Brahmamudi: ఆ హీరోలు నా కొడుకులే.. బ్రహ్మముడి అపర్ణ షాకింగ్ కామెంట్స్
Brahmamudi Fame Sripriya Shreekar: బ్రహ్మముడి సీరియల్‌లో అపర్ణ పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీప్రియ శ్రీకర్ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీప్రియ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Sripriya Shreekar About Heroes: తెలుగులో బ్రహ్మముడి సీరియల్ దూసుకుపోతోంది. ఇందులో ప్రతి పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే బ్రహ్మముడిలో అపర్ణ పాత్రలో కొడుకుపై ప్రేమ ఉన్న తల్లిగా, కాస్తా అహంకారం ఉన్న అత్తగా రెండు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు శ్రీప్రియ శ్రీకర్. విజయవాడకు చెందిన శ్రీప్రియ సంధ్యారాగం సీరియల్‌లో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. అనంతరం కొంత గ్యాప్ తర్వాత మొగలి రేకులు సీరియల్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు.
రజనీ పాత్రతో
మొగలి రేకులు సీరియల్‌లో రజనీగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీప్రియ ఇప్పుడు బ్రహ్మముడి ధారావాహికలో అపర్ణగా అలరిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ మంచి ఆదరణతో దూసుకుపోతున్న క్రమంలో అందులోని నటీనటుల విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కూతుళ్లకు తల్లిని
ఇంటర్వ్యూలో తల్లి పాత్రలకు సంబంధించిన ప్రశ్న శ్రీప్రియకు ఎదురైంది. "మొగలి రేకులు సీరియల్ నుంచి తల్లి పాత్రలు చేస్తున్నాను. అందులో నేను దేవి క్యారెక్టర్‌కు తల్లిగా రజనీ పాత్రలో నటించాను. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. వైదేహి పరిణయం, బ్రహ్మముడి సీరియల్స్ చేస్తున్నాను. టీవీ ఇండస్ట్రీలో ఉన్న సగం మంది కూతుళ్లకు నేనే తల్లిని" అని శ్రీప్రియ శ్రీకర్ తెలిపారు.
బాధ ఇలా తీరింది
"ఇక కొడుకుల విషయానికొస్తే చాలా మంది సీరియల్ హీరోలకు నేను తల్లిగా చేశాను. ఏదైనా ఈవెంట్‌కు వెళితే అందరూ హాయ్ అమ్మ అని పిలుస్తూనే ఉంటారు. నిజానికి నాకు ఇద్దరు ఆడ పిల్లలు. నాకు బాబులు అంటే చాలా ఇష్టం. ఈ విధంగా నాకు దేవుడు కొడుకులను ఇచ్చాడని సంతోషంగా ఫీలవుతాను. వాళ్లనే నా కొడుకులు అనుకుంటాను. కొడుకు లేడనే బాధ ఇలా తీరిపోయింది" అని బ్రహ్మముడి అపర్ణ అలియాస్ శ్రీప్రియ చెప్పుకొచ్చారు.