Darshan Murder Case: హీరో దర్శన్ అరెస్ట్, హత్యకేసుపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదీ.. మరిన్ని చిక్కుల్లో పడినట్లే..-darshan murder case karnataka cm siddaramaiah says no intervention from anyone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darshan Murder Case: హీరో దర్శన్ అరెస్ట్, హత్యకేసుపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదీ.. మరిన్ని చిక్కుల్లో పడినట్లే..

Darshan Murder Case: హీరో దర్శన్ అరెస్ట్, హత్యకేసుపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదీ.. మరిన్ని చిక్కుల్లో పడినట్లే..

Hari Prasad S HT Telugu
Jun 15, 2024 03:16 PM IST

Darshan Murder Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్, అతని హత్య కేసుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు.

హీరో దర్శన్ అరెస్ట్, హత్యకేసుపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదీ.. మరిన్ని చిక్కుల్లో పడినట్లే..
హీరో దర్శన్ అరెస్ట్, హత్యకేసుపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదీ.. మరిన్ని చిక్కుల్లో పడినట్లే.. (Savitha)

Darshan Murder Case: కన్నడ నటుడు, ఈ మధ్యే కాటేరా మూవీతో హిట్ కొట్టిన దర్శన్ ఓ హత్య కేసులో అరెస్టయిన విషయం తెలుసు కదా. కన్నడ ఎంతో సంచలనం రేపుతున్న ఈ కేసు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యా స్పందించారు. ఈ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. దీంతో ఈ నటుడు మరిన్ని చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నాడు.

దర్శన్ కేసులో సీఎం రియాక్షన్ ఇదీ..

నటుడు దర్శన్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం సిద్దరామయ్య స్పందించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. "అతని (దర్శన్) గురించి వినతులు పట్టుకొని నా దగ్గరకు రావద్దు అని సిద్దరామయ్య స్పష్టంగా చెప్పారు" అని ఆ రిపోర్టు తెలిపింది. ఈ హత్య కేసులో దర్శన్ పేరును తప్పించడానికి కర్ణాటకలోని ఓ సీనియర్ మంత్రితోపాటు పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సిద్దరామయ్య రియాక్షన్ వైరల్ అవుతోంది. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరూ చట్టానికి అతీతులు కాదు అని తన కేబినెట్ సహచరులతో సీఎం స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసి, దానిని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉంటే చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే. తన నేతలందరికీ ఈ కేసు విషయంలో పోలీసుల విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని సిద్దరామయ్య తేల్చి చెప్పారు" అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెప్పింది.

దర్శన్ కేసు విషయంలో రాజకీయ జోక్యంపై సిద్దరామయ్య స్పందించారు. "నన్ను జోక్యం చేసుకోవాల్సిందిగా ఏ మంత్రిగానీ, మరొకరు గానీ నా దగ్గరకు రాలేదు" అని చెప్పడం గమనార్హం. ఈ హత్య కేసు విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ఆ రిపోర్టు వెల్లడించింది.

దర్శన్ హత్య కేసు ఏంటి?

కాటేరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు దర్శన్ తన ప్రేయసి, నటి పవిత్రా గౌడ కోసం ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఆమెకు రేణుకా స్వామి అనే వ్యక్తి అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడంటూ మరికొందరితో కలిసి అతన్ని హత్య చేసినట్లు దర్శన్ పై అభియోగాలు ఉన్నాయి. రేణుకాస్వామి.. దర్శన్ కు వీరాభిమాని అని, అయితే అతడు నటి పవిత్రకు సోషల్ మీడియాలో అశ్లీల సందేశాలు పంపినట్లు ఆధారాలు ఉన్నాయి.

దీంతో అతన్ని కిడ్నాప్ చేయించి, తర్వాత చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు దర్శన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు తనపై ఈ హత్యా నేరం రాకుండా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ను కూడా తారుమారు చేయడానికి దర్శన్ ప్రయత్నించినట్లు కూడా అభియోగాలు మోపారు. దీంతో ఈ స్టార్ హీరో చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.

మరోవైపు దర్శన్ కు చాన్నాళ్ల కిందటే పెళ్లయింది. అతనికి 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. హత్య కేసులో దర్శన్ అరెస్టుతో అతని కుటుంబం తీవ్ర వేధింపులు ఎదుర్కొంటోంది. దీనిపై తాజాగా దర్శన్ కొడుకు స్పందించాడు. తనకు అండగా ఉండాల్సిన సమయంలో ఇలా వేధించడం సరికాదని అతడు అన్నాడు.

Whats_app_banner