Vikram: మాలాంటి వాళ్లకు ఒక హోప్ ఇచ్చారు.. పవన్ కల్యాణ్ రాజకీయాలపై హీరో విక్రమ్ కామెంట్స్
Chiyaan Vikram About Pawan Kalyan In Thangalaan Press Meet: తమిళ హీరో చియాన్ విక్రమ్, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తంగలాన్ మూవీ ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయన్ని చెప్పారు హీరో విక్రమ్.
Chiyaan Vikram About Pawan Kalyan: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రానికి డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించారు. తంగలాన్ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 5న తంగలాన్ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయాలపై విక్రమ్ కామెంట్స్ చేశారు.
హీరో విక్రమ్ మాట్లాడుతూ.. "పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. పా రంజిత్‌తో మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన తంగలాన్ కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ" అని తెలిపారు.
"బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా.. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు" అని విక్రమ్ అన్నారు.
"సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. తంగలాన్ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్‌లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని అన్నారు. కానీ తంగలాన్‌లో అన్ని అంశాలు ఉన్నాయి" అని విక్రమ్ పేర్కొన్నారు.
"క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటల పాటు మేకోవర్‌కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా లేదా అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ మీ నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి" అని విక్రమ్ అన్నారు.
"ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్‌లో సీన్స్ చేశాం. ఆ సీన్‌లో 30 టేక్స్ ఉన్నా.. సింగిల్ షాట్‌లోనే చేసేవాళ్లం. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్‌లో మిమ్మల్ని ఈ సినిమా సర్‌ప్రైజ్ చేస్తుంది" అని విక్రమ్ తెలిపారు.
"పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్క్ అంటే నాకు ఇష్టం. ఆయన పదేళ్లు రాజకీయాల్లో కష్టపడి ఇప్పుడు డిఫ్యూటీ సీఎం అయ్యారు. అది సాధారణ అఛీవ్‌మెంట్ కాదు. మాలాంటి వాళ్లకు పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటే ఆయన ఒక హోప్ ఇచ్చినట్లు అయ్యింది" విక్రమ్ చెప్పుకొచ్చారు.