Atharva OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Atharva OTT Release Date: అథర్వ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ డిటైల్స్ ఇక్కడ చూడండి.
Atharva OTT Release Date: క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు, అథర్వ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది.
అథర్వ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.
“సబ్‍స్క్రైబర్లకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీమ్‍లోని బయోమెట్రిక్ అనలిస్ట్ ప్రయత్నిస్తారు. ఇన్వెస్టిగేషన్ సంక్లిష్టంగా మారుతుంది. మరి మిస్టరీని అతడు ఛేదించగలిగాడా” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది. అలాగే, జనవరి 18న అథర్వ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
అథర్వ చిత్రంలో కార్తీక్ రాజుతో పాటు పాగల్ మూవీ ఫేమ్ సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్ర పోషించారు. ఐరా జైన్, అరవింద కృష్ణ, మరిముత్తు, విజయ్ రామరాజు, కబీర్ సింగ్ కీరోల్స్ చేశారు. మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా.. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ చేశారు.
అథర్వ స్టోరీ ఇదే..
దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే, అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీమ్‍లో జాయిన్ అవొచ్చని ఓ వ్యక్తి సలహా ఇస్తాడు. దీంతో ఆ దిశగా అతడు ప్రయత్నాలు చేస్తాడు. మొత్తంగా క్లాస్ టీమ్‍లో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను అథర్వ అలియాజ్ కర్ణ పరిష్కరిస్తాడు. ఈ క్రమంలో తాను కాలేజీలో లవ్ చేసిన నిత్య (సిమ్రన్ చౌదరి)ని ఓ సంఘటన ప్రదేశంలో అథర్వ కలుస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరవుతారు. సినీ నటి జోష్ని హుపారికర్ (ఆర్య జైన్)ను అథర్వకు నిత్య పరిచయం చేస్తుంది. అయితే, తన ఫ్లాట్‍లో తన బాయ్‍ఫ్రెండ్ శివతో కలిసి జోష్ని చనిపోయి కనిపిస్తుంది. జోష్నిని కాల్చి చంపి.. శివ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తారు. అయితే, నిత్య ఆ విషయాన్ని నమ్మదు. దీంతో అథర్వ ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. జోష్ని, శివ ఎలా చనిపోయారు? వారి మర్డర్ మిస్టరీని అథర్వ ఛేదించాడా? ఈ క్రమంలో అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటి? అనే విషయాలు అథర్వ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్ ప్లస్ అయ్యాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా ఉంటుంది. చరణ సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.