Atharva Movie Review: అథర్వ మూవీ రివ్యూ - కార్తిక్ రాజు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Atharva Movie Review: కార్తిక్‌రాజు, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన అథర్వ మూవీ శుక్రవారం రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
Atharva Movie Review: కార్తిక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన అథర్వ మూవీ డిసెంబర్ 1న (నేడు) థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ట్రైలర్, టీజర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
అథర్వ ఇన్వేస్టిగేషన్...
దేవ్ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని ప్రయత్నించి విఫలమవుతాడు. అస్తమా కారణంగా అతడి కల తీరదు. చివరకు క్లూస్‌లో టీమ్‌లో జాయిన్ అవుతాడు. తన తెలివితేటలకు తగ్గ ఛాలెంజింగ్ కేసు కోసం కర్ణ ఎదురుచూస్తుంటాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నిత్య (సిమ్రాన్ చౌదరిని) అనే అమ్మాయిని ఇష్టపడతాడు కర్ణ. కానీ ఆ ప్రేమను బయటకు చెప్పలేకపోతాడు.
క్లూస్ టీమ్‌లో జాయిన్ అయిన కర్ణకు మళ్లీ నిత్య ఎదురుపడుతుంది. క్రైమ్ రిపోర్టర్‌గా నిత్య పనిచేస్తుంటుంది. నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) ఓ హీరోయిన్. ఓ రోజు జోష్ని ఇంటికి కర్ణ, నిత్య వెళ్లేసరికి ఆమె రక్తపుమడుగులో ఉంటుంది. అదే ఇంట్లో జోష్ని బాయ్‌ఫ్రెండ్ శివ (శివ) డెడ్‌బాడీ కూడా దొరుకుతుంది. శివనే జోష్నిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తారు. కానీ వారిది ఆత్మహత్య కాదు హత్య అని నిత్య అనుమానపడుతుంది.
ఆమె అనుమానం నిజమైందా? జోష్ని, శివలను చంపింది ఎవరు? ఒక్క క్లూ కూడా లేని ఈ మర్డర్ కేసును సాల్వ్ చేయడంలో శివ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడు. ? ఈ హత్యలతో అరవింద్ కృష్ణ, కబీర్‌సింగ్ దుహాన్‌లకుఎలాంటి సంబంధం ఉంది అన్నదే అథర్వ సినిమా కథ.
క్లూస్ టీమ్ బ్యాక్‌డ్రాప్‌లో...
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ కథలు చాలా వరకు పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంటాయి. కానీ వాటికి భిన్నంగా క్లూస్ టీమ్ నేపథ్యంలో దర్శకుడు మహేష్ రెడ్డి అథర్వ సినిమాను తెరకెక్కించాడు. క్రైమ్ సాల్వ్‌లలో క్లూస్ టీమ్ ప్రాముఖ్యత ఏంటి? ఆధారాల సేకరణలో వారు ఎలా ఆలోచిస్తుంటారు? ఎలాంటి ఎత్తులు వేస్తారన్నది రియలిస్టిక్‌గా హీరో పాత్ర ద్వారా చూపించారు డైరెక్టర్. ఆ ఇన్వేస్టిగేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. రొటీన్ కథే అయినా బ్యాక్‌డ్రాప్ కారణంగా ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ కలుగుతుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది...
కర్ణ పోలీస్ కావాలని ప్రయత్నాలు చేసి విఫలం కావడం, ఆ తర్వాత క్లూస్ టీమ్‌లో జాయిన్ అయ్యి ఓ దొంగతనం కేసును సాల్వ్ చేసే అంశాలతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. నిత్యతో లవ్ స్టోరీ నడిపించి టైమ్‌పాస్ చేశాడు. జోష్ని మర్డర్ తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. శివ, జోష్ని మర్డర్ కేసులో ఆధారాల కోసం కర్ణ కర్ణాటక వరకు వెళ్లడం, ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ తాలూకు ఓ చిన్న క్లూ ద్వారా ఒక్కో సాక్ష్యాన్ని సేకరించే ట్విస్ట్‌లను దర్శకుడు బాగా రాసుకున్నాడు.
జోష్నితో పనిచేసిన హీరోపై అనుమానం కలిగేలా రాసుకున్న ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అసలు శివ, జోష్ని ఎలా చనిపోయారు? అసలైన హంతకుడిని కర్ణ ఎలా పట్టుకున్నాడన్నది ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో థ్రిల్లింగ్‌గా చూపించారు. చివరలో సారా వర్గీస్ మర్డర్‌తో సీక్వెల్‌ను అనౌన్స్‌చేశారు. చివరలో అయిల్ డ్రిల్లింగ్ మాఫియా అంటూ కొత్త నేపథ్యాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.
రొటీన్ స్క్రీన్‌ప్లే...
క్లూస్ టీమ్ బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్నా మిగిలిన కథ చాలా వరకు రొటీన్‌గానే సాగుతుంది. ఇన్వేస్టిగేషన్ సీన్స్ ప్రాసెస్‌లో కొన్ని చోట్ల ఆర్టిఫీషియల్ గా సాగుతాయి. ఎలాంటి నేరాన్నైనా ఈజీగా కనిపెట్టే హీరో జోష్ని మర్డర్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు కళ్ల ముందే కనిపెట్టకపోవడం లాజిక్‌లకు అందదు. తన కన్వీనెన్స్ కోసమే దర్శకుడు ఆ సీన్స్‌ను రాసుకున్నట్లుగా అనిపిస్తుంది.
సీరియస్ రోల్‌లో...
కర్ణగా అథర్వ నటన బాగుంది. సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గత సినిమాలో పోలిస్తే నటన పరంగా పరిణితి కనిపించింది. సిమ్రాన్ చౌదరి గ్లామర్‌తో మెప్పించింది. సీనియర్ నటుడు ఆనంద్‌తో పాటు కబీర్‌సింగ్ దుహాన్, అరవింద్ కృష్ణ ప్రాముఖ్యమున్న పాత్రల్లో కనిపించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారిని అథర్వ సినిమా మెప్పిస్తుంది.
బలాలు
కథ, బ్యాక్‌డ్రాప్, కొన్ని మలుపులు
కార్తిక్ రాజు యాక్టింగ్
బీజీఎమ్
బలహీనతలు
రొటీన్ స్క్రీన్‌ప్లే
హాస్ట్ హాఫ్
లాజిక్‌లకు దూరంగా సాగే కొన్ని సీన్స్
రేటింగ్: 2.75/ 5