Derick Abraham Review: డెరిక్ అబ్ర‌హం రివ్యూ - తెలుగులో రిలీజైన‌ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-derick abraham telugu review mammootty crime thriller movie review aha ott malayalam cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Derick Abraham Review: డెరిక్ అబ్ర‌హం రివ్యూ - తెలుగులో రిలీజైన‌ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Derick Abraham Review: డెరిక్ అబ్ర‌హం రివ్యూ - తెలుగులో రిలీజైన‌ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 14, 2024 09:57 AM IST

Derick Abraham Review: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన డెరిక్ అబ్ర‌హం మూవీ ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి షాజీప‌డోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

డెరిక్ అబ్ర‌హం రివ్యూ
డెరిక్ అబ్ర‌హం రివ్యూ

Derick Abraham Review: మ‌మ్ముట్టి (Mammootty) హీరోగా న‌టించిన డెరిక్ అబ్ర‌హం మూవీ ఆహా ఓటీటీలో (Aha OTT) స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి షాజీ ప‌డోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?

అన్న‌ద‌మ్ముల కథ‌...

డెరిక్ అబ్ర‌హం (మ‌మ్ముట్టి) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. తెలివితేట‌లు, ధైర్య‌సాహ‌సాల‌తో తాను చేప‌ట్టిన ప్ర‌తి కేసును సాల్వ్ చేస్తుంటాడు. నాస్తికుల‌ను వ‌రుస‌గా సైమ‌న్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ హ‌త‌మార్చ‌తుంటాడు. ఆ కిల్ల‌ర్‌ను జానీ అనే పోలీస్ ఆఫీస‌ర్ ప‌ట్టుకోలేక‌పోవ‌డంతో డెరిక్ అబ్ర‌హ‌మ్‌కు క‌మీష‌న‌ర్ కేసును బ‌దిలీచేస్తాడు. సైమ‌న్‌ను డెరిక్ అబ్ర‌హం ప‌ట్టుకుంటాడు. కానీ విచార‌ణ‌లో ఉండ‌గా సైమ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు.

డెరిక్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే సైమ‌న్ చ‌నిపోయాడ‌ని భావించి అత‌డిని అధికారులు స‌స్పెండ్ చేస్తారు. మ‌రోవైపు డెరిక్ అబ్ర‌హంపై ప‌గ‌ను పెంచుకున్న దినేష్‌, జాక‌బ్ అనే పోలీస్ అధికారులు డెరిక్ త‌మ్ముడు ఫిలిప్‌ను (అన్సోన్ పాల్‌) అలీనా (త‌రుషి) అనే అమ్మాయి మ‌ర్డ‌ర్ కేసులో ఇరికిస్తారు.

దినేష్‌, జాక‌బ్‌ల‌కు డెరిక్ మాజీ ప్రియురాలు, లాయ‌ర్‌ డ‌యానా (క‌నిహా) కూడా సాయం చేస్తుంది. డెరిక్ చేత‌నే ఫిలిప్‌కు జైలు శిక్ష ప‌డేలా చేస్తారు. దాంతో అన్న‌పై ప‌గ‌ను పెంచుకున్న ఫిలిప్ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. డెరిక్‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు?

ఫిలిప్‌ను ప్రాణంగా ప్రేమించిన అలీనా ఎలా చ‌నిపోయింది? ఆమెను చంపింది ఎవ‌రు? డెరిక్‌పై డ‌యానాతో పాటు దినేష్‌, జాక‌బ్ ఎందుకు ప‌గ‌ను పెంచుకున్నారు? త‌న త‌మ్ముడికి జ‌రిగిన అన్యాయానికి డెరిక్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? శ‌త్రువుల‌ను తెలివిగా ఏ విధంగా దెబ్బ‌కొట్టాడు? సైమ‌న్‌ను లాక‌ప్‌లో ఎవ‌రు చంపారు? అన్న‌దే డెరిక్ అబ్ర‌హం మూవీ క‌థ‌.

క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ మూవీ...

