Censor Board: తెలంగాణ సినిమా అంటే మద్యం సన్నివేశాలు కాదని చెప్పే చిత్రం: సెన్సార్ బోర్డ్ టీమ్-censor board praises sharathulu varthisthai movie and gives clean u certificate ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Censor Board: తెలంగాణ సినిమా అంటే మద్యం సన్నివేశాలు కాదని చెప్పే చిత్రం: సెన్సార్ బోర్డ్ టీమ్

Censor Board: తెలంగాణ సినిమా అంటే మద్యం సన్నివేశాలు కాదని చెప్పే చిత్రం: సెన్సార్ బోర్డ్ టీమ్

Sanjiv Kumar HT Telugu
Mar 14, 2024 08:21 AM IST

Censor Board About Sharathulu Varthisthai: 30 వెడ్స్ 21 యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన చైతన్య రావు హీరోగా నటించిన మరో సినిమా షరతులు వర్తిస్తాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ వివరాల్లోకి వె ళితే..

తెలంగాణ సినిమా అంటే మద్యం సన్నివేశాలు కాదని చెప్పే చిత్రం: సెన్సార్ బోర్డ్ టీమ్
తెలంగాణ సినిమా అంటే మద్యం సన్నివేశాలు కాదని చెప్పే చిత్రం: సెన్సార్ బోర్డ్ టీమ్

Sharathulu Varthisthai Censor Board: యూట్యూబ్ సిరీస్‌తో క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లో హీరోగా, నటుడిగా మంచి స్థానం సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు చైతన్య రావు. తాజాగా చైతన్య రావు హీరోగా నటించిన మరో కొత్త సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాలో చైతన్య రావుకు జోడీగా భూమి శెట్టి నటించింది. బిగ్ బాస్ కన్నడ షో ద్వారా పాపులర్ అయిన భూమి శెట్టి ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

షరతులు వర్తిస్తాయి చిత్రాన్ని కుమార‌స్వామి (అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ్రీలత, నాగార్జున సామ‌ల‌, శారదా, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ (Central Board of Film Certification) జారీ చేశారు.

ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా డైరెక్టర్ కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుల్లో ఒకరు. ఈ విషయం తెలియకుండా సినిమా వీక్షించిన బోర్డ్ మెంబర్స్ తమ సభ్యుడు ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సెన్సార్ బృందం స్పందిస్తూ.. "తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి ఉంది. ఇందులో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది" అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పన్నెండు గుంజలా పెళ్లి పందిరి అనే పాట ప్రస్తుతం తెలంగాణలో బాగా హిట్ అయింది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు దక్కడం సినిమా విజయం పట్ల మరింత నమ్మకాన్ని పెంచుతోందని సినిమా టీమ్ చెబుతోంది. ఇక సినిమాలో చైతన్య రావు, భూమి శెట్టితోపాటు నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు నటిస్తున్నారు.

ఇక షరతులు వర్తిస్తాయి సినిమాలో హీరో హీరోయిన్ల పేరు చిరంజీవి, విజయ శాంతి అని పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ విజయశాంతికి నివాళిగా వారి పేర్లు పెట్టినట్లు ట్రైలర్ ఈవెంట్‌లో హీరో చైతన్య రావు తెలిపారు. 80వ కాలంలో ఈ జంటకు మంచి పాపులారిటీ ఉంది. అందుకే వారికి ట్రిబ్యూట్‌గా వారి పేర్లను పెట్టినట్లు చెప్పుకొచ్చాడు చైతన్య రావు. ఇంకా తాను విజయశాంతి పాత్రలో భూమి శెట్టి బాగా నటించిందని చైతన్య రావు పేర్కొన్నాడు.