Chandu Champion box office: చందు ఛాంపియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. తొలి రోజు మరీ దారుణంగా..
Chandu Champion box office: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ శుక్రవారం (జూన్ 14) రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మరి తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Chandu Champion box office: బాలీవుడ్ లో వచ్చిన మరో లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా చందు ఛాంపియన్. కార్తీక్ ఆర్యన్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకులు ఈ సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ మూవీకి మాత్రం ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.
చందు ఛాంపియన్ బాక్సాఫీస్
కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన చందు ఛాంపియన్ మూవీకి తొలి రోజు ఇండియా డొమెస్టిక్ మార్కెట్లో కేవలం రూ.3.97 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించాడు. అయితే అతనికి గత ఎనిమిదేళ్లలో ఇదే అతి తక్కువ ఓపెనింగ్స్ కావడం గమనార్హం.
2017లో కార్తీక్ ఆర్యన్ నటించిన గెస్ట్ ఇన్ లండన్ మూవీకి ఇంతకంటే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇదే తొలిసారి. 2018లో వచ్చిన సోనూ కే టీటూ కీ స్వీటీ మూవీకి రూ.6.42 కోట్లు, లూకా చుప్పీకి రూ.8.01 కోట్లు, పతీ పత్నీ ఔర్ వో మూవీకి రూ.9.10 కోట్లు, లవ్ ఆజ్ కల్ మూవీకి రూ.12 కోట్లు వచ్చాయి. కానీ చందూ ఛాంపియన్ మూవీకి మాత్రం ఇంత తక్కువ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కార్తీక్ ఆర్యన్ చివరి మూవీ సత్యప్రేమ్ కీ కథ కూడా తొలి రోజు రూ.8.25 కోట్లు వసూలు చేసింది. చందు ఛాంపియన్ మూవీ ప్రమోషన్లు కూడా బాగానే నిర్వహించారు. అయినా సినిమాకు ఓపెనింగ్స్ లేకపోవడం మేకర్స్ ను షాక్ కు గురి చేస్తోంది. అయితే తొలి రోజే సినిమాకు మంచి టాక్ రావడంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరగొచ్చని భావిస్తున్నారు.
చందు ఛాంపియన్ మూవీ ఏంటి?
చందు ఛాంపియన్ మూవీని సాజిద్ నదియావాలా, కబీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశారు. ఓ అథ్లెట్ సక్సెస్ కోసం పడే శ్రమ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో చందు అనే పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. ఇండియాకు ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ లో తొలి పారాలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ తోపాటు శ్రేయస్ తల్పడే, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన కబీర్ ఖాన్ గత మూవీ 83 కూడా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. 1983లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ విజయంపై తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రణ్‌వీర్ సింగ్ అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషించాడు.
ఆ సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన మేర కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మరి ఇప్పుడు ఈ చందు ఛాంపియన్ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి ఎన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి.
టాపిక్