డెరిక్ అబ్ర‌హం క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ పాయింట్‌తో తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ. క‌థ ప‌రంగా చూసుకుంటే రెగ్యుల‌ర్ రివేంజ్ డ్రామా మూవీనే ఇది. కానీ త‌న స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రొటీన్ స్టోరీని ఎంగేజింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్ట‌ర్‌. . చివ‌రి వ‌ర‌కు సినిమా అన్న‌ద‌మ్ముల పోరుతోనే సాగుతున్న‌ట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను డైరెక్ట‌ర్ స‌ర్‌ప్రైజ్ చేశాడు.

మ‌మ్ముట్టి హీరోయిజం...

డెరిక్‌, విలియం మ‌ధ్య చిచ్చు పెట్టి వారు ఒక‌రినొక‌రు కొట్టుకుంటుంటే చూస్తూ ఎంజాయ్ చేసిన విల‌న్స్‌కు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు క‌లిసి ఎలాంటి షాకిచ్చార‌న్న‌ది గూస్‌బంప్స్‌గా అనిపిస్తుంది.

ఆరంభంలో వ‌చ్చే సీరియ‌ల్ కిల్ల‌ర్ ట్రాక్‌, కిడ్నాప్ ఎపిసోడ్‌ను మ‌మ్ముట్టిలోని హీరోయిజాన్ని చూపించ‌డానికే డిజైన్ చేసుకున్న‌ట్లుగా అనిపిస్తాయి. విలియం క్యారెక్ట‌ర్ ఎంట్రీ నుంచే అస‌లైన క‌థ మొద‌ల‌వుతుంది. విలియం ల‌వ్‌స్టోరీ...అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయి మ‌ర్డ‌ర్ కేసులోనే అత‌డు చిక్కుకోవ‌డం, డెరిక్ స్వ‌యంగా కేసును అన్వేషించి త‌మ్ముడిని దోషిగా తేల్చే ఎపిసోడ్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది.

విలియం ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని తెలిసే సీన్‌తోనే సెకండాఫ్ మొద‌ల‌వుతుంది. అన్న‌పై ప‌గ‌తో డెరిక్‌ను చంపేందుకు విలియం చేసే ప్ర‌య‌త్నాల చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. ఛేజింగ్ ఎపిసోడ్‌తో పాటు సూప‌ర్ మార్కెట్ ఫైట్ బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది.

ఇంటిలిజెన్స్ మిస్‌...

చాలా వ‌ర‌కు క‌థ‌లో వ‌చ్చే మ‌లుపులు ప్రెడిక్ట‌బుల్‌గా అనిపిస్తాయి. శ‌త్రువుల‌ను తెలివిగా డెరిక్‌,విలియం బోల్తా కొట్టించే సీన్స్‌ను డైరెక్ట‌ర్ ఇంటెలిజెన్స్ పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

హీరోయిన్ లేదు…

రెగ్యుల‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో హీరో పాత్ర‌ల‌కు భిన్నంగా ఇందులో మ‌మ్ముట్టి క‌నిపిస్తాయి. అత‌డికి జోడీగా హీరోయిన్ ఉండ‌దు. రొమాంటిక్ డ్యూయెట్‌లు, ల‌వ్ ట్రాక్‌లు పెట్ట‌కుండా సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. డెరిక్ క్యారెక్ట‌ర్‌లో యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొడుతూనే ఎమోష‌న్స్ చ‌క్క‌గా పండించాడు మ‌మ్ముట్టి. విలియం పాత్ర‌లో అన్సోన్ పాల్ యాక్టింగ్ ఓకే. సిద్ధిఖీ, సురేష్ కృష్ణ‌, యోగ్ జ‌పీ నెగెటివ్ షేడ్స్ పాత్ర‌లో క‌నిపించారు. గోపీసుంద‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హెల్ప‌యింది.

థ్రిల్లర్ మూవీ లవర్స్ …

డెరిక్ అబ్ర‌హం థ్రిల్ల‌ర్ మూవీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకునే మంచి మూవీ. మ‌మ్ముట్టి యాక్టింగ్‌తో పాటు క‌థ‌లోని ట్విస్ట్‌ల కోసం ఓ సారి చూడొచ్చు.

Whats_app_banner