Kaatera Review: కాటేరా రివ్యూ - ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Kaatera Review: దర్శన్, ఆరాధాన రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ మూవీ కాటేరా ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీకి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించాడు.
Kaatera Review: దర్శన్ హీరోగా నటించిన కన్నడ మూవీ కాటేరా గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించాడు.ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. దర్శన్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే...
కాటేరా పోరాటం...
భీమనహల్లి అనే ప్రాంతంలో ఆర్కియాలజిస్ట్‌లు జరిపిన తవ్వకాల్లో 107 ఆస్తి పంజరాలు దొరుకుతాయి. వాటి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పనిలో ఆర్కియాలజిస్ట్‌లు, పోలీసులు ఉంటారు.దేవరాయ (జగపతిబాబు) అనే భూస్వామిని చంపిన కేసులో కాటేరా (దర్శన్) జైలు శిక్షను అనుభవిస్తుంటాడు. ఊరిలో జరిగే ఓ జాతర కోసం పది రోజులు పెరోల్ మీద కాటేరా జైలు నుంచి బయటకు వస్తాడు.
అతడికి సెక్యూరిటీగా ఓ పోలీస్‌ను (అచ్యుత్ కుమార్) పంపిస్తారు జైలు అధికారులు. జైలు నుంచి విడుదలైన కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? భీమనహల్లి అనే ప్రాంతంలో కమ్మరి (ఇనుప పనిముట్లు) చేసే కాటేరా ఎందుకు జైలుకు వెళ్లాడు? పెద్దలను ఎదురించి కాటేరాను పెళ్లి చేసుకున్న ప్రభావతి (ఆరాధన రామ్) ఎలా చనిపోయింది?
భీమనహల్లి ప్రాంతంలో చాలా ఏళ్లుగా పంటలను సాగుచేస్తోన్న రైతులకు భూమిపై హక్కును కల్పించేందుకు కాటేరా, ప్రభావతి ఎలాంటి పోరాటం చేశారు? దేవరాయ, కాళీగౌడ (వినోద్‌కుమార్) అనే భూస్వాములతో కాటేరాకు ఎందుకు విరోధం ఏర్పడింది? అన్నదే కాటేరా మూవీ కథ.
పీరియాడికల్ యాక్షన్ మూవీ...
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కాటేరాను దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించాడు. ఇదోక మల్టీజోనర్ మూవీగా చెప్పవచ్చు. లవ్ స్టోరీ, కుల వివక్ష, భూసంస్కరణలు, యాక్షన్...పలు అంశాలను ఒకే కథలో ఇమిడ్చి దర్శకుడు తరుణ్ కాటేరా కథను రాసుకున్నాడు.
1970ల కాలానికి ముందు భూములు చాలా వరకు భూస్వాముల చేతుల్లోనే ఉండేవి. భూసంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు భూములను చాలా ఏళ్లుగా సాగుచేస్తోన్న రైతులకు వాటిపై హక్కులను కల్పించాయి. ఆ టైమ్‌లో భూమిపై హక్కుల కోసం పోరాడుతోన్న రైతులకు అండగా కాటేరా ఎలా నిలిచాడు అన్నది డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు. దేశానికి అన్నంపెట్టే రైతు కూడా సైనికుడితో సమానమేనని సందేశాన్ని సినిమా ద్వారా అందించాడు..
కుల వివక్ష...
భూ సంస్కరణల పాయింట్‌తో పాటు కుల వివక్ష నేపథ్యంలో ఓ లవ్‌స్టోరీని సమాంతరంగా నడిపించాడు. 1970 కాలం కుల వివక్ష సొసైటీలో ఎంత బలంగా ఉండేదో కాటేరాలో చూపించారు. అగ్ర కులస్తులు తక్కువ కులం వారిని అంటరానివారిగా ఎలా ట్రీట్‌చేసేవారన్నది కొన్ని సీన్స్, డైలాగ్స్ ద్వారా చాలా లోతుగా డైరెక్టర్ సినిమాలో ఆవిష్కరించారు. కుల వివక్షను గురించి డైరెక్టర్ రాసిన చాలా డైలాగ్స్ ఆలోచనను రేకెత్తిస్తాయి. మరోవైపు కావాలనే ఓ అగ్ర కులాన్ని టార్గెట్ చేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది.
హీరోయిజం పీక్స్...
దర్శన్ క్యారెక్టర్‌లోని హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించాడు. ఒక్కో ఫైట్ సీన్‌ను ఒక్క క్లైమాక్స్‌గా భారీగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. నార్త్ ఇండియా నుంచి వచ్చిన 107 మంది గ్యాంగ్‌ను హీరో సమాధి చేసే సీన్, ఊరిలో ఓ జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి.
ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో చేతులకు సంకెళ్లు వేసి ఉండటంతో నోట్లో కత్తి ఇరికించుకొని అడ్డొచ్చిన విలన్స్ అందరిని చంపే యాక్షన్ ఎపిసోడ్ కాస్త శృతిమించినట్లుగా అనిపిస్తుంది. ఫైట్స్ విషయంలో చాలా చోట్ల లాజిక్స్‌ను వదిలేశారు.
రెండు కథలు..
డైరెక్ట్‌గా కథలోకి వెళ్లకుండా అస్తిపంజరాల మిస్టరీ, ఓ పోలీస్ ఆఫీసర్‌తో దర్శన్ తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం..ఇలా రెండు కోణాల నుంచి కథ సాగుతుంది. చివరకు వాటిని లింక్ చేయడం బాగుంది.
కాటేరా పాయింట్‌లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. భూస్వాములపై హీరో ఎదురుతిరగడం అనే పాయింట్‌తో దక్షిణాదిలో ఎన్నో సినిమాలొచ్చాయి. కాటేరా బ్యాక్‌డ్రాప్, సెటప్ చాలా చోట్ల రంగస్థలం సినిమాను గుర్తుకుతెస్తుంది. దర్శన్ ఓల్డ్ గెటప్ తాలూకు మేకప్ సరిగా సెట్ కాలేదు.
మాస్ రోల్‌లో దర్శన్...
కాటేరాగా దర్శన్ కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో మెప్పించాడు. యువకుడిగా, వృద్ధుడిగా రెండు షేడ్స్‌తో అతడి పాత్ర సాగుతుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ ఈ మూవీతోనే హీరోయిన్‌గా సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
రైతుల కోసం పోరాడే ధైర్యవంతురాలైన యువతిగా తన యాక్టింగ్‌తో పర్వలేదనిపించింది. ఈ సినిమాలో విలన్ పాత్రల్లో తెలుగు నటులు జగపతిబాబు, వినోద్‌కుమార్ కనిపించారు. జగపతిబాబు విలనిజం రొటీన్‌గా ఉంది. అతడి లుక్ డిఫరెంట్‌గా ఉన్న హీరోకు ధీటుగా విలనిజం పండలేదు. వినోద్‌కుమార్ డేంజరస్ విలన్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసి చివరకు తుస్ మనిపించారు.
ఎలివేషన్స్ కోసం...
కాటేరా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ మూవీ. దర్శన్ ఫైట్ సీక్వెన్స్, మాస్ ఎలివేషన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. దాదాపు మూడు గంటల నిడివి ఈ సినిమాకు పెద్ద మైనస్. కాస్త ఓపికగా చూస్తే ఓకే అనిపిస్తుంది.