Lucky Baskhar Teaser: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ టీజర్ రిలీజ్.. మిడిల్ క్లాస్ మ్యాన్‌గా అదరగొట్టేశాడు
Lucky Baskhar Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ టీజర్ గురువారం (ఏప్రిల్ 11) రిలీజ్ చేశారు. ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ గా అతడు అదరగొట్టేశాడు.
Lucky Baskhar Teaser: సీతారామం మూవీతో తెలుగు వారికి బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమా టీజర్ గురువారం (ఏప్రిల్ 11) రిలీజైంది. హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి ఇందులో ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది.
లక్కీ భాస్కర్ టీజర్
లక్కీ భాస్కర్ టీజర్లో ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగిగా దుల్కర్ కనిపిస్తున్నాడు. ఆ బ్యాంకులో అందరికీ తలలో నాలుకలా, మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నట్లుగా మొదట్లో టీజర్లో చూపించారు. ఇది చూసి అతడో మామూలు మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. బయటకు మంచి వాడిలా కనిపించే అదే క్యాషియర్.. వెనుక లక్షలు కూడబెడుతుంటాడు.
ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి అకౌంట్లో భారీగా డబ్బు, బంగారు బిస్కెట్లు ఉండటం ఈ టీజర్లో చూపించారు. "మాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ సర్. మేమింతే.. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం" అని దుల్కర్ చెప్పే డైలాగ్ మొత్తం టీజర్ కే హైలైట్ అని చెప్పొచ్చు.
ఈ డైలాగ్ తర్వాత దుల్కర్ అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు మొత్తం పోయినట్లుగా చూపించారు. చివర్లో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనే డైలాగుతో ముగించారు. టీజర్లో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. అతడు అంత డబ్బు ఎలా సంపాదించాడు? ఆ డబ్బుతో ఏం చేశాడన్నది ఈ లక్కీ భాస్కర్ సినిమాలో చూడొచ్చు. టీజర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లక్కీ భాస్కర్ మూవీ జులైలో రిలీజ్ కానుంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్లో అతడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణ వ్యక్తి అసాధారణ ప్రయాణం
నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు నెలల కిందట 'లక్కీ భాస్కర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా అంతా ఒక సాధారణ మనిషి చేసిన అసాధారణమైన ప్రయాణం గురించి అని నిర్మాతలు చెబుతున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి సరికొత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్.
సార్(వాతి) వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని నిర్మాతలు భావిస్తున్నారు.