Food in space: అంతరిక్షంలో ఎలాంటి ఆహారం తింటారు? సునితా విలియమ్స్ ఎముకల సాంద్రత తగ్గడానికి కారణమేంటి?
Food in space: అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు ఏం తింటారనే సందేహం ఉందా? దానికోసం ఆహారం ఎలా నిల్వ చేస్తారో తెల్సుకోండి.
సునితా విలియమ్స్ ఎముకల సాంద్రతను, కండరాల ద్రవ్యరాశిని కోల్పోతున్నారు. నాసా చేపట్టిన మిషన్‌లో అనుకోని సమస్యలు రావడమే దీనికి కారణం. తొమ్మిది రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 50 రోజులకు పైగా ఉండాల్సి వస్తోంది. దీని ప్రభావం తప్పకుండా ఆరోగ్యం మీద పడుతోంది.
గ్రావిటీ లేకపోవడం:
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఎముకల మీద ఎలాంటి బలాలు ప్రయోగించబడవు. భూమిమీద శరీరానికి మద్దతు ఇచ్చేలా ఎముకల మీద బలాలు పనిచేస్తాయి. గ్రావిటీ లేని చోట ఏ బలం పని చేయదు. కండరాల పని తగ్గుతుంది. దాంతో క్రమంగా కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దానివల్ల ఆస్టియోపోరోసిస్, ఎముక కణజాలం దెబ్బతినడం లాంటివి జరగొచ్చు. ఇలాంటి సమయాల్లో వాళ్లు తీసుకునే ఆహారంనుంచి వచ్చే పోషణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంతకీ అంతరిక్షంలో వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెల్సుకోండి.
అంతరిక్షంలో ఆహారం:
అంతరిక్షంలో ఆహారం అనగానే ఏవో కొత్త ఫార్ములాలు కనిపెట్టి తయారు చేయరు. భూమి మీద తినే తిండే అక్కడా ఉంటుంది. కాకాపోతే వేడివేడిగా వండుకుని తినలేరు. రకరకాల పద్ధతుల్లో, ఆహారాల గుణాల్ని బట్టి వాటిని నిల్వ చేస్తారు. వ్యోమగాలములకు కావల్సిన పోషకాలన్నీ అందేలా ఈ ఆహారం ఉంటుంది.
రుచి చూస్తారు:
నాసా ముందుగా ఆహారం రుచి, నాణ్యత, పోషకాలు, వాటి రంగు లాంటివి పరిశీలిస్తుంది. వాటి రుచి వ్యోమగాములకు చూయిస్తుంది. అన్ని రకాలుగా ఆ ఆహారం సంబంధించి వాళ్ల అభిప్రాయమూ తీసుకుంటారు. దాన్ని బట్టి మంచి రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తారు.
నిల్వ చేసే పద్ధతులు:
సహజ పద్ధతిలో:
డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల విత్తనాలు, గింజలు ప్రత్యేకంగా నిల్వ చేయక్కర్లేదు. అలాంటి వాటిని నేరుగానే ఎలాంటి ప్రాసెస్ చేయకుండా పౌచెస్ లో ప్యాక్ చేసి ఉంచుతారు. నేరుగా తినేయొచ్చు.
తాజా ఆహారాలు:
కొన్ని ఆహారాలకు ఎలాంటి ప్రాసెసింగ్, కృత్రిమంగా నిల్వ చేసే పద్ధతులు వాడరు. అలాంటి వాటిలో అరటిపండ్లు, యాపిల్స్ లాంటివి ఉంటాయి.
రిఫ్రిజిరేషన్:
కొన్ని ఆహారాల్ని చల్లటి ప్రదేశంలోనే నిల్వ ఉంచగలం. వాటికోసం రిఫ్రిజిరేషన్ ఏర్పాటు ఉంటుంది. క్రీమ్ చీజ్, సోర్ క్రీమ్ లాంటివి ఈ పద్ధతిలో నిల్వ చేస్తారు.
ఫ్రోజెన్ ఆహారాలు:
కొన్ని రకాల ఆహారాలు ఫ్రీజర్లో పెడితే మంచు ముక్కలు వాటి మీద చేరి రుచి పాడు చేస్తాయి. అందుకే వెంటనే వాటిని ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారు. దాంతో రుచిలో ఎక్కువగా మార్పు రాదు. కీష్ అనే చీజ్, మాంసం, కూరగాయలుండే పీజ్జా లాంటి ఆహారం.. మైదా,కూరగాయ ముక్కలు, చికెన్ ఫిల్లింగ్ వాడి చేసే చికెన్ పాట్ పై లాంటివి ఇలా ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారట.
రీ హైడ్రేషన్:
కొన్ని రకాల ఆహారాల నుంచి నీటిని తొలగించి నిల్వ చేస్తారు. తినే ముందు వీటిలో నీళ్లు కలిపి తింటారు. ఓట్‌మీల్, కొన్ని రకాల సిరియల్స్ లాంటివి దీనికి ఉదాహరణ. కొన్ని రకాల పానీయాలను కూడా ఇలాగే నీరు తొలగించి నిల్వ చేస్తారు.
ఇంటర్మీడియట్ మాయిశ్చర్ ఫుడ్స్:
కొన్ని రకాల ఆహారాల నుంచి పూర్తిగా నీటిని తొలగిస్తే అవి పాడైపోతాయి. అందుకే కాస్త నీటిశాతం అలాగే ఉంచుతారు. దాంతో ఆహారం రుచి పాడవ్వదు. మాంసం, పీచ్ ఫ్రూట్, పియర్ ఫ్రూట్, ఆప్రికాట్ లాంటివి దీనికి ఉదాహరణ.