమానంతో యువత తమ జీవితాల్ని ఏ విధంగా పాడుచేసుకుంటున్నారు? మితిమీరిన అభిమానం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందనే వాస్తవిక కోణంలో సిరీస్ లో చూపించారు. తమ అవసరాల కోసం అభిమానులను సినిమా ఇండస్ట్రీ ఎలా వాడుకుంటుందో ఆవిష్కరించిన విధానం బాగుంది.
నిర్మాతల వాస్తవిక జీవితం...
నిర్మాతలు లేకుండా సినిమా ఇండస్ట్రీనే లేదు. కానీ సినిమా రూపకల్పనలో నిర్మాతకు ఉండే సాధకబాధకాలేమిటో తమిళ్ రాకర్స్ లో మది క్యారెక్టర్ ద్వారా చక్కగా ఆవిష్కరించారు. . హీరోలతో పాటు వారి తండ్రుల మాటలకు ఎదురుచెప్పలేక, తాము కష్టపడి తీసిన సినిమాలో మార్పులు చేయలేక వారు పడే సంఘర్షణను భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. సినిమానే నమ్ముకొని పిచ్చివాడుగా మారిపోయిన నిర్మాగా ఎం.ఎస్ భాస్కర్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఎంగేజింగ్ గా చెప్పలేదు... (Tamilrockerz web series review)
పైరసీ బ్యాక్ డ్రాప్ అనేది కొత్త పాయింట్ అయినా దానిని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు అరివళగన్ తడబాటుకు లోనయ్యాడు. అందరికి తెలిసిన అంశాలను పైపైన టచ్ చేస్తూ వెళ్లిపోవడంతో అవేవీ పెద్దగా ఆకట్టుకోవు. పైరసీ నేపథ్యానికి రుద్ర వ్యక్తిగత జీవితాన్ని జోడించి స్క్రీన్ ప్లే ద్వారా మ్యాజిక్ చేయాలని చూశారు. అది కథను పూర్తిగా పక్కదారి పట్టించింది. సిరీస్ చాలా వరకు సాగతీతధోరణిలో సాగుతుంది.
రుద్రగా అరుణ్ విజయ్ ప్లస్...
పైరసీ కేసును చేపట్టిన సినిమాలపై ఇష్టంలేని పోలీస్ ఆఫీసర్ రుద్రగా అరుణ్ విజయ్ సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కీర్తనగా ఐశ్వర్య మీనన్ క్యారెక్టర్ నిడివి తక్కువే. వాణి భోజన్ పాత్రలో కొత్తదనం లేదు. దయా క్యారెక్టర్ లో విలనిజం సరిగా పండలేదు. యాక్షన్ స్టార్ ఆదిత్య గా తమిళ అగ్ర హీరో స్ఫూర్తితో ఓ క్యారెక్టర్ పెట్టారు. ఆ పాత్ర కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
సినిమా లవర్స్ కు మాత్రమే
ఎలాంటి ట్విస్ట్ లు, ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ సాగుతుంది. మంచి పాయింట్ ను ఎంచుకున్నా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయారు. అయితే సినిమా లవర్స్ కు మాత్రం ఈ సిరీస్ కొంతవరకు కనెక్ట్ అవుతుంది.