Asha Borra About Family Star Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పరుశురామ్ పెట్ల కాంబినేషన్‌లో రెండోసారి వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఇదివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయినప్పటికీ పలు విమర్శలు ఎదుర్కున్న విజయ్ దేవరకొండకు గీత గోవిందం చిత్రం మాత్రం చాలా మంచి డీసెంట్ హిట్ ఇచ్చింది.
అలాంటి గీత గోవిందం కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఏప్రిల్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీపై మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగెటివిటీ చాలా ప్రచారం అవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఆశా బొర్రా ఫ్యామిలీ స్టార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మూవీలో తన సన్నివేశాలు తొలగించడంపై అసహనం వ్యక్తం చేసింది.
"నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టఫ్‌గా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకుండా ఇంకేమవుతుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్‌కు కంగ్రాట్స్ అండ్ అభినందనలు. సీన్లు, సాంగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్లు, ఇంటరాక్షన్లు.. అబ్బబ్బబ్బ.. ఏం లేవని చెప్పాలి సినిమాలో. అన్నింట్లో నేనేగా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు అండ్ టీమ్" అని ఆశా బొర్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
"ఇంతోటి అప్పియరెన్స్‌కి నా టైం వేస్ట్ చేసి మీ సమయం వృథా చేసుకుని ఎందుకు అనవసరమైన ఫోన్లు, హంగామా. మీరు ఈ క్యారెక్టర్ చేయండి అని అసోసియేట్ డైరెక్టర్ నుంచి క్యాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్ కాల్స్. అయినా హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందో. లేక సోషల్ మీడియా ఫేసెస్ వాడుకోవాలని చేశారో తెలియదు" అని ఆశా బొర్రా గట్టిగానే చురకలు అంటించింది.
"మా పనులు మానుకుని, ఫ్యామిలీని వదిలేసి, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. ఆరోగ్యం పూర్తిగా బాగాలేకపోయిన షూట్ డేస్‌కు వస్తాను అని ఇచ్చిన మాట కోసం వచ్చి ఒక రోజంతా ఉన్నాను. యాంటీబయోటిక్స్ వేసుకుని మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు నిలబడి పని చేశాను. కనీసం ఒక డైలాగ్ అయినా ఉంటే ఇంత రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో" అని ఆశా బొర్రా తన ఆవేదన చెప్పుకున్నారు.
"ఇస్తామన్న రెమ్యునరేషన్, ట్రావెల్ ఖర్చులు, హోటల్ స్టే డబ్బులు ఇవ్వకుండా మాకు ఏంటీ సంబంధం అన్నట్లు సరిగ్గా రెస్పాండ్ కూడా కాకుండా చాలా గ్రేట్. కనీసం విజయ్ దేవరకొండకు నాకు ఉన్న కన్వర్జేషన్ ఉంచినా కొంత సంతృప్తి ఉండేదేమో. మీ ఎడిటింగ్‌కు ఒక దండం. ఇలా జరగడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మరోసారి నా కళ్లు తెరిపించారు" అని నటి ఆశా బొర్రా లాంగ్ నోట్ రాసుకొచ్చారు.
కాగా సోషల్ మీడియాలో ఇద్దరు కూతుళ్లతో కలిసి వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు ఆశా బొర్రా. ఆమె ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రారంభమైన వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి ఒకే ఒక్క సీన్‌లో కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తారు. తనతో చాలా షూటింగ్ చేసి ఈ ఒక్క సీన్ ఉంచడంపై ఆశా బొర్రా మూవీ టీమ్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